‘సుప్రీం’ సూచన శిరోధార్యం

Editorial On Farm Laws In Supreme Court Verdict - Sakshi

సకాలంలో సమస్యపై దృష్టిపెట్టి పరిష్కరించటానికి పూనుకోనట్టయితే అది జటిలంగా మారుతుంది. అనవసర భావోద్వేగాలు పెరిగి పరిష్కారానికి అవరోధమవుతాయి. సాగు చట్టాలకు వ్యతి రేకంగా న్యూఢిల్లీ సరిహద్దుల్లో గత రెండు నెలలుగా రైతులు ఆందోళన సాగిస్తున్నారు. ఇప్పటికి ఎనిమిది దఫాలు కేంద్రం చర్చలు జరిపింది. ఈ నెల 15న మరో దఫా చర్చించబోతున్నారు. ఇంతవరకూ జరిగిన చర్చల సరళి చూస్తుంటే ఈసారైనా పరిష్కారం లభిస్తుందా అన్న సందేహం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో ఉద్యమకారులను ఆ ప్రాంతాలనుంచి పంపించేందుకు చర్యలు తీసుకోమని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సోమవారం సుప్రీంకోర్టు కేంద్రానికి విలువైన సూచన చేసింది. ఆందోళన చేస్తున్న రైతులతో ఒప్పందానికొచ్చేవరకూ వాటి అమలును నిలిపేయాలని సలహా ఇచ్చింది. ఈలోగా చర్చలు జరపడానికి తామే ఒక కమిటీని ఏర్పాటు చేస్తామన్నది. ఎలా చూసినా ఇది ఆచరణాత్మకమైనది. వాస్తవానికి ప్రభుత్వాలు చేసే చట్టాలకు రాజ్యాంగబద్ధత వుందో లేదో చెప్పటం న్యాయస్థానాల బాధ్యత.

అయితే ప్రస్తుత పరిస్థితులు భిన్నమైనవి. రైతుల ఆందోళన వల్ల ప్రజా రవాణాకు, సరుకు రవాణాకు అంతరాయం ఏర్పడింది. ముడి సరుకు ఆగిపోవటంతో ఉత్పత్తి నిలిచిపోయిందని, తయారైన సరుకు తరలించటం అసాధ్యమవుతున్నదని పారిశ్రామికవేత్తలు గగ్గోలు పెడుతున్నారు. రాజస్తాన్‌ వైపున్న సరిహద్దు పరిసరాల్లోని గ్రామస్తులు ఉద్యమకారులపై కారాలుమిరియాలు నూరుతున్నారు. వారికి నిత్యావసరాలు అందకుండా అవరోధాలు కలిగిస్తున్నారు. ఇవన్నీ ప్రమా దకరమైన పరిణామాలు. ఈ సమయంలో కూడా న్యాయస్థానాలు మౌనంగా వుండటం సాధ్యమా? చట్టాలను రద్దు చేయాలని రైతులు పట్టుబడుతుంటే ఆ ప్రశ్నేలేదని కేంద్రం అంటోంది. పైగా న్యాయ స్థానాల్లో వాటిని సవాలు చేసుకోవచ్చని చెబుతోంది. అటు రైతులు అందుకు ససేమిరా అంటు న్నారు. ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ ప్రసంగించాల్సిన బహిరంగ సభాస్థలి వేదికనూ, హెలీప్యాడ్‌నూ ధ్వంసం చేశారు. అక్కడా, పంజాబ్‌లోనూ బీజేపీ కార్యక్రమాలను ఉద్యమకారులు అడ్డుకున్నారు. ఈ పరిస్థితుల్ని సకాలంలో చక్కదిద్దటం ఎంతో అవసరం. లేనట్టయితే సమాజంలో తీవ్ర అశాంతి ఏర్పడుతుంది. కొట్లాటలకు, ఘర్షణలకు దారితీస్తుంది. అయినా పాలకులు దిద్దుబాటు చర్యలు ఎందుకు తీసుకోవటం లేదో అనూహ్యం. 

