మోత కష్టం, లేత కొండలవి!

Sakshi Editorial On Natural Disaster

ప్రకృతిని లెక్కజేయని మనిషి తత్వం తీరని ఉపద్రవాలు తెస్తోంది. ప్రాణ, ఆస్తి నష్టాలకు కారణ మౌతోంది. ప్రపంచాన్ని వణికిస్తున్న చైనా జనిత కరోనా మహమ్మారి నుంచి... అదే చైనా నేలపై వెయ్యేళ్లలో లేని వర్షాలు జనావాసాలను ముంచెత్తడం వరకు ఇవన్నీ ప్రకృతి చెబుతున్న పాఠాలే! అయినా మనిషి నేర్చుకుంటున్నదెక్కడ? అనావృష్టి, అతివృష్టి, ఎన్నడూ లేని ఎండలు, వరదలు– వడగాలులు, కరుగుతున్న ధ్రువాలు, పెరుగుతున్న సముద్ర మట్టాలు... ఈ రోజు ప్రపంచమంతా అసాధారణ వాతావరణ పరిస్థితుల్ని చవిచూసి, దుష్ఫలితాలు అనుభవిస్తోంది. అర్ధ శతాబ్దిలో లేని వర్షాలు అయిదారు రోజుల పాటు మహారాష్ట్రను ముంచెత్తి అతలాకుతలం చేశాయి. హిమాచల్‌ ప్రదేశ్, సిర్‌మౌర్‌ జిల్లాలో తాజాగా కొండ చరియ విరిగి, క్షణాల్లో వంద మీటర్ల మేర జాతీయ రహదారి అమాంతం లోతైన లోయలోకి జారిన తీరు గగుర్పాటు కలిగించింది. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం లేదు గానీ, వందలాది వాహనాలు ఎటూ వెళ్లే దారిలేక కొండల్లో చిక్కుబడిపోయాయి. ఈ వారంలోనే కిన్నౌర్‌ జిల్లాలో కొండచరియలు విరిగి తొమ్మిది మంది యాత్రికులు మరణించారు. ఒక్క హిమాచలే కాదు, ఉత్తరాఖండ్‌ తదితర హిమాలయ రాష్ట్రాల్లో ఇది తరచూ జరుగుతోంది. ప్రకృతి సమతుల్యతకు విఘాతం కలిగించేలా జలవిద్యుత్‌ ప్రాజెక్టులు, బహుళ అంతస్తు భవనాలు, అడ్డదిడ్డం రోడ్లు, ఆ క్రమంలో... అడవుల్ని నరకడం వంటి మానవ చర్యలు భూమ్యావరణ స్థితికి భంగం కలిగిస్తున్నాయి. ప్రమాదాల్ని ఆహ్వానించి విపత్తులు పెంచుతున్నాయి. భూభౌతిక పరిణామ ప్రభావాలకు తోడు మానవ ప్రమేయ కారణాలు, తాజాగా తలెత్తిన పర్యావరణ మార్పు ప్రతికూల తలు వెరసి కొత్త సమస్యలు తెస్తున్నాయి. విపత్తుల్ని ఇంకా తీవ్రం చేస్తున్నాయి. వీటిని శాస్త్రీయంగా అధ్యయనం చేసి, విపత్తులు... తట్టుకునే (రెసిలియెన్స్‌), సమర్థంగా ఎదుర్కొనే (మిటిగేషన్‌), ఏదోలా సర్దుకునే (అడాప్టబిలిటీ) సామర్థ్యాల్నిచ్చే వ్యవస్థలను ఏర్పాటు చేసుకోలేకపోతున్నాం. ఇందుకు అవసరమైన నిర్దిష్ట కార్యాచరణలో వరుస ప్రభుత్వాలు విఫలమౌతున్నాయి.

