గుజరాత్‌లో ‘నరేంద్ర’జాలం

Sakshi Editorial On BJP Won In Gujarat Assembly Elections 2022

ఢిల్లీ స్థానిక ఎన్నికల ఫలితాలతో నిర్ఘాంతపోయిన బీజేపీకి గుజరాత్‌ ఓటర్లు గురువారం ఊహాతీతమైన విజయాన్ని అందించి సాంత్వనపరిచారు. అక్కడ వరసగా ఏడోసారి అధికారం అప్ప గించటం మాత్రమే కాదు... ఆ పార్టీకి ఎన్నడూలేని స్థాయిలో సీట్లు కట్టబెట్టారు. 182 స్థానాలున్న అసెంబ్లీలో బీజేపీకి ఏకంగా 156,  కాంగ్రెస్‌కు కేవలం 17, ఆప్‌కు 5 స్థానాలు లభించటం గమనించ దగ్గది.

ప్రధాని నరేంద్ర మోదీ సమ్మోహనశక్తి పనిచేయటంతోపాటు అధికార పక్షానికి గట్టి ప్రత్యామ్నాయం అందించగల శక్తి సామర్థ్యాలు విపక్షానికి కొరవడటం బీజేపీ అసాధారణ విజయానికి ఊతమిచ్చింది. మోదీ సీఎంగా ఉన్నప్పుడు సైతం అత్యధికంగా 127 స్థానాలు మాత్రమే గెలుచు కున్న చరిత్రగల బీజేపీ ఇప్పుడు భారీ మెజారిటీ సాధించటం మాటలు కాదు. హిమాచల్‌ ప్రదేశ్‌లో మాత్రం బీజేపీ బోర్లాపడక తప్పలేదు.

ప్రతి అయిదేళ్లకూ అధికార పక్షాన్ని సాగనంపే సంప్రదా యాన్ని ఓటర్లు ఈసారి కూడా కొనసాగించటంతోపాటు అక్కడి సమస్యలపై పోరాడిన తీరు కాంగ్రెస్‌కు లాభించింది. అయితే రెండు పార్టీల ఓట్ల శాతం వ్యత్యాసం ఒక్క శాతంకన్నా తక్కువే. అక్కడి 68 స్థానాల్లో కాంగ్రెస్‌కు 40, అధికారం మెట్లు దిగుతున్న బీజేపీకి 25 రాబోతున్నాయి. ఢిల్లీలో దక్కిన విజయంతో సంతోషసంరంభాల్లో మునిగితేలుతున్న ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలూ షాక్‌ అనే చెప్పాలి.

ఆ పార్టీకి కొత్తగా జాతీయ పార్టీ హోదా రావటం మినహా సీట్లపరంగా పెద్దగా దక్కిందేమీ లేదు. హిమాచల్‌లో గట్టి సవాల్‌ ఇస్తుందనుకుంటే కనీసం ఖాతా కూడా ప్రారం భించలేకపోయింది. గుజరాత్‌ గురించి సాక్షాత్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ గొప్పలకు పోయినా ఎవరూ దాన్ని విశ్వసించలేదు. కానీ పొరుగునున్న పంజాబ్‌ మాదిరే హిమాచల్‌లో సైతం ఏదో ఇంద్రజాలం చేస్తుందని నమ్మినవారికి నిరాశే ఎదురైంది.  ఆ పార్టీ చేసిన హడావుడికీ, వచ్చిన సీట్లకూ ఎక్కడా పొంతన లేకపోవటం గమనించదగ్గది. 

అధికార పక్షం పనితీరుకన్నా ఇతరేతర అంశాలు ప్రాధాన్యం సంతరించుకోవటం ఈమధ్య కాలంలో దేశంలో అక్కడక్కడ కనబడుతోంది. ఇప్పుడు గుజరాత్‌లోనూ జరిగింది అదే. ఇది విప క్షాల వైఫల్యం తప్ప మరొకటి కాదు. కరోనా మహమ్మారి కాటేయడంతో ఆ రాష్ట్రంలో దాదాపు అన్నివర్గాల జనం ఆర్థిక ఒడిదుడుకులతో సతమతమవుతున్నారు. సంపన్నవంతులైన సూరత్‌లోని జౌళి మిల్లుల యజమానులు మొదలుకొని అంతంతమాత్రంగా నెట్టుకొచ్చే పొగాకు రైతుల వరకూ అందరికీ సమస్యలున్నాయి.

