ఎదురుచూపులు

Sakshi Editorial On Anticipation

ధర్మం నాలుగుపాదాలా నడిచే రాజ్యంలో క్రమం తప్పకుండా వానలు కురుస్తాయని ప్రతీతి. ఇప్పుడు ధర్మం ఎన్ని పాదాలతో నడుస్తోందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ధర్మం ఎంత కుంటి నడక నడుస్తున్నా, ఈ భూమ్మీద చెట్టూ చేమా, పిట్టా పిచుకా, పశువులూ మనుషులూ మనుగడ సాగించాలంటే తప్పకుండా వానలు కురవాల్సిందే! ఈసారి వేసవి తన తీవ్రతను తారస్థాయిలో చూపుతోంది. ఎండలు మండి పడుతున్నాయి. సూర్యుడింకా నడినెత్తికి రాకముందే నడివీథుల్లో నిప్పులు చెరుగుతున్నాయి.

రుతు పవనాలు ఇప్పటికే కేరళ తీరానికి చేరుకున్నాయి. నేడో రేపో ఇక్కడకూ చేరుకుంటాయి. వానలు కురిపిస్తాయి. ఈ ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం జనాలు చాతకాల్లా వానల కోసం ఎదురు చూస్తున్నారు. ఉక్కపోతలతో అల్లాడిన జనాలకు నాలుగు చినుకులే ఊరట! వాన చినుకుల కోసం నెర్రెలువారిన నేల ఆవురావురుమని ఎదురుచూస్తుంది.

మన ప్రాచీన సాహిత్యంలో చాతక పక్షులు ఎదురుచూపులకు ప్రతీకలు. చాతక పక్షులు వాన చినుకుల నీటిని మాత్రమే తాగుతాయని, అందుకే అవి వానల కోసం ఆత్రంగా ఎదురుచూస్తుంటాయని పురాణ సాహిత్యం చెప్పేమాట! శాస్త్రీయ వాస్తవాలు మరోలా ఉన్నా, మన కవులు చాతకపక్షులను ఎదురుచూపులకు ప్రతీకగానే ఎంచుకున్నారు. ‘హంసః పద్మవనం సమిచ్ఛతి యథా నీలాంబుదం చాతకః/ కోకః కోకనదప్రియ ప్రతిదినం చన్ద్రం చకోరస్తథా/ చేతో వాంఛతి మామకం పశుపతే చిన్మార్గమృగ్యం విభో/ గౌరీనాథ భవత్పదాబ్జ యుగళం కైవల్య సౌఖ్యప్రదం’ అన్నారు ఆదిశంకరులు.

తామరతూళ్లనే ఆహారంగా తినే హంసలు తామరలతో నిండిన సరోవరాల కోసం ఎదురుచూస్తాయి. వాన చినుకులను మాత్రమే తాగే చాతకాలు వానలు కురిపించే కారుమబ్బుల కోసం ఎదురుచూస్తాయి. వెన్నెలనే ఆహారంగా తీసుకునే చాతకాలు చంద్రోదయం కోసం ఎదురుచూస్తాయి. అలాగే అసలైన భక్తుడు పరమేశ్వరుడి సాన్నిధ్యం కోసం ఎదురుచూస్తాడట! శ్రీమహావిష్ణువు ద్వాపరయుగంలో కృష్ణావతారం దాల్చి భూలోకంలో పుట్టాడు. అప్పుడు వైకుంఠవాసులు శ్రీమహావిష్ణువు రాక కోసం లిప్త ఒక యుగంగా నిరీక్షించినట్లు దివాకర్ల వెంకటావధాని తన ‘కలి పరాజయము’లో వర్ణించారు.

నిజానికి మనుషుల బతుకులే ఎదురుచూపుల మయం. బడికి వెళ్లే వయసులో సెలవుల కోసం ఎదురుచూపులు. కాలేజీ కుర్రకారుకు ప్రేమికుల కోసం ఎదురుచూపులు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూపులు. ఉద్యోగులకు నెలకోసారి వచ్చే జీతాల కోసం ఎదురుచూపులు. జబ్బుచేసి ఆస్పత్రికి వెళితే అక్కడ వైద్యుడి దర్శనం కోసం ఎదురుచూపులు. జీవితంలో సింహభాగం ఇలా ఎదురుచూపులతోనే గడిచిపోతుంది. ‘ఒకవేళ ఏవైనా ఎదురుచూపులు నెరవేరకపోతే ఆశ్చర్యపోవద్దు.