ప్రపంచంలోనే అత్యంత యువ పర్వతశ్రేణి హిమాలయాలు. భారత–యూరేషియా ప్లేట్లు ఢీకొంటున్న ప్రక్రియ వల్ల టిబెట్‌ పీఠభూమి, హిమాలయాలు ఏర్పడ్డాయి. 50 మిలియన్‌ సంవ త్సరాల కింద మొదలైన ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. అందుకే, అత్యంత ఎత్తుగా, సున్ని తంగా, కుదురుకుంటున్న స్థితిలో ఉంటాయీ పర్వతాలు. దానికి తోడు హిమంతో కప్పుకొని ఉండటం కూడా సున్నితత్వం పెంచేదే! ఏ ఆరావళి పర్వతశ్రేణి లాగో, మరే తూర్పు–పశ్చిమ కను మల్లాగానో పురాతన శ్రేణి కాదిది. మానవ కల్పిత పర్యావరణపరమైన ఒత్తిళ్లను హిమాలయాలు తట్టుకోలేవు. కొత్తగా పోసిన ఇసుక రాసిలాగా కిందకు జారే తత్వం ఎక్కువ! పొరలు గట్టిపడలేదు కనుక కొండచరియలు విరిగిపడటం సహజం. దానికి తోడు విశ్వవ్యాప్తంగా పెరిగిన కర్బన ఉద్గారాలు, ఇతర కాలుష్యాల వల్ల భూతాపోన్నతి పెరుగుతోంది, మంచు కరుగుతోంది. మేఘ విస్పోటనాల వల్ల నిమిషాల్లో కుంభవృష్టి కురిసి కొండ చరియలు అమాంతం విరిగిపడుతున్నాయి. ఈ పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకోకుండా చేస్తున్న మానవ ప్రమేయ, ప్రేరిత చర్యలు విపత్తులు పెంచి, సమస్యను జటిలం చేస్తున్నాయి. గడచిన ఒకటిన్నర దశాబ్దాలుగా హిమాలయ రాష్ట్రాల్లో తలెత్తిన ఎన్నో ఉపద్రవాలకు, ప్రాణ–సంపద నష్టాలకు మనం ప్రత్యక్ష సాక్షులం. ఇక ప్రకృతి, పర్యావరణపరమైన నష్టాలకు కొలతలే లేవు! కేదార్‌నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి... చార్‌ధామ్‌ పుణ్యక్షేత్ర సముదాయపు దారుల్ని చుట్టుముట్టి, కన్నీళ్లు మిగిల్చిన పెద్ద జలవిలయాన్ని లోగడ మనం చూశాం. ఇదంతా భూకంప ఆస్కారపు మండలమే (సీస్మిక్‌ జోన్‌)! రిక్టర్‌ స్కేల్‌ పైన 3, 4, 5 నమోదయ్యే భూకంపాలు తరచూ జరిగేవే! 1999లో మన దగ్గర, 2015లో నేపాల్‌ (ఖాట్మండు)లో పెద్ద భూకంపాలొచ్చి తీరని నష్టం జరిగింది. ఇంకో పెద్ద భూకంపానికి ఆస్కారం ఉందని భౌగోళిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో... సహజ నదీ ప్రవాహాలకు అడ్డుకట్టలు, జల విద్యుత్‌ ప్రాజెక్టులు, పట్టణీకరణ, అశాస్త్రీయ రహదారుల ఏర్పాటు, ఆ మేర అడవుల నరికివేత... ఇవన్నీ విఘాతాలే!

 స్తంభం నుంచి ఊడి నేలకొరిగిన విద్యుత్‌ వైర్‌తో ప్రమాద ఆస్కారం ఎప్పుడూ ఉంటుంది. దానికి మనిషో, మరే జంతువో తగులుకున్నప్పుడది ప్రమాదం కింద మారుతుంది! హిమాలయ పర్వత సానువుల్లో విపత్తు ఆస్కారం నిరంతరం ఉంటుంది. పనిగట్టుకొని మనిషి అందులోకి చొర బడి, సదరు ఆస్కారాన్ని విపత్తుగా మారుస్తున్న సందర్భాలే ఎక్కువ. పెట్రోల్, డీజిల్‌ వంటి శిలాజ ఇంధన వాడకం తగ్గించడమనే కారణం చూపి, చౌక జలవిద్యుత్తు ఉత్పత్తి పేరుతో అరాచకం సృష్టిస్తున్నారు. స్వార్థం హద్దులు దాటుతోంది. సహజ జలధారల్ని అడ్డగించి, 25 శాతం నీటిని రిజర్వాయర్లలో బంధించి, 75 శాతం నీటిని టన్నెల్స్‌ ద్వారా పంపించడం ప్రమాదహేతువని నేపాల్‌ భూకంపాన్ని అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కానీ, 2018–19 లో సట్లెజ్‌లోయ ప్రాంతాన్ని సందర్శించిన పార్లమెంట్‌ (ఇంధన) స్థాయీ సంఘం, ప్రస్తుత జలవిద్యుదుత్పత్తి 10,547 మెగావాట్లు, దీన్ని రెట్టింపు చేసుకోవచ్చు, చేసుకోండని సూచించడాన్ని ఎట్లా అర్థం చేసు కోవాలి? అందుకే, ప్రభుత్వాలకు ప్రజా ప్రయోజనాలు కల్పించే తెలివిడే కాదు, ప్రకృతిని పరిరక్షించి విపత్తుల నుంచి వారిని కాపాడే ఇంగితం, దూరదృష్టి కూడా ఉండాలి. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top