ఇది ఘన ‘తంత్ర’మా?

Republic Day 2022 Editorial By Vardhelli Murali - Sakshi

భారతావనికి 73వ గణతంత్ర దినోత్సవ ఘడియలివి. సర్వసత్తాక, సార్వభౌమాధికార దేశంగా ఈ సంతోష వేళలోనూ అనవసర వివాదాలు రాజుకోవడమే విచారకరం. ఇండియా గేట్‌లో సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహం, పాకిస్తాన్‌పై యుద్ధంలో గెలిపించి ప్రాణాలర్పించిన 3,483 మంది జవాన్ల గౌరవార్థం 1972లో ఇందిరా గాంధీ ఏర్పాటుచేసిన ‘అమర్‌ జవాన్‌ జ్యోతి’ని ఆ దగ్గరే కొత్తగా 2019లో మోదీ సర్కారు పెట్టిన నేషనల్‌ వార్‌ మెమోరియల్‌ జ్యోతిలో విలీనం చేయడం, గణతంత్ర ఉత్సవాల నుంచి మహాత్మా గాంధీకి నచ్చిన ‘ఎబైడ్‌ విత్‌ మి’ పాట తొలగింపు – ఇలా ఒకటికి మూడు ప్రభుత్వ నిర్ణయాలు జరిగాయి. వీటన్నిటి కన్నా ముందే తమ  రాష్ట్రాల ప్రత్యేక శకటాలకు ఉద్దేశపూర్వకంగా రిపబ్లిక్‌ డే కవాతులో అనుమతి నిరాకరించారంటూ వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రతిపక్షాలు ఆరోపించాయి. వెరసి, ఈసారి ప్రతిదీ  ఏదో ఒక రకంగా వివాదాస్పదమైంది. 

ఏటా గణతంత్ర వేడుకల ముగింపుగా జనవరి 29 సూర్యాస్తమయ వేళ సైనిక సంప్రదాయంగా బ్యాండ్‌ వాద్యవిన్యాసాల ‘బీటింగ్‌ రిట్రీట్‌’ ఆనవాయితీ. ఇంగ్లండ్‌లో 17వ శతాబ్దిలో మొదలైన ఈ శతాబ్దాల కాలపు వేడుక పద్ధతిని ఇప్పటికీ బ్రిటన్, అమెరికా, కెనడా, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా లాంటి పలు దేశాలతో పాటు మనమూ అనుసరిస్తున్నాం. మన దేశపు వేడుకలో మహాత్మా గాంధీకి ప్రియమైన క్రైస్తవ ప్రార్థన ‘ఎబైడ్‌ విత్‌ మి’ ఏళ్ళుగా వస్తోంది.

కానీ, ఈసారి మోదీ ప్రభుత్వం ఆ పాట తీసేసి, దాని బదులు 1962 భారత – చైనా యుద్ధంలో ఓటమి తర్వాత వీరజవాన్లలో స్థైర్యం నింపుతూ, హిందీ సినీకవి ప్రదీప్‌ రాసిన పాపులర్‌  దేశభక్తి గీతం ‘యే మేరే వతన్‌ కే లోగోం...’ పెట్టింది. గాయని లతా మంగేష్కర్, సంగీత దర్శకుడు సి. రామచంద్రల మధ్య కొన్నేళ్ళ ప్రచ్ఛన్న యుద్ధానికి తెర దించిన ఘనత ఆ పాటదే. ప్రధాని నెహ్రూని కదిలించి, నేటికీ మనసులు కరిగించే ఆ పాట గొప్పదే. కానీ గాంధీకి ప్రియమైన ప్రార్థన మార్చి, దాన్ని పెట్టాల్సిన అత్యవసరమేంటి?

ఇప్పటి దాకా మరుగునపడిన చరిత్రను జనానికి చాటి, జరిగిన లోపాన్ని సరిచేయడానికే ఈ ప్రయత్నమన్నది ప్రధాని మోదీ ఉవాచ. చరిత్రలో ప్రాధాన్యం దక్కకుండా పోయిన ఘటనలకూ, వ్యక్తులకూ తగిన గుర్తింపు తేవాల్సిందే. అందుకోసం ఇప్పటికే జనంలో జ్ఞాపకంగా మిగిలినవాటిని గుర్తులే లేకుండా చేయాలా అన్నది విమర్శ.

అందరికీ ప్రేరణ అయిన కొందరిని తమ వారిగా మలుచుకొని, సంఘ్‌పరివార్‌ భావజాలానికి సర్వజన అంగీకారం తేవడమనే కుట్ర దీనిలో ఉందని ఆరోపిస్తున్నవారూ ఉన్నారు. ఇటీవల బంగ్లాదేశ్‌ ఆవిర్భావ స్వర్ణోత్సవ సందర్భంలో అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీని నేటి పెద్దలు కనీసం స్మరించుకోలేదు. దానిపైనా విమర్శలు రేగాయి. 

