కార్పొరేట్‌ బ్యాంకులతో చిక్కులు | Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌ బ్యాంకులతో చిక్కులు

Published Thu, Nov 26 2020 1:06 AM

RBI Allows Corporate Houses To Set Up Banking Services - Sakshi

దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమై మూడు దశాబ్దాలు కావస్తుండగా ఇన్నాళ్లకు అసలు సిసలైన బ్యాంకింగ్‌ సంస్కరణలకు తెరలేచింది. ఈమధ్యే భారత రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) అంతర్గత కార్యాచరణ బృందం కార్పొరేట్‌ సంస్థలు ప్రైవేటు బ్యాంకుల్ని తెరిచేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ సిఫార్సు చేసింది. వారు సమర్పించిన నివేదికపై వచ్చే ఏడాది జనవరి 15లోపు అన్ని వర్గాల అభిప్రాయాలు పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆర్‌బీఐ అంటోంది. ఎన్‌డీఏ ప్రభుత్వం తొలి అయిదేళ్లలోనూ, ఈమధ్యకాలంలోనూ ఆర్థిక రంగ సంస్కరణలపై చూపిస్తున్న శ్రద్ధను గమ నించినవారికి తుది నిర్ణయం ఎలా వుండగలదో ఇప్పటికే అర్థమైంది.

ఇది చివరకు బ్యాంకింగ్‌ రంగ ప్రైవేటీకరణకు కూడా దారితీయొచ్చన్నది కొందరు నిపుణుల విశ్లేషణ. ఈ నేపథ్యంలో అయిదు దశాబ్దాలక్రితం అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఒకేసారి 14 బ్యాంకుల్ని జాతీయం చేయడానికి దారితీసినప్పటి పరిస్థితులను మాత్రమే కాదు... రెండేళ్లక్రితం నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లీజింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌(ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌)కు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు(పీఎన్‌బీ)కి, నిరుడు యస్‌ బ్యాంకుకు, ఈమధ్య లక్ష్మీ విలాస్‌ బ్యాంకుకు ఏమైందో కూడా గుర్తుకు తెచ్చుకోవాలి. ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ తీసుకున్న రూ. 91,000 కోట్ల రుణాలకు అది కనీసం వడ్డీ కూడా కట్టలేని స్థితికి చేరుకుని చతికిలబడినప్పుడు ఆ పరిణామాన్ని ‘మినీ లేమాన్‌ బ్రదర్స్‌ సంక్షోభం’గా నిపుణులు అభివర్ణించారు.

ఇక యస్‌ బ్యాంకు కథ కూడా ఇలాంటిదే. 2004లో ప్రారం భమైన ఆ బ్యాంకు చకచకా ఎదిగింది. రేటింగ్‌ సంస్థల నుంచి ఎప్పటికప్పుడు మంచి మార్కులు కొట్టేసింది. çపదిహేనేళ్లు గడిచేసరికి అంతా తారుమారయింది. దాని పారుబాకీలు రూ. 17,134 కోట్లకు చేరుకున్నాయి. అది మునుగుతూ పలు సంస్థలనూ, బాండ్లు కొన్నవారిని, డిపాజిట్‌దార్లను ముంచేసింది. ఇక నీరవ్‌ పుణ్యమా అని పీఎన్‌బీ భారీ స్కాంలో కూరుకుపోయింది. తగిన హామీలేమీ లేకుండానే అతగాడికి రూ. 11,357 కోట్లు సమర్పించుకుంది.  కనుక ప్రైవేటు బ్యాంకుల ఏర్పాటు విషయంలో అతి జాగ్రత్తగా అడుగులేయాలన్నది నిపుణుల హెచ్చరిక. 

ఆర్‌బీఐ ఇంతక్రితం 2001లోనూ, 2013లోనూ ప్రైవేటు బ్యాంకుల ఏర్పాటుకు మార్గదర్శకాలు విడుదల చేసింది. పర్యవసానంగా ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీవంటి ప్రైవేటు బ్యాంకులొచ్చాయి. అయితే కార్పొరేట్‌ దిగ్గజాలు ఈ రంగంలోకి రాకుండా కట్టుదిట్టమైన నిబంధనలు విధించారు. ఇందుకు కారణం కూడా చెప్పారు. పారిశ్రామిక సంస్థలు బ్యాంకులు ప్రారంభిస్తే అవి సులభంగా ఆ బ్యాంకులనుంచి రుణాలు తీసుకోగలవు. ఎందుకు తీసుకుంటున్నారని వాళ్లను ప్రశ్నించేవారుండరు. పారిశ్రామికవేత్తే తమ యజమాని అయినప్పుడు బ్యాంకు నిర్వాహకులు వారిని ప్రశ్నించే సాహసం ఎలా చేస్తారు? ఈ ప్రశ్నలు గాల్లోంచి పుట్టుకురాలేదు.