రాష్ట్రంలో వృద్ధి రేటు అరకొరగా ఉండగా ద్రవ్యోల్బణం పట్టిపీడిస్తోంది. నిరుద్యోగ సమస్య సరేసరి. సాధారణ పరిస్థితుల్లో ఇవన్నీ అధికార పక్షానికి చుక్కలు చూపాలి. కానీ రాష్ట్ర ఓటర్లలో 52 శాతంమంది మళ్లీ బీజేపీనే కొనసాగించాలనుకున్నారంటే విపక్షమైన కాంగ్రెస్‌పై వారికున్న అవిశ్వాసం ఎంతటిదో అర్థమవుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 41 శాతం ఓట్లు తెచ్చుకున్న కాంగ్రెస్‌ ఈసారి 27 శాతానికి పడిపోయిందంటే అది ఆ పార్టీ పతనావస్థను పట్టి చూపుతుంది.

క్రితంసారి ఎన్నికల్లో సౌరాష్ట్ర ప్రాంతాన్ని బీజేపీనుంచి చేజిక్కించుకున్న కాంగ్రెస్‌ తాజా ఎన్నికల్లో ఆప్‌ ఆగమనం వల్ల కావొచ్చు... ఓట్లు చీలి దాన్ని తిరిగి బీజేపీకే అప్పగించింది. ఆప్‌ కేవలం కాంగ్రెస్‌ ఓట్లను మాత్రమే కాదు... అంతో ఇంతో బీజేపీ ఓట్లను కూడా రాబట్టుకోగలిగింది. 2017 ఎన్నికల నాటికి పటీదార్ల ఉద్యమం గుజరాత్‌ను హోరెత్తించింది. అప్పట్లో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది.

తమకు రాయితీలు దక్కటం లేదని రైతాంగం ఆగ్రహంతో ఉంది. అలాంటి సమయంలోనే లాగలేకపోయిన కాంగ్రెస్‌ ఇప్పుడు ఏదో చేస్తుందని ఎవరూ అనుకోలేదు. జనం ఎదుర్కొంటున్న సమస్యలపై తానే ఉద్యమించి అందరినీ కూడగట్టి ఉంటే ఆ పార్టీకి అంతో ఇంతో లాభించేది. అలాంటి చొరవ తీసుకున్న నేతలే లేకపోవటం కాంగ్రెస్‌కు పెద్ద శాపం. అటు ప్రధాని నరేంద్ర మోదీ 31 ఎన్నికల ప్రచారసభల్లో పాల్గొంటే  కాంగ్రెస్‌ నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మినహా మిగిలిన బడానేతల జాడ అంతంతమాత్రం.

గడప దాటకుండా, సమస్యలపై ఉద్యమించకుండా విజయం తనంతతాను దరి చేరాలని ఏ విపక్షం భావించినా తెలివితక్కువతనం. ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఫలితాలు చూసినా, హిమా చల్‌లో కాంగ్రెస్‌ విజయం గమనించినా ఇదే రుజువవుతుంది. హిమాచల్‌లో బీజేపీ ప్రచారహోరు తక్కువేమీ లేదు. అది ప్రధాని మోదీ ఆకర్షణనూ, ప్రతిసారీ ఏకరువుపెట్టే ‘డబుల్‌ ఇంజన్‌’ ప్రభుత్వ వాదాన్నీ, ఉమ్మడి సివిల్‌ కోడ్‌నూ, జాతీయ భద్రతనూ ఎజెండాలోకి తెచ్చింది.

అటు చూస్తే నిరుడు వీరభద్రసింగ్‌ మరణం తర్వాత కాంగ్రెస్‌కు చెప్పుకోదగ్గ నాయకుడు లేకుండాపోయారు. అయినా రాష్ట్రంలో నిరుద్యోగంపై, యాపిల్‌ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్‌ ఎన్నో ఉద్యమాలు చేసింది. జనం సతమతమవుతున్న సమస్యల్ని తీసుకుని ఉద్యమాలు నిర్మిస్తే విజయం పెద్ద కష్టం కాదని నిరూపించింది. ఆ రకంగా చూస్తే హిమాచల్‌ ఎన్నికల ఫలితాలు విపక్షాలకు మాత్రమే కాదు, బీజేపీకి సైతం హెచ్చరిక లాంటివే.

ఎన్నికల్లో గెలుపోటములు సహజమే. కానీ గెలిచిన పక్షం జనం ఎందుకు గెలిపించారో, వాగ్దానాల అమలుకు తాను చేయాల్సిందేమిటో గుర్తెరగాలి. ఓటమి పాలైన వారు తమవైపు ఎలాంటి లోపాలున్నాయో ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఓటమిని హుందాగా స్వీకరిం చటం నేర్చుకోవాలి. జనం అధికారం కట్టబెట్టనిచోట దాన్ని నయానో భయానో కొల్లగొట్టి పబ్బం గడుపుకుందామనే ఆలోచనలకు దూరంగా ఉండాలి. లేకుంటే ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదు. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top