అప్రమత్తతే మందు

Coronavirus Second Wave In Europe Countries - Sakshi

యూరప్‌ దేశాలన్నీ కరోనా వైరస్‌ రెండో దశ విజృంభణతో కుదేలవుతున్న వేళ మన దేశంలో తొలిసారి ఆ మహమ్మారి క్రమేపీ ఉపశమిస్తున్న జాడలు కనిపిస్తున్నాయి. కరోనాపై మనం పోరు ప్రారంభించి దాదాపు ఏడు నెలలు కావస్తుండగా జూలై నుంచి అది ఎడాపెడా విస్తరిస్తూ పోయింది. ఈ మూడు నెలల కాలంలో తొలిసారి సోమవారం దేశవ్యాప్తంగా 47,000 కేసులు నమోదయ్యాయి. ఆమర్నాడు స్వల్పంగా పెరిగి 50,000కు చేరాయి. సాధారణంగా సోమవారం వెలువడే కరోనా ఫలితాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎందుకంటే మిగిలిన రోజులతో పోలిస్తే ప్రతి ఆదివారమూ కరోనా పరీక్షల సంఖ్య తక్కువగా వుంటుంది. సాధారణ రోజుల్లో దాదాపు 11 లక్షల పరీక్షలు జరుగుతుండగా... ఆదివారాల్లో అవి 8–9 లక్షల మధ్య వుంటాయి. అయినా రోజూ దాదాపు 60,000 కేసులు బయటపడటం రివాజైంది. కానీ ఈ ఆదివారం 8.59 లక్షల పరీక్షలు జరిపినా తక్కువ కేసులే వెల్లడయ్యాయంటే అది సంతోషించదగ్గ విషయం.

ముఖ్యంగా రోజూ అధిక సంఖ్యలో కేసులు బయటపడుతున్న మహారాష్ట్రలో కూడా 6,000 కన్నా తక్కువ కేసులు నమోదుకావడం కూడా జూలై 8 తర్వాత ఇదే తొలిసారి. ఈమధ్య కరోనా తీవ్రత ఎక్కువగా వున్నట్టు కనబడుతున్న కర్ణాటక, కేరళల్లో కూడా కొత్త కేసులు తగ్గాయి. కానీ ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం జాతినుద్దేశించి ప్రసంగించిన సందర్భంగా చెప్పినట్టు కరోనా తగ్గుముఖం పట్టినట్టు కనబడుతున్నా అప్రమత్తత ఏమాత్రం సడలనీయకూడదు. మాస్క్‌ ధరించడంతో మొదలుపెట్టి ముందు జాగ్రత్తల్లో దేన్నీ నిర్లక్ష్యం చేయకూడదు. కరోనా తీవ్రత తగ్గినట్టు కనిపించడంతో చాలామందిలో ఒకరకమైన నిర్లక్ష్య ధోరణి బయల్దేరింది. కొందరు శాస్త్రవేత్తలు భారత్‌లో ఇప్పటికే కరోనా వైరస్‌ ఉచ్చస్థితికి వెళ్లి, అక్కడినుంచి వెనక్కి రావడం మొదలైందంటున్నారు. మనకిక రెండో దశ బెడద ఉండకపోవచ్చునని చెబుతున్నారు. ఇదే తీరు కొనసాగితే వచ్చే ఫిబ్రవరినాటికల్లా ఈ మహమ్మారి విరగడకావొచ్చునని అంచనాలు వేస్తున్నారు. కానీ ముందుజాగ్రత్త చర్యల్ని విస్మరించేవారు గుర్తుపెట్టుకోవాల్సిందేమంటే ఆ  తగ్గే సంఖ్యలో అలాంటివారుండే అవకాశం లేకపోలేదు. అందువల్లే వ్యాక్సిన్‌ వచ్చేవరకూ ఇప్పుడమలవుతున్న జాగ్రత్తలన్నీ పాటించకతప్పదు.

నియంత్రణ విధానాలను విస్మరిస్తే ఏమవుతుందో ప్రస్తుతం యూరప్‌ దేశాలనూ, అమెరి కానూ చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా యూరప్‌ దేశాలన్నీ ఇంచుమించుగా కరోనా బారినుంచి బయటపడి ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభించడం మొదలుపెట్టాయి. పరిమితంగా అయినా పరిశ్రమలు తెరుచుకోవడం, రవాణా సదుపాయాలు సాధారణ స్థితికి చేరడం, మళ్లీ జనం రోడ్లపై సందడి చేయడం కనబడింది. ఈ దేశాల్లో ఇటీవల ఒకరకమైన అసహనం మొదలైంది. కరోనా తగ్గాక కూడా ఇంకా ఆంక్షలుండటం ఏమిటన్నది దాని సారాంశం. కానీ తాజాగా బయటపడు తున్న కేసులతో ఆంక్షల్ని మళ్లీ పెంచడం మొదలుపెట్టారు. వృధా ప్రయాణాలు మానుకోవాలని, సాధ్యమైనంతవరకూ ఇళ్లకే పరిమితం కావాలని జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కల్‌ దేశ పౌరులను కోరారు. అందరం కలిసికట్టుగా నిబంధనలు పాటించడం వల్లే వైరస్‌ తొలి దశ దాడినుంచి కనిష్ట నష్టాలతో బయటపడగలిగామని, ఇప్పుడు సైతం దాన్ని మరిచిపోవద్దని విజ్ఞప్తిచేశారు.

