అంతర్జాతీయ సంఘీభావమే ఆయుధం

Review About International Support For Russian Invasion Of Ukraine - Sakshi

రష్యన్‌ నియంత పుతిన్‌కి వ్యతిరేకంగా నిలబడాలంటే మాకు ప్రస్తుతం ఉన్న గొప్ప ఆయుధాలు ఏవంటే – అంతర్జాతీయ సంఘీభావం, మద్దతు మాత్రమే! బయటినుంచి మద్దతు లేకుండా మేం గెలుపు సాధించలేం. ఉక్రెయిన్‌ చరిత్రలోనే కాదు, ప్రజాస్వామ్య రక్షణ కోసం కూడా ఇది కీలకమైంది. ఇది ఉక్రెయిన్‌కి, రష్యాకి మధ్య ప్రాంతీయ ఘర్షణ ఏమాత్రం కాదు. నిరంకుశత్వానికీ, సామ్రాజ్యవాదానికీ వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం ఇది. ఉక్రెయిన్‌ కోసం మేం చేస్తున్న పోరాటంలో విజయం అనివార్యమని నేను బలంగా నమ్ముతున్నాను. తమ స్వాతంత్య్రం కోసం, ఆత్మగౌరవం కోసం సామాన్యులైన ఉక్రెయిన్‌ పౌరులు తమకు సంబంధించిన సమస్తాన్నీ అందిస్తున్నప్పుడు, విజయం ఒక్కటే మాకు దక్కాల్సి ఉంది.

మక్సీమ్‌ కురొచ్కిన్‌ ఒక నాటక రచయిత. ఈయన, మరో 20 మంది నాటక రచయితలు కలిసి పాత కీవ్‌ నడిబొడ్డున ఒక కొత్త రంగస్థలాన్ని నిర్మించాలని దాదాపు మూడేళ్లుగా ప్లాన్‌ చేస్తున్నారు. మార్చి 12న నాటక రచయితల థియేటర్‌ని ప్రారంభించడం కోసం, ఒక అద్భుతమైన పాత నిర్మాణాన్ని వారు కనుగొన్నారు. కానీ ఫిబ్రవరి 24నే మక్సీమ్, ఆయన సహచరులు భీతి కలిగించే బాంబుల శబ్దాలకు మేలుకున్నారు. ఆ తర్వాత మార్చి 12 వచ్చి అలా వెళ్లిపోయింది. తామను కున్న కొత్త థియేటర్‌ని ఘనంగా ప్రారంభించడానికి బదులుగా మక్సీమ్‌ ఇప్పుడు రష్యన్‌ దురాక్రమణదారులను ఓడించడానికి అవసరమైన సైనిక వ్యూహాలను రచిస్తున్నారు. తన చేతిలో కలానికి బదులుగా ఇప్పుడాయన ఆయుధాన్ని పట్టుకుని మోస్తున్నారు.

రష్యన్‌ సైన్యం చట్టవిరుద్ధంగా మా సరిహద్దులను దాటి వచ్చి ఇప్పటికి రెండు నెలలయింది. ఉక్రెయిన్‌ను ఆక్రమించడానికి వారు చేస్తూవచ్చిన అన్ని ప్రయత్నాల్లోనూ వారు ఓడిపోతూనే ఉన్నారు. ఇంతటి తీవ్రమైన, వీరోచితమైన ప్రతిఘటనను వారు ఊహించలేక పోవడమే వారి వైఫల్యానికి కారణాల్లో ఒకటి. మన అత్యాధునిక సైన్యం, రష్యన్‌ ఆక్రమణ దాడి వాస్తవాన్ని గ్రహించి పోరాడటానికి ఆయుధాలు చేత పట్టాలని నిర్ణయించుకున్న మక్సీమ్‌ వంటి స్థానిక రక్షకులే ఉక్రెయిన్‌ గడ్డపై రష్యన్ల వైఫల్యానికి కారణం.
మనపై ఇప్పుడు పడుతున్న బాంబులకు కారణం వాటి బటన్లు నొక్కుతున్న రష్యన్‌ హస్తాలేనని ప్రజలకు వివరించడానికి నేను అవిరామంగా ప్రయత్నిస్తున్నాను. ఉక్రెయిన్‌లోని మరీయూపోల్‌లో షెల్టర్‌గా ఉపయోగిస్తున్న థియేటర్‌పై మార్చి 18న రష్యన్‌ సైన్యం ప్రయోగించిన బాంబు దాడిలో 300 మంది ప్రజలు మరణించారు. 

