నిర్లక్ష్యమే కాటేసింది

Sakshi Article On Nasik Hospital Oxygen Leak

కరోనా వైరస్‌ మహమ్మారి ఉగ్రరూపం దాల్చిన వేళ మహారాష్ట్రలోని నాసిక్‌లోవున్న డాక్టర్‌ జాకీర్‌ హుస్సేన్‌ మున్సిపల్‌ ఆసుపత్రిలో బుధవారం సంభవించిన ఆక్సిజన్‌ లీక్‌ ఉదంతంలో 24మంది రోగులు మరణించటం ఎంతో విషాదకరం. ఆసుపత్రికున్న స్టోరేజీ ట్యాంక్‌ లీక్‌ కావడంతో ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. అయితే ఒక రోగికి సంబంధించిన బంధువు లీక్‌ సంగతిని సిబ్బందికి చెప్పేవరకూ ఎవరూ గమనించలేదంటే అక్కడ పరిస్థితి ఎంత అధ్వానంగా వుందో అర్థమవుతుంది. కోలుకుంటున్నట్టు కనబడిన తన బంధువు హఠాత్తుగా కళ్లు తేలేయడం చూసి ఆక్సిజన్‌ సరఫరా కావడం లేదని గ్రహించిన యువకుడు ఆదరాబాదరాగా పరుగెత్తి సిబ్బందికి విషయాన్ని చెప్పేసరికే అంతా అయిపోయింది. ఉదయం పది గంటల ప్రాంతంలో స్టోరేజీ ట్యాంకుకున్న వాల్వు విరిగి లీక్‌ మొదలుకాగా మధ్యాహ్నానికిగానీ దాన్ని గమనించలేకపోయారు. ఆ సమయానికి పరిస్థితి చేయి దాటి భారీ మొత్తంలో గ్యాస్‌ లీక్‌ కావడంతో వెంటిలేటర్లపై వున్న రోగులకు దాదాపు గంటసేపు ఆక్సిజన్‌ అందకుండా పోయింది. పర్యవసానంగా 24మంది ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఏడాది మొదట్లో ముంబైలో చిన్న పిల్లల ఆసుపత్రిలో నిప్పురవ్వ రాజుకుని పదిమంది ప్రాణాలు తీసింది. ప్రమాదం జరిగిన సమయానికి అక్కడ వైద్యులుగానీ, నర్సులుగానీ లేరని వెల్లడైంది. ఇప్పుడు జరిగిన ఆక్సిజన్‌ లీక్‌ కూడా అలాంటిదే. స్టోరేజీ ట్యాంకు నుంచి ప్రాణవాయువు సక్రమంగా సరఫరా అవుతున్నదో లేదో ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ సరిదిద్దవలసిన సిబ్బంది నిర్లక్ష్యంగా వున్నారు. వారిని పర్యవేక్షించాల్సినవారూ నిర్లిప్తంగా వుండిపోయారు. ఎవరో రోగి తాలూకు బంధువులు చెబితే తప్ప ఏదో జరిగిందన్న అనుమానం ఎవరికీ కలగలేదు. ప్రజారోగ్య రంగంలో వున్న ఆసు పత్రుల్లో మౌలిక సదుపాయాలు సక్రమంగా వుండవన్న ఫిర్యాదు చాన్నాళ్లుగా వుంది. అవసరమైన పరికరాలు అందుబాటులో వున్నా వాటిని నిర్వహించటానికి అవసరమైన సిబ్బంది కొరత వుంది. తక్కువమంది సిబ్బంది వుండటం వల్ల వున్నవారిపై పని ఒత్తిడి బహుశా ఎక్కువ వుండొచ్చు. కానీ ఇలాంటి సంక్షోభసమయాల్లో అప్రమత్తంగా వుండి ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూడాల్సిన బాధ్యత ఆసుపత్రి నిర్వాహకులకు లేదా?