దాన్నే మనం జీవితమంటాం’ అని ఆస్ట్రియన్‌ సంతతికి చెందిన బ్రిటిష్‌ మానసిక విశ్లేషకురాలు అనా ఫ్రాయిడ్‌ వ్యాఖ్యానించింది. జీవితంలో చాలా ఎదురుచూపులు ఉంటాయి. సాధారణంగా వాటిలో నెరవేరనివే ఎక్కువ! ఎదురుచూపులు నెరవేరినప్పుడు సంతోషాన్నిస్తాయి. నెరవేరని ఎదురుచూపులు నిరాశలో ముంచేస్తాయి. ‘ఈ లోకంలో మనుషులు భ్రమల్లో బతుకుతూ ఎల్లప్పుడూ ఏదో ఒకదాని కోసం ఎదురుచూస్తూనే ఉంటారు– ఒక్క ముక్కలో చెప్పాలంటే, కోరికలతో సతమతమవుతుంటారు’ అన్నాడు బుద్ధుడు.

లోకంలో ఎవరి ఎదురుచూపులు వారికి ఉండనే ఉంటాయి. అయితే, సాహిత్యంలో ప్రేయసీ ప్రియుల ఎదురుచూపులకే అమిత ప్రాధాన్యమిచ్చారు మన కవులు. భావకవిత్వం సాహితీలోకాన్ని కమ్మేసిన కాలంలో మన కవులు ఊహాసుందరుల కోసం ఎదురుచూపులు చూస్తూ, వీసెల కొద్ది విరహగీతాలు రాశారు.

‘ప్రబల కష్ట పరంపరల్‌ ప్రతిఘటించి/ నిల్చిపోయితి నీకయి నేటివఱకు!/ ఈ నిరీక్షణ పరిణామ మేమి యగునొ?’ అని చివరకు శ్రీశ్రీ కూడా తన గీతపద్యాలలో ఎదురుచూపుల వగపును వడబోశారు. ‘చిన్ని చిన్ని చిన్ని చెట్ల/ వన్నె వన్నె వన్నె పూల/ ఏరి ఇంద్రచాప మట్లు/ కట్టినాను నీకు మాల/ కాని, ఇచటికి ప్రియురాల!/ నీవింకను రావదేల?’ అంటూ పఠాభి తన ‘నిరీక్షణ’లోని నిట్టూర్పులతో సెగలు రేపారు.

అష్టవిధ నాయికలలో విరహోత్కంఠిత తన నాయకుని కోసం అనుక్షణం ఎదురుచూస్తూ, విరహతాపాన్ని అనుభవిస్తూ ఉంటుంది. ‘భర్త ఆఫీసునన్‌ బందిౖయె పోయినన్‌/ ఎదురు తెన్నులు జూచు నింతి యిపుడు/... కాంతుడు రాకున్న క్షణము లుత్కంఠమ్మె/ భారాన క్షణములు కదలునెపుడు/... వేగిపోవును తన భర్త జాగుజేయ/నామె యందమైన కనులె యలసిపోవు’ అంటూ ఆధునిక విరహోత్కంఠితల ఎదురుచూపుల విరహతాపాన్ని కొనకళ్ల ఫణీంద్రరావు చమత్కారంగా రాశారు.

ఆముష్మికుల ఎదురుచూపులు భగవత్‌ సాన్నిధ్యం కోసం కావచ్చు, విరహిణుల ఎదురుచూపులు తమ నాయకుల కోసం కావచ్చు, భావకవుల ఎదురుచూపులు ఊహాసుందరీమణుల కోసం కావచ్చు గాని, సామాన్యులు మాత్రం ఎప్పుడొస్తాయో తెలియని మంచిరోజుల కోసం  ఎదురుచూపులు చూస్తుంటారు.

నడివేసవిలో వానల కోసం ఎదురుచూస్తే, కొద్దిరోజులకైనా నాలుగు చినుకులు కురుస్తాయేమో గాని, సామాన్యులు మంచిరోజుల కోసం ఎన్నాళ్లు ఎదురుచూపులు చూడాలో ఎవరూ చెప్పలేరు. అయినా, జనాలు ఎంతో ఆశతో మంచిరోజుల కోసం ఎదురుచూస్తూనే ఉంటారు. మనసులో ఆశల దీపాలు వెలుగుతున్నంత సేపూ ఎదురుచూపులు బాధించవు. ఎదురుచూపులు చూసే శక్తి కోసమైనా ఆశలను అడుగంటిపోకుండా కాపాడుకోవాలి. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top