నా కుమార్తెతో సహా ఈ సాహసోపేతులైన ప్రాదేశిక రక్షకులలో చాలామంది యుద్ధం ప్రారంభమైన తక్షణం యుద్ధంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. వీరిలో ఏ ఒక్కరికీ సైనిక శిక్షణ లేదు, అంతకు ముందు ఎలాంటి సైనిక ఘర్షణల్లోనూ పాల్గొన్న అనుభవమూ లేదు. ప్రాదేశిక రక్షక బలగంలో చేరడానికి తమ పెళ్లిని సైతం వాయిదా వేసుకున్న యువ జంట గానీ, ఆనారోగ్యం బారినపడిన వృద్ధులకు సహాయపడే పనుల్లో ఉండి ఫైటర్‌గా మారాలని నిర్ణయించుకున్న ఆ కమెడియన్‌ గానీ... ఉక్రెయిన్‌ ప్రజల చెదరని స్ఫూర్తిని ప్రపంచానికి ప్రదర్శించారు. వీరిలో కొందరు విషాదకరంగా ఈ సమరంలో నేల కూలారు. ఇక బుచా, ఖార్కివ్, మరీయూపోల్‌ వంటి నగరాల్లో పోరాడుతున్న వారిని రష్యన్‌ సైనికులు చంపేశారు. సామూహిక ఖనన స్థలాలను తిరిగి తవ్వి, ధ్వంసమైపోయిన మా నగరాల శిథిలాలను తొలగిస్తే తప్ప మా పౌరుల్లో ఎంతమంది చనిపోయిందీ మాకు తెలిసే అవకాశం లేదు.

ఈ కథనాలన్నీ వినడానికే షాక్‌ కలిగిస్తున్నాయి. నియంత వ్లాదిమిర్‌ పుతిన్‌ నేతృత్వంలోని క్రూర రష్యన్‌ సైన్యం నుంచి సరిగ్గా దీన్నే మేం ఊహించాము. 2000 సంవత్సరంలో పుతిన్‌తో నాకు పరిచయం కలిగింది. అప్పట్లో నేనూ, పుతిన్‌ ఇరువురం మా భూభాగాలకు ప్రధానమంత్రులుగా వ్యవహరించాము. 2004లో నేను ఉక్రెయిన్‌ అధ్యక్షుడిగా పోటీ చేసినప్పుడు పుతిన్‌ నాకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. తాను కోరుకున్నది సాధించడానికి పుతిన్‌ ఎంతకైనా తెగిస్తారన్నది అప్పుడే నాకు స్పష్టమైంది. కానీ అందుకు నేను అవకాశం ఇవ్వలేదు. ఆ ఎన్నికల్లో నేను గెలిచాక, తూర్పున ఉన్న మా పొరుగుదేశం నేతగా ఆయనతో ఫలప్రదమైన సంబంధాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని నేను గుర్తించాను.

పుతిన్‌కి వ్యతిరేకంగా మాకు ప్రస్తుతం ఉన్న గొప్ప ఆయుధాలు ఏవంటే అంతర్జాతీయ సంఘీభావం, మద్దతు మాత్రమే. ఇదే నన్ను వాస్తవానికి కలతపెడుతోంది. ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రపంచ వార్తలుగా మారుతున్నప్పుడు, పలు వారాలపాటు అంతర్జాతీయ చర్చనీయాంశమవుతున్నప్పుడు మా ప్రాదేశిక రక్షకుల పోరాట గాథలపై ఆసక్తి తగ్గిపోతూ వచ్చింది. యుద్ధానికి సంబంధించిన భయానక వాస్తవాలు సాధారణం. సిరియాలో, యెమెన్‌లో, మా సొంత డాన్‌బాస్‌లో మేం వీటిని చూశాం కూడా. కానీ ఉక్రెయిన్‌లో ఉన్న మేం ఎంతమాత్రం అలసట చెందలేదు. అలా అలసిపోవడమే జరిగివుంటే మేం విజయాన్ని కోల్పోయి ఉండేవాళ్లం. మా బలమే ఇప్పుడు మాకు అన్నిటికంటే ముఖ్యం. రష్యన్లు పలుచోట్ల వెనుకంజ వేయడం జరుగుతున్నప్పటికీ, రష్యన్‌ బలగాలు తిరిగి సమీకృతం అవుతున్నారనీ, తమ దాడిని కొనసాగించడానికి ప్లాన్‌ చేస్తున్నారనీ మేం వింటున్నాం. ఇప్పుడు మేం ఈ యుద్ధంలో గెలుపొందడానికి మరింత కృతనిశ్చయంతో ఉండాలి.