ఒకపక్క రోజురోజుకూ కరోనా కేసులు అడ్డూ ఆపూ లేకుండా పెరుగుతున్నాయి. 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3.14 లక్షల కేసులు నమోదుకావడం ప్రపంచ రికార్డు. ఆసుపత్రుల్లో రోగులను చేర్చుకోవడానికి అవసరమైన బెడ్‌లు లేక, వారికి చికిత్స చేసేందుకు తగిన సంఖ్యలో వైద్యులు లేక ప్రస్తుతం పెను సంక్షోభాన్ని ఎదుర్కొనవలసి వస్తోంది. ఇక ఆక్సిజన్‌ గురించి రాష్ట్రాల మధ్య చిచ్చు రగిలింది. అటు బొంబాయి హైకోర్టు, ఇటు ఢిల్లీ హైకోర్టు ఆక్సిజన్‌ సరఫరా అరకొరగా వుండటంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశాయి. ఆక్సిజన్‌ కొరత ఇంతగా దేశాన్ని వేధిస్తుండగా వున్న నిల్వలను సక్రమంగా వినియోగించలేని స్థితి ఏర్పడటం బాధాకరం. అంతవరకూ కోలుకుంటున్నట్టు కనబడిన వారు... ఒకటి రెండు రోజుల్లో ఆసుపత్రినుంచి క్షేమంగా ఇళ్లకు వెళ్తారనుకున్నవారు కన్నుమూయడం దారుణం. ఇంతకన్నా దారుణమేమంటే... ఆసుపత్రి సిబ్బందిలో ఏ ఒక్కరికీ ఇలాంటి లీకేజీ ఏర్పడితే ఏం చేయాలన్న అంశంలో పెద్దగా అవగాహన లేకపోవడం. అగ్నిమాపక సిబ్బందికి వర్తమానం అందిన వెంటనే వారు రంగంలోకి దిగి గంటలో దాన్ని అదుపు చేయ గలిగారు. కానీ ముందే దాన్ని గమనించి, సరిదిద్దగలిగిన వారుంటే ఇంతమంది ప్రాణాలు కోల్పోయేవారు కాదు. ఆక్సిజన్‌ లీక్‌ పర్యవసానంగా దట్టమైన పొగలు ఆవరించి ఏమీ కనబడక పోవడంతో అగ్నిమాపక సిబ్బంది కష్టపడాల్సివచ్చిందంటున్నారు. మన ప్రజారోగ్య రంగం పరమ నాసిరకంగా వుంటున్నది. ఏదో మేరకు సదుపాయాలున్నాయని భావించేచోట కూడా నిర్వహణ సరిగాలేదు. మన దేశీయోత్పత్తిలో ఆరోగ్య రంగానికి వ్యయమవుతున్నది 4 శాతం. ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఒకటిన్నర శాతమైతే మిగతాదంతా జనం భరించాల్సివస్తోంది. అట్టడుగు ప్రజానీకం సహజంగానే ప్రభుత్వాసుపత్రులను ఆశ్రయిస్తారు. తీరా అక్కడ అడుగడుగునా లోపాలే దర్శనమిస్తాయి.

ఆసుపత్రులు ఎలాంటి భవంతుల్లో వుండాలో, అక్కడ భద్రతాపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో, వాటి పర్యవేక్షణ ఎలావుండాలో తేటతెల్లం చేసే అంతర్జాతీయ ప్రమాణాలున్నాయి. వాటికి అనుగుణంగా మన ఆసుపత్రులు వుంటున్నాయా లేదా అన్న సంగతిని ఎప్పటికప్పుడు ప్రభుత్వ యంత్రాంగం పర్యవేక్షిస్తున్నప్పుడే అవి సజావుగా వుంటాయి. ఇప్పుడు ప్రమాద ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. బాధ్యులెవరో నిర్ధారించి చర్యలు కూడా తీసుకుంటారు. కానీ ఇలాంటి సమస్యలు మరెక్కడా తలెత్తకుండా ఒక్క మహారాష్ట్ర ప్రభుత్వమే కాదు... దేశంలోని అన్ని రాష్ట్రాలు ముందస్తు చర్యలు తీసుకోవాలి. అన్ని స్థాయిల్లోనూ ఎప్పటికప్పుడు తనిఖీలు, ఎలాంటి ప్రమాద ఘటనలు చోటుచేసుకునే అవకాశం వున్నదో సిబ్బందికి అవగాహన కలిగించటం, అలాంటి సమయాల్లో వెనువెంటనే చేయాల్సిన పనులేమిటో చెప్పటం ముఖ్యం. కళ్లముందు లోటుపాట్లు కనిపిస్తున్నా ఏం జరగదులే అనే భరోసాతో వుండటం క్షేమం కాదు. ఒకపక్క దేశంలో చాలాచోట్ల ఆక్సిజన్‌ సరఫరా సరిపోక సమస్యలు ఏర్పడుతున్నాయని వార్తలు వస్తుండగా... నాసిక్‌లో ఇలాంటి దుర్ఘటన చోటుచేసుకోవటం విచారకరం. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top