‘మాస్కోవా’ ఏం చెబుతోంది?

Russia Not Correctly Estimated Ukraine Stamina Over Invasion - Sakshi

‘మీకు మీ గురించీ తెలియాలి... శత్రువు గురించీ తెలియాలి. అది కొరవడితే ప్రతి యుద్ధంలోనూ ఓటమి తప్పదు’ అంటాడు చైనా పురాతన సైనిక నిపుణుడు సన్‌ ట్జూ. ఉక్రెయిన్‌పై వెనకా ముందూ చూడకుండా విరుచుకుపడి దురాక్రమణకు సిద్ధపడిన రష్యాకు తన గురించి మాత్రమే కాదు... తన ప్రత్యర్థి గురించి కూడా ఏమీ తెలియదని ఇప్పటికే అందరికీ అర్థమైంది. ఈలోగా దురాక్రమణ యుద్ధం మొదలై యాభై రోజులు కావొస్తున్న తరుణంలో నల్ల సముద్రంలో లంగరేసిన రష్యా యుద్ధనౌక ‘మాస్కోవా’లో గురువారం ఉదయం హఠాత్తుగా పేలుళ్లు సంభవించి కుప్పకూలింది. ఉక్రెయిన్‌ దళాల దాడిలో అది నాశనమైందా... లేక అగ్ని ప్రమాదమే దాన్ని దహించిందా అన్నది వెంటనే తెలియకపోయినా ఈ ఉదంతం రష్యా సామర్థ్యాన్ని సందేహాస్పదం చేసింది. మాస్కోవా రష్యా అమ్ములపొదిలో ప్రధానమైన యుద్ధ నౌక.

16 సూపర్‌ సోనిక్‌ దీర్ఘ శ్రేణి క్షిపణులను మోసుకెళ్లగల, ప్రత్యర్థులపై అవిచ్ఛిన్నంగా ప్రయోగించగల సామర్థ్యమున్న యుద్ధ నౌక. 2015లో సిరియా సేనలకు మద్దతుగా రష్యా సైన్యం దాడులు నిర్వహించినప్పుడు, అంతకు చాన్నాళ్లముందు 2008లో దక్షిణ ఒసేతియా, అబ్ఖాజియా ప్రాంతాలపై రష్యా నిప్పుల వాన కురిపించినప్పుడు మాస్కోవా పాత్రే ప్రధానమైనది. ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై విరుచుకుపడి నల్ల సముద్రంలోకి ఆ దేశ నావికాదళం ప్రవేశించకుండా చూడటంలోనూ మాస్కోవాదే కీలకపాత్ర. పైగా ఈ మహమ్మారి నౌకను ముంచింది ఉక్రెయిన్‌కు చెందిన చిన్నపాటి మానవరహిత యుద్ధ విమానం అంటున్నారు. మాస్కోవా లాంటి భారీ యుద్ధ నౌకను ఇలా దెబ్బతీయడం అసాధారణమైంది. ఆ నౌకను కంటికి రెప్పలా కాపాడుకునేందుకు అందులో పటిష్టమైన ఆత్మరక్షణ వ్యవస్థ ఉంటుంది. వాయుమార్గంలో రాగల ఎలాంటి ప్రమాదాన్నయినా దూరంలో ఉండగానే రాడార్‌లు పసిగడతాయి. ఆ వెంటనే ఆత్మరక్షణ వ్యవస్థ అప్రమత్తమై క్షిపణుల్ని ప్రయోగించి వాటిని ధ్వంసం చేస్తుంది. కానీ ఉక్రెయిన్‌ వ్యూహం ముందు మాస్కోవా నిస్సహాయగా మారింది. దాడి జరిగిన రోజు ఆ ప్రాంతంలోని కల్లోల వాతావరణాన్ని ఉక్రెయిన్‌ సానుకూలంగా మలుచుకుని దొంగ దెబ్బ తీయగలిగిందంటున్నారు. ఈ కథనాలు నిజమే అయితే మాస్కోవాతోపాటు రష్యా పరువు కూడా నల్లసముద్రం పాలైనట్టే. 