అయితే బయటినుంచి మద్దతు లేకుండా మేం ఇప్పుడు గెలుపు సాధించలేం. ఈ యుద్ధం ఒక నిర్ణయాత్మక ఘటన. ఉక్రెయిన్‌ చరిత్ర లోనే కాదు, ప్రజాస్వామ్య రక్షణ కోసం కూడా ఇది కీలకమైంది. ఇది ఉక్రెయిన్‌కి రష్యాకి మధ్య ప్రాంతీయ ఘర్షణ ఏమాత్రం కాదు. నిరంకుశత్వానికీ, సామ్రాజ్యవాదానికీ వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం ఇది. మా మిత్రదేశాలన్నింటినుంచి మా సైన్యానికి ఇప్పుడు ఆయుధాలు, ఇతర సైనికపరమైన సామగ్రి మాకు చాలా అవసరం. మా బలమైన ఆర్థిక వ్యవస్థను చిన్నా భిన్నం చేసిన యుద్ధ గాయాలను మాన్పడానికి ద్రవ్యపరమైన సహాయం మాకు ఇప్పుడు చాలా అవసరం. మా దేశ నాయకత్వం రష్యాతో యుద్ధంలో ముందుపీఠిన ఉండటమే కాదు, అంతర్జాతీయ కార్యాలయాలను, సంస్థలను కాపాడేందుకు కూడా, సమరరంగంలో మా నాయకత్వం నిలబడి పోరాడుతోంది. ఉక్రెయిన్‌లో శాంతిని నెలకొల్పి స్వాతంత్య్రాన్ని పునరుద్ధరించడానికి మాకు అవసరమైన మిత్రుల మద్దతును పొందడానికి వారి కార్యాలయాలను కాపాడటం కూడా మాకు ఎంతో అవసరమే.

అదే సమయంలో, మా ప్రాదేశిక రక్షకులకు తగిన సరఫరాలను తప్పక అందించాల్సిన వలంటీర్ల సేన కూడా మాకు ఉంది. యుద్ధ రంగంలో పోరాడేందుకు అవసరమైన రక్షణ సామగ్రిని వారికి అందించడం ఎంతో అవసరం. ఉక్రెయిన్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ వంటి పౌర సమాజ సంస్థలు మా ప్రాదేశిక రక్షకులకు ప్రాణాంతకం కాని సరఫరాలను అందించడంలో అవిరామంగా కృషి చేస్తున్నాయి. మాకు ఎంతో అవసరమైన ఆయుధాలను మా మిత్ర దేశాలు పంపిం చేందుకు తగిన సూచనలు అందించడంలో వీరు నిరవధికంగా చేస్తున్న ప్రయత్నాలు ఎన్నదగినవి. రష్యన్‌ దురాక్రమణను ఓడించ డానికి అవసరమైన దిగ్బంధన, ఆంక్షల విధింపులో కూడా వీరు సహకరిస్తున్నారు. మేం తుది విజయం సాగించేవరకు మా ప్రాదేశిక రక్షకులు పోరాడుతూనే ఉంటారు. అదే సమయంలో మా మద్దతు దారులు మాకు చేయదగిన ప్రతి సహాయాన్ని చేస్తూనే ఉంటారన డంలో సందేహమే లేదు.

ఉక్రెయిన్‌ కోసం మేం చేస్తున్న పోరాటంలో విజయం అనివార్య మని నేను బలంగా నమ్ముతున్నాను. తమ స్వాతంత్య్రం కోసం, ఆత్మగౌరవం కోసం సామాన్యులైన ఉక్రెయిన్‌ పౌరులు తమకు సంబంధించిన సమస్తాన్నీ అందిస్తున్నప్పుడు, విజయం ఒక్కటే మాకు దక్కాల్సి ఉంది. ఈ యుద్ధం చివరకి ముగిసిపోయే రోజు కోసం నేను ఎక్కువకాలం వేచి ఉండలేను. మక్సీమ్, అతడి సహచరులు తమ థియేటర్‌ను ప్రారంభించి, కొత్త నాటకాలను ప్రదర్శించే రోజు కోసం ఎదురు చూస్తున్నాను. వారి తాజా రచనలు కేవలం ప్రచారానికి సంబంధించినవి కాదు. అవి వారి స్వరాలు, వారి భావల సమాహారం. మేం ఈరోజు స్వాతంత్య్రం కోసం పోరాడు తున్నాం. రేపు ఉక్రెయిన్‌ అంటే ఏమిటో నిర్వచిస్తూ స్వాతంత్యాన్ని గెల్చుకున్న మా రచయితలు ప్రదర్శించే నాటకాలను కూడా మేం తిలకిస్తాము.


విక్టర్‌ యుష్చెంకో ,వ్యాసకర్త ఉక్రెయిన్‌ మాజీ అధ్యక్షుడు
(‘ద గార్డియన్‌’ సౌజన్యంతో)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top