ఎవరి ఘనత, ఎవరి స్థానం వారిదే. కానీ, గాంధీని కాదని లాల్‌ బహదూర్‌నీ, నెహ్రూను వద్దని పటేల్‌నూ ఇతరేతర కారణాలతో తలకెత్తుకోవడం ఎలా సమర్థనీయం? కొందరు ఆరోపిస్తున్నట్టు ఇందిరా గాంధీ హయాంలో వచ్చింది కాబట్టి అమర జ్యోతిని ఆర్పేశారన్నది నిజమే అయితే, ఆ చర్య ఏ రకంగా హర్షణీయం? స్వాతంత్య్రానంతర యుద్ధాల్లో మరణించిన జవాన్ల పేర్లున్న వార్‌ మెమోరియల్‌ సరే, అంతకు మునుపటి యుద్ధాల్లో అమరులైన 15 వేల మందికి పైగా వీరుల గౌరవం మాటేమిటి? ఇది చరిత్ర నిర్మాణమా, వినిర్మాణమా అన్న విమర్శ వినిపిస్తోంది అందుకే.  

కేంద్రం పెట్టాలనుకుంటున్న పాతికడుగుల ఎత్తు, ఆరడుగుల వెడల్పు గ్రానైట్‌ విగ్రహానికి మించి సమున్నతమైనది నేతాజీ చరిత్ర. ఆ వీరుడి 125వ జయంతి వేళ గణతంత్ర ఉత్సవం మూడు రోజుల ముందుగా జనవరి 23 నుంచే జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. కానీ, గాంధీ, నెహ్రూలతో విభేదాలుండి, జర్మనీ, జపాన్‌ల సాయంతో బ్రిటీషు పాలకులపై యుద్ధానికి దిగిన నేతాజీ నామస్మరణను కేంద్రం ఇప్పుడే ఎందుకు చేస్తోంది? నిరుడు బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన పాలకపక్ష నేతలకు ఈ బెంగాలీ బిడ్డపై ప్రేమ పొంగుకు రావడంలో అంతరార్థమేంటి? ప్రతిపక్షాలపై పైచేయి కోసం చరిత్రను మార్చేందుకు పాలకపార్టీ ప్రయత్నిస్తోందని కొన్నేళ్ళుగా ఓ ఆరోపణ. ఈ నేపథ్యంలో హడావిడి నిర్ణయాల బదులు నిపుణులతో సంప్రతించాల్సింది. ప్రజాభి ప్రాయం తెలుసుకోవాల్సింది. అలా చేస్తే వివాదం ఉండేది కాదు. చివరకు ఇటు నేతాజీ, అటు కవి ప్రదీప్‌ల వారసులు తమ వారికి దక్కిన అనూహ్య గౌరవానికి సంతోషిస్తూనే, మతనిగ్రహం లేకుండా విగ్రహాలు, గాంధీని కాదని కొత్త పాట పెట్టడాలను వ్యతిరేకిస్తుండడం కొసమెరుపు.   

సంక్షుభిత కాలంలో పరిష్కరించాల్సిన సమస్యలెన్నో ఉండగా, ఈ వివాదాస్పద చర్యల అవసరమేంటో అర్థం కాదు. వలసవాద కాలం నాటి పద్ధతులను మార్చాలని చెబుతున్న పాలకులు ముందుగా తమలోని వలసవాద పాలక మనస్తత్వాన్ని మార్చుకొనే ప్రయత్నం చేయాలి కదా అన్న సోషల్‌ మీడియా ప్రశ్నకు జవాబు లేదు. ప్రపంచమంతటా పాలకులు తమకు అనుకూల కథనాలే మిగలాలనీ, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ తమ హీరోలను నిలపాలనీ తాపత్రయపడడం తరతరాలుగా తెలిసిందే.

కానీ, భిన్న సంస్కృతులు, విభిన్న ఆలోచనల సంగమమైన భారతావనిలో ఏకరూప అజెండాను సాధించాలనుకోవడం సరికాదు. ‘చరిత్ర అడగకు... చేస్తున్నది చూడు’ అనేది అధికారంలో ఉన్నవారి ధోరణి అయితే, అది ప్రజలకూ, దీర్ఘకాలంలో ప్రజాస్వామ్యానికీ నష్టమే. అలా ఎవరైనా ప్రవర్తిస్తే, ఆనక వారి స్థానమేంటో కాలమే తేలుస్తుంది. ఎందుకంటే, అందరి కన్నా అతి నిరంకుశమైనది కాలం! అది వలసవాద కాలానికి ముందెప్పటి నుంచో చరిత్ర చెప్తున్న పాఠం! 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top