నల్ల సముద్ర ప్రాంతం రష్యాకు అనేకవిధాల కీలకమైనది. అటు మధ్యధరా సముద్రంలోకి ప్రవేశించేందుకు ఉపయోగపడటంతోపాటు ఇటు నాటో దేశాలతో అదొక తటస్థ ప్రాంతంగా ఉంటున్నది. నల్లసముద్రానికి తూర్పున రష్యా, జార్జియా, దక్షిణాన టర్కీ, పశ్చిమాన రుమేనియా, బల్గేరియాలుంటే... ఉత్తర, వాయువ్య ప్రాంతాల్లో ఉక్రెయిన్‌ ఉంటుంది. అక్కడ రష్యా యుద్ధ నౌకల సంచారానికి రెండున్నర శతాబ్దాల చరిత్ర ఉంది. అనేకానేక రష్యా యుద్ధ నౌకలు మోహరించి ఉండే ప్రాంతంలో ఒక ప్రధాన యుద్ధ నౌకను గురి చూసి కొట్టడమంటే మాటలు కాదు. ఏం మాట్లాడాలో తెలియని అయోమయ స్థితిలో రష్యా పడిపోవడం స్పష్టంగా కనబడుతోంది. నౌకలో ఉంచిన ఆయుధాలు పేలడంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుందనీ, నౌకలో ఉన్న 500 మంది నావికాదళ సభ్యులనూ సురక్షితంగా తీసుకురాగలిగామనీ రష్యా అధికారికంగా చెబుతోంది. క్షిపణి వాహకాలు సురక్షితంగా ఉన్నాయంటున్నది. గత నెలలో రష్యా ఆక్రమించుకున్న బెర్డిన్స్క్‌లోని అజోవ్‌ నౌకాశ్రయంలో ఉన్న ఆ దేశ యుద్ధ నౌకను ధ్వంసం చేశామని ఉక్రెయిన్‌ ప్రకటించింది. కానీ ఇంత వరకూ దానిపై రష్యా పెదవి విప్పలేదు.

మాస్కోవా ఉదంతం అనేకవిధాల రష్యాను కుంగదీసింది. నల్ల సముద్ర ప్రాంతంలో రష్యా మోహరించిన నౌకలను చూసి నాటో దేశాలు బెంబేలెత్తేవి. దాంతో లడాయి బయల్దేరితే అది సమస్యాత్మకమవుతుందని భయపడేవి. రష్యా సైతం అక్కడి నౌకా శ్రేణులను గర్వకారణంగా భావించుకునేది. కానీ మాస్కోవా దెబ్బతినడంతో అదంతా గాలికి కొట్టుకుపోయింది. ఈ ఉదంతం  వల్ల ఆ దేశం పైకి కనిపించేంత శక్తిమంతమైనది కాదనీ, దానికి యుద్ధ సంసిద్ధత సరిగా లేదనీ అందరికీ తేటతెల్లమైంది. అలాగే రష్యా తయారీ రక్షణ సామాగ్రి సామర్థ్యాన్ని మాస్కోవా ఉదంతం ప్రశ్నార్థకం చేస్తున్నది. ఏ దేశం ఉత్పత్తి చేసే రక్షణ సామగ్రికి ఏపాటి శక్తిసామర్థ్యాలున్నాయో నిగ్గుతేలేది యుద్ధ భూమిలోనే. ఆచరణలో ఏదైనా సరిగా అక్కరకు రావడం లేదని తేలితే ఆ రక్షణ సామగ్రికి గిరాకీ పడిపోతుంది. ఇప్పుడు మాస్కోవా ఉదంతం రష్యా తయారీ యుద్ధ నౌకల విషయంలో అలాంటి సందేహాలనే రేకెత్తిస్తోంది. 

వర్తమాన నాగరిక యుగంలో యుద్ధాలు దేనికీ పరిష్కారం కాదు. దురాక్రమణ ప్రారంభించిన నాటినుంచీ ఆంక్షల చట్రంలో చిక్కుకుని రష్యా ఆర్థికంగా విలవిల్లాడుతోంది. ఇప్పుడిప్పుడే దాని తాలూకు సెగలు అక్కడ కనబడుతున్నాయి. తనకున్న అపార చమురు, సహజవాయు నిక్షేపాలను ఎగుమతి చేస్తూ లక్షలాదిమందికి ఉపాధి కల్పించడంతోపాటు ఆర్థికంగా సుస్థిరమైన స్థానంలో ఉన్న రష్యాకు ఈ దురాక్రమణ గుదిబండలా మారింది. అటు రష్యా దాడుల పరంపరతో ఉక్రెయిన్‌ జనావాసాలన్నీ నాశనమవుతున్నాయి. వేలాదిమంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్‌ అన్నివిధాలా దెబ్బతింది. ఇప్పటికైనా యుద్ధం వల్ల కలిగే అపారమైన నష్టాన్ని అందరూ గుర్తించాలి. ఇదిలాగే కొనసాగితే మూడో ప్రపంచ యుద్ధంగా ముదిరి, అణ్వాయుధాల ప్రయోగం వరకూ పోయే ప్రమాదం ఉన్నదని అమెరికాతోసహా అందరూ అర్థం చేసుకోవాలి. ఆయుధ సరఫరా కాదు... తక్షణ శాంతికి మార్గం వెదకాలని గ్రహించాలి. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top