బహుశా దీన్ని గమనించే సుప్రీంకోర్టు ధర్మాసనం చట్టాల అమలును ఆపుతారా, మమ్మల్నే ఆ పని చేయమంటారా అని ప్రశ్నించింది. ఏదైనా జరిగితే అందరం బాధ్యులం కావాల్సివస్తుందని హెచ్చరించింది. ఉద్యమంతో వ్యవహరిస్తున్న తీరుపై తమకు తీవ్ర అసంతృప్తి వున్నట్టు తెలిపింది. కేవలం పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లోని రైతులు మాత్రమే చట్టాలను వ్యతిరేకిస్తున్నట్టు కేంద్రం చెబుతున్న మాటల్ని కూడా ధర్మాసనం విశ్వసించినట్టు కనబడటం లేదు. చట్టాలు తీసుకురావటానికి ముందు ఎలాంటి సంప్రదింపుల ప్రక్రియ అనుసరించారో తెలియదు గానీ అనేక రాష్ట్రాలు వీటిని కాదంటున్నాయని కూడా అటార్నీ జనరల్‌ను ఉద్దేశించి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బాబ్డే అనడం గమనించదగ్గది. ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవటం, వాటిపై ప్రజల్లో వ్యతిరేకత రావటం సర్వ సాధారణం. అటువంటప్పుడు ఆందోళన చేస్తున్నవారితో చర్చించటం, ఆ నిర్ణయాలకు దారితీసిన పరిస్థితుల గురించి వారికి నచ్చజెప్పటం కూడా మామూలే.  

సుప్రీంకోర్టు లోగడ రైతుల ఆందోళన గురించి అడిగినప్పుడు వారితో చర్చిస్తున్నామని కేంద్రం తెలిపింది. చర్చలైతే జరుగుతున్నాయి. కానీ పరిష్కారం కనుచూపు మేరలో కనబడటం లేదు. సాగు చట్టాల రద్దు ఒక్కటే తమ ఏకైక డిమాండని రైతులు చెబుతున్నది వాస్తవమే అయినా, వారిలో భయాందోళనలు కలిగిస్తున్న అంశాలు ఏ రకంగా అర్థరహితమైనవో చెప్పగలగాలి. ఆర్డినెన్సులు తెచ్చేముందు... వాటి స్థానంలో చట్టాలు చేసేముందు రైతులందరితో చర్చించామని కేంద్రం అంటున్నది. కానీ ఆ చర్చల్లో కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) వంటి ప్రాథమిక అంశాన్నయినా ఎవరూ కేంద్రం దృష్టికి తీసుకురాలేదా అన్న సంశయం కలుగు తుంది. అలాగే ఈ చట్టాల వల్ల మండీలతో సంబంధం లేకుండా రైతులు తమకు నచ్చినచోట సాగు ఉత్పత్తులను అమ్ముకోవచ్చునని చెప్పే మాట కూడా రైతులు నమ్మకపోవటానికి కారణం బిహార్‌ వంటిచోట్ల వున్న అధ్వాన్న స్థితే. అక్కడ ఎంఎస్‌పీ కన్నా తక్కువ ధరకు రైతులు తెగనమ్ముకోవాల్సి వస్తున్నదని ఉద్యమకారులు చెబుతున్నారు.

సాగు చట్టాలపై రైతుల్లో వున్నవి అపోహలే కావొచ్చు. కానీ వాటిని పోగొట్టడానికి ప్రయత్నించే బదులు అసలు చట్టాలు రద్దు చేసేదే లేదని చెప్పటం వల్ల రైతుల ఆందోళన సమసిపోతుందా? కనుకనే ఈ విషయంలో ప్రతిష్టకు పోవొద్దు. సుప్రీంకోర్టు సూచించిన విధంగా సాగు చట్టాల అమ లును కొంతకాలంపాటు నిలిపివేయటమే మంచిదేమో ఆలోచించాలి. అలా చేయటం వల్ల రైతులు తమ ఆందోళన విరమించి స్వస్థలాలకు వెళ్తారు. ఉద్రిక్తతలు ఉపశమిస్తాయి. ఆ చట్టాలను వివిధ జిల్లాల్లో పైలెట్‌ ప్రాజెక్టుగా అమలు చేసి మెరుగైన ఫలితాలు వస్తున్నాయని చూపగలిగితే రైతుల్లో కూడా పునరాలోచన కలగవచ్చు.

ఢిల్లీలో వున్న శీతల వాతావరణం ఇప్పటికే రైతుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. ముఖ్యంగా న్యూమోనియా కేసులు పెరుగుతున్నాయి. ఉద్యమాన్ని నిర్వహిస్తున్న భారతీయ కిసాన్‌ యూనియన్‌(బీకేయూ) చెబుతున్న లెక్కల్ని బట్టి ఇప్పటికి 47మంది అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. ఈ స్థితిని గమనించే వృద్ధులు, మహిళలు, పిల్లల ఆరోగ్యంపై ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. కనుక ఇరుపక్షాలూ పట్టువిడుపులతో వ్యవహరించటం, ఒక పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నించటం అన్నివిధాలా శ్రేయస్కరం.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top