స్వాతంత్య్రానంతరం కొన్ని భారీ పారిశ్రామిక సంస్థలు ఇలాగే కావలసినప్పుడల్లా తమ సొంత బ్యాంకుల నుంచి తరచుగా రుణాలు తీసుకుని ఆ బ్యాంకుల్ని దివాళా తీయించాయి. ఇప్పుడు తాజాగా ఆర్‌బీఐ అంతర్గత కార్యాచరణ బృందం ఆ చరిత్రను దృష్టిలో పెట్టుకున్న దాఖలా కనిపించడం లేదు. రిజర్వ్‌ బ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్, మాజీ డిప్యూటీ గవర్నర్‌ విరాళ్‌ ఆచార్యలు దీనిపైనే ప్రశ్నలు సంధించారు. అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరే అన్నదాంతో వారు ఏకీభవించలేదు. ఇప్పుడు అంతకన్నా ప్రమా దకర పరిస్థితులున్నాయన్నది వారి అంచనా. వారి దృష్టిలో కేవలం ఆ సంస్థలు జనం దగ్గరనుంచి సేకరించే డిపాజిట్ల మొత్తంనుంచి సొంతానికి రుణాలు తీసుకోవడం ఒక్కటే సమస్య కాదు.

వాటి రాకడ పెత్తందారీ ఆశ్రిత పెట్టుబడిదారీ పోకడలకు దారితీస్తుందన్నది వారి ఆందోళన. ఇలాంటి పరిస్థితులు తలెత్తితే సకాలంలో గుర్తించి సరిచేయడానికి నియంత్రణ  వ్యవస్థ అమల్లో వుంటుందన్న వాదనతో వారు ఏకీభవించలేదు. రాజన్, ఆచార్యల వాదనలు కొట్టివేయదగ్గవి కాదు. అందుకు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పేరుకుపోయిన మొండి బకాయిలే ఉదాహరణ. ప్రతి బ్యాంకు బోర్డు లోనూ రిజర్వ్‌బ్యాంకు ప్రతినిధి వుంటారు. ఏ బ్యాంకు కార్యకలాపాలు ఏవిధంగా వున్నాయన్నది వారు గమనిస్తూ వుండాలి. కానీ బ్యాంకుల రుణ వితరణలో రాజకీయ జోక్యం పెరుగుతున్నా, పర్యవసానంగా బ్యాంకు నిండా మునిగే పరిస్థితి ఏర్పడినా ఆర్‌బీఐ రంగంలోకి దిగి అడ్డుకున్న దాఖలా లేదు. పారు బాకీలు పెరిగిపోయి, మూలధన కొరత, విస్తరణ సాధ్యపడక అవి నీరసిం చాయి.

ప్రతిసారీ కేంద్ర ప్రభుత్వం ఆదరాబాదరాగా ఆదుకోవడమే తప్ప, వాటంతటవి నిలబడిన ఆచూకీ లేదు. గత కొన్నేళ్లుగా పారు బాకీల లెక్కలు పక్కనపడేసి, ఆ ఏడాది ఆర్థిక కార్యకలాపాలను మాత్రమే చూపి బ్యాంకులకు లాభాలొచ్చినట్టు అంకెలు చూపుతున్నారు. వాస్తవానికి ఆ పారు బాకీలన్నీ బహిరంగపరిస్తే దాదాపు ప్రభుత్వ రంగ బ్యాంకులు నష్టాల్లో వున్న వైనం కళ్లకు కడుతుంది. కొత్తగా ఏర్పాటయ్యే బ్యాంకులను పర్యవేక్షించే నియంత్రణ  వ్యవస్థ అందుకు భిన్నంగా ఏం చేయగలుగుతుంది?

ఎన్ని లోటుపాట్లున్నా మన బ్యాంకింగ్‌ వ్యవస్థకు మంచి పేరే వుండేది. కానీ అదంతా నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థ ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్, మరో నాలుగు బ్యాంకులు చతికిలబడటానికి ముందు. బ్యాంకుల వైఫల్యం అంతకంతకూ పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఈ కొత్త మార్గం ఎంతవరకూ శ్రేయస్కరమో పాలకులు ఆలోచించాలి. కార్పొరేట్‌ దిగ్గజాలు బ్యాంకులు ప్రారంభిస్తే మొదట్లో అవి జనాన్ని ఆకర్షిస్తాయి. డిపాజిట్లు వెల్లువలా వస్తాయి. కానీ రకరకాల రూపాల్లో నియంత్రణ వ్యవస్థల కన్నుగప్పి సొంత ప్రయోజనాలకు భారీ మొత్తాలు మళ్లించుకుంటే...ఆనక  ఆ బ్యాంకులు దివాళా తీస్తే ప్రజానీకం తీవ్రంగా నష్టపోతారు. కనుక ఈ విషయంలో ఆచితూచి అడుగేయడమే ఉత్తమమని కేంద్రం, ఆర్‌బీఐ గుర్తిస్తే మంచిది.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement