మూకస్వామ్యం!

Editorial On Donald Trump Change Of Presidential Power - Sakshi

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అన్నంత పనీ చేశారు. తాను అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోతే శాంతి యుతంగా అధికారాన్ని బదలాయించబోనని గత సెప్టెంబర్‌లో ప్రకటించారు. ఆ ప్రకటన పర్యవసా నాలను గురువారం ప్రపంచమంతా విస్తుపోయి చూసింది. అధ్యక్ష ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయినా ఆయనే అధ్యక్షుడంటూ నమ్మిన అంధ భక్తగణం దేశ రాజధాని నగరం వాషింగ్టన్‌ డీసీలో కీలక అధికార వ్యవస్థలన్నీ కొలువుదీరిన కాపిటల్‌ హిల్‌లోకి చొరబడి ఆ అధికార సౌధాన్ని మూడు గంటల పాటు చేజిక్కించుకుని మూకస్వామ్యాన్ని ప్రతిష్టించడానికి విఫలయత్నం చేసింది. ఇండిపెండెన్స్‌ డే, జీరో డార్క్‌ థర్టీ, రాంబో వంటి సినిమాలు, ‘24’ వంటి టీవీ సీరియల్‌ ఎపిసోడ్‌లనూ వీక్షించినవారికి అమెరికా కండబలం, గుండె ధైర్యం, దాని గండరగండడి స్వభావం ఔరా అనిపిస్తాయి. కానీ వాస్తవ ప్రపంచంలో మూడుగంటల మూకస్వామ్యం ముందు అవన్నీ బలాదూర్‌ అయ్యాయి.

పురాతన పరిణత ప్రజాస్వామ్యం అనుకున్నది కాస్తా కాసేపు చేష్టలుడిగిపోయింది. జెండాలు, కర్రలే కాదు... రివాల్వర్‌లు, పైప్‌బాంబులు, ప్రమాదకర రసాయనాలు చేతబూనిన వందలాదిమంది తమ నిరసన ఎందుకో, ఎవరిపైనో కూడా తెలియని ఉన్మాద స్థితిలో గోడలపైకి ఎగబాకి లోనికి ప్రవేశించి కనబడి నవాటినల్లా ధ్వంసం చేస్తూ అరాచకాన్ని సృష్టించారు.  బైడెన్‌ ఎలక్టోరల్‌ కాలేజీ విజయాన్ని ధ్రువీక రించటానికి సెనేట్, ప్రతినిధుల సభ ఉమ్మడిగా సమావేశమైన వేళ అనుకోని ఈ పరిణామంతో నివ్వెరపోయిన అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యులు సమావేశాన్ని చాలించి సురక్షితమైన ప్రదేశానికి తరలి పోవాల్సివచ్చింది. అనేకులు ‘బతుకుజీవుడా’ అనుకుంటూ బల్లలకింద తలదాచుకోవాల్సివచ్చింది.

గత నాలుగేళ్లుగా ట్విటర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో విషం విరజి మ్మిన మూక వాస్తవ ప్రపంచంలోకి అడుగుపెడితే పర్యవసానాలెలావుంటాయో బహుశా చాలా మంది ఊహించివుండరు. అదేమిటో వారు ప్రత్యక్షంగా వీక్షించారు. దీన్నంతటినీ గట్టిగా ఖండించా ల్సిన స్థానంలో వున్న ట్రంప్‌ ఆ మూకను వెనకేసుకొచ్చారు. ప్రోత్సహించారు. అన్ని సామాజిక మాధ్యమాలు వెంటనే అప్రమత్తమై ట్రంప్‌ను వెలివేయాల్సివచ్చింది. ఆయన పోస్టు చేసిన వీడియోలను తొలగించాల్సివచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీతో సహా ప్రపంచ నాయకులంతా ఈ దిగ్భ్రాంతికర పరిణామాలను ఖండించారు. సొంత పార్టీలోని సెనెటర్లు సైతం ట్రంప్‌ తీరును నిరసిం చారు. అయినా ఆయనలో పశ్చాత్తాపం కనబడితే ఒట్టు. తనకు చీవాట్లు పెడుతున్న రిపబ్లికన్లంతా బలహీనులనీ, దయనీయ స్థితిలో పడినవారనీ ఎద్దేవా చేస్తున్నారు.