యూరప్‌ దేశాల పరిస్థితి ప్రస్తుతం అయోమయంగా వుంది. కరోనా తొలి దశ విజృంభణ నుంచి బయట పడ్డాక నెమ్మదిగా యధాపూర్వ స్థితికి వస్తున్న తరుణంలో రెండో దశ విజృంభణ పుట్టుకొచ్చి అంతంతమాత్రంగా కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థల్ని చిక్కుల్లో పడేసింది. జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, స్పెయిన్, నెదర్లాండ్స్‌లు గతవారం మళ్లీ కఠినమైన ఆంక్షల్ని అమలు చేయడం మొదలుపెట్టాయి. ఇవి ఇంకా పెరుగుతాయని రెండు మూడు రోజులుగా నాయకులు చెబుతున్నారు. త్వరలో విడు దల కాబోయే మూడో త్రైమాసికం ఆర్థిక ఫలితాలు బాగుంటాయని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నవేళ నాలుగో త్రైమాసికం పూర్తిగా నెగెటివ్‌లోకి జారుకునే సూచన కనబడుతోంది. మాంద్యం రెండంకెలకు చేరుకోవచ్చునని ఇప్పుడు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి యూరప్‌ యూనియన్‌(ఈయూ) తన సభ్యదేశాలకు రికవరీ ఫండ్‌ కింద ఇవ్వదల్చుకున్న 75,000 కోట్ల యూరోల నిధుల పంపిణీని ప్రస్తుతానికి నిలిపేయాలని ఆలోచిస్తున్నట్టు చెబుతున్నారు. వచ్చే ఏడాది వరకూ దాని జోలికి వెళ్లకపోవచ్చునని అంటున్నారు.  

ఇప్పుడు యూరప్‌ పరిణామాలు మనకు గుణపాఠం కావాలి. కరోనా బయటపడిన తొలి నాళ్లలో కేరళ దాన్ని సమర్థవంతంగానే ఎదుర్కొంది. వరసబెట్టి తీసుకున్న చర్యల కారణంగా అక్కడ కేసుల సంఖ్య రోజుకు కేవలం రెండు, మూడు మాత్రమే వెల్లడైన సందర్భాలున్నాయి. కానీ ఈమధ్య అవి మళ్లీ పెరుగుతున్నాయి. ఈ నెల 11న ఒకేరోజు 11,755 కేసులు బయటపడినప్పుడు అందరూ నిర్ఘాంతపోయారు. కర్ణాటకలో సైతం ఇంతే. అక్కడ కూడా ఇటీవలకాలంలో కేసులు పెర గడం మొదలైంది. దీని వెనకున్న కారణాలేమిటో నిపుణులు నిర్దిష్టంగా చెప్పలేకపోతున్నారు. కానీ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గడం మొదలయ్యాక జనాన్ని హెచ్చరించడంలో ప్రభుత్వాలు విఫలం కావడం వల్ల వరసగా వచ్చిన పండగల్లో జాగ్రత్తలు తీసుకోవడం తగ్గిందని వారు చెబు తున్న మాట. అలాగే కరోనా జన్యువుల్లో వచ్చిన ఉత్పరివర్తన కూడా ఇందుకు దోహదపడి వుండొ చ్చని అంచనా వేస్తున్నారు. కనుక ఏమాత్రం అజాగ్రత్తగా వున్నా ఇదే ధోరణి దేశమంతా కనబడే ప్రమాదం వుంది. విద్యాసంస్థలను యధావిధిగా నడుపుకోవడానికి ప్రయత్నిస్తూనే, రవాణా సదు పాయాలను కొనసాగిస్తూనే, ఇతరత్రా కార్యకలాపాలకు చోటిస్తూనే నిరంతరం అందరూ అప్రమ త్తంగా వుండకతప్పదు. ఎక్కడ లోపం జరిగినా పరిస్థితి మొదటికొచ్చే ప్రమాదం వుంటుంది. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top