ప్రపంచంలో ఏమూల ఏం జరిగినా దానిపై స్పందించటం, అక్కడి పాలకులకు ప్రజాస్వామ్య పాఠాలు చెప్పటం అమెరికాకు దశాబ్దాలుగా అలవాటైంది. కానీ తెచ్చిపెట్టుకున్న ఈ పెద్దరికం కాస్తా నాలుగేళ్లక్రితం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ట్రంప్‌ ధాటికి కుప్పకూలింది. అదే పదవిని ఈసారి దొడ్డిదారిన చేజిక్కించుకోవచ్చుననుకున్న ఆయన విపరీత ధోరణితో అమెరికా నవ్వులపాలైంది. ఆయన తీరును ఇప్పుడు ఖండిస్తున్నవారిలో చాలామంది ఇన్నాళ్లూ ఆయనకు వంతపాడినవారే. ట్రంప్‌ను సరిగా పసిగట్టలేకపోయామని సంజాయిషీ ఇస్తున్నవారంతా అమాయకత్వాన్ని నటిస్తున్న వారే. గత నాలుగేళ్లుగా ఆయన వైషమ్యాలను నాటుతుంటే మౌనంగా మిగిలిపోయినవారే. అవి అమెరికన్‌ సమాజంలో అన్ని స్థాయిల్లోనూ అల్లుకుపోయి వేళ్లూనుకోగా ఇప్పుడు తప్పయి పోయిం దని వారంతా గొంతు సవరించుకుంటున్నారు. ట్రంప్‌ రూపంలో దాగిన ప్రమాదాన్ని సకాలంలో గుర్తించ నిరాకరించిన రిపబ్లికన్‌ పార్టీ ఇప్పుడు భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సివచ్చింది.

కంచుకోట అనుకున్న జార్జియాలో రెండు సీట్లకు జరిగిన ఎన్నికల్లో సైతం అది ఓటమిని మూటగట్టుకుని నగుబాటుపాలైంది.  బైడెన్‌కొచ్చిన ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లలో కొన్నిటిని నిరాకరించి, ఆయన అధ్య క్షుడు కాకుండా నిరోధించాలని ట్రంప్‌ తీసుకొచ్చిన ఒత్తిళ్లను... ఆయనకు అత్యంత విశ్వాసపాత్రు డిగా వున్న ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ కొట్టిపడేశారు. రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటానన్న ప్రమాణా నికి కట్టుబడివుంటానని ఆయన అమెరికా ప్రజలకు హామీ ఇచ్చారు. ట్రంప్‌ మరో సన్నిహితుడు, సెనేట్‌లో చిరకాలంగా మెజారిటీ నాయకుడిగావున్న మెక్‌కానిల్‌ సైతం ఆయన్ను ఛీకొట్టారు. ఇప్పడు రెండు పక్షాలూ ఏకమై మరో 13 రోజుల్లో ఎటూ పదవీభ్రష్టుడు కావాల్సిన ట్రంప్‌ను సజావుగా వెళ్లనిస్తారా, అభిశంసన ప్రక్రియ ద్వారా ఆయన చేష్టలకు తగిన రీతిలో జవాబిస్తారా అన్నది చూడాల్సివుంది. ట్రంప్‌ భక్తగణం సృష్టించిన ప్రహసనం వల్ల జో బైడెన్‌ ఎన్నిక ధ్రువీకరణలో కాస్త జాప్యం జరిగింది. 

ట్రంప్‌ వంటి నేతలకు చరిత్ర ఎటువంటి స్థానాన్నిస్తుందో దేశదేశాల్లోని నాయకులందరూ గ్రహించాల్సివుంది. అధికారంలోవున్నా, విపక్షంలో వున్నా బాధ్యతగా మెలగడం నేర్చుకోనివారు ఇప్పుడు ట్రంప్‌కెదురైన పరాభవాన్నుంచి పాఠం తీసుకోగలిగితే అది ప్రపంచంలో ప్రజాస్వామ్యం బలపడటానికి దోహదపడుతుంది. సమాజంలో విద్వేషాలు పెంచిపోషించటం, అధికారం కోసం ఏ గడ్డి కరవడానికైనా సిద్ధం కావటం, తప్పుడు సమాచారంతో ప్రత్యర్థులను అధిగమించాలనుకోవటం ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నాయకుల్లో ఇప్పుడొక ధోరణిగా మారింది.

అమెరికాలో శాసనవ్యవస్థ, న్యాయవ్యవస్థ, పాలనా వ్యవస్థ వగైరాలు పటిష్టంగా వున్నాయి గనుక...మీడియా సైతం లొంగు బాటుకు నిరాకరించింది గనుక ట్రంప్‌ ఆటలు సాగలేదు. కానీ అవి బలహీనంగా వున్న చాలా దేశాల్లో నియంతలు రాజ్యాన్ని వీరభోజ్యం చేసుకున్నారు. పౌరుల నిరంతర అప్రమత్తతే ప్రజాస్వా మ్యాన్ని కాపాడుతుంది. ఎలాంటి స్థితిగతులు ట్రంప్‌ ఎదగటానికి దోహదపడ్డాయో అధికార పీఠం అధిష్టించబోతున్న బైడెన్‌ గ్రహించి, వాటిని చక్కదిద్దటానికి ప్రయత్నించాలి. లేనట్టయితే అవి మరింత వికృతరూపం దాలుస్తాయి. ప్రజాస్వామ్యాన్ని కుప్పకూలుస్తాయి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top