నిజంగానే గోదావరి ఘోషిస్తోంది.. తన గుండె నిండా వేదనను నింపుకొంటుంది.. చారిత్రక నగరి రాజమహేంద్రవరంలో వరుసగా జరుగుతున్న హింసాత్మక ఘటనలు చూస్తూ కన్నీరు పెట్టుకుంటోంది. ఇలా సాంస్కృతిక రాజధాని అట్టుడికిపోతోంది.. ప్రశాంత వాతావరణంలో జీవించాల్సిన జనంలో భయాందోళనలు నింపుతోంది.. కత్తులతో దాడులు, అత్యంత అమానుషంగా హత్యలు, మద్యం మత్తులో అరాచకాలు, గంజాయి తాగి రగడలు.. ఇలా జరుగుతున్న ఘటనలు చెబితే, చాంతాడు అవుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది.
సాక్షి, రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం రక్తసిక్తంగా మారుతోంది. జరుగుతున్న అనాగరిక చర్యలు అందరిలో భయాందోళన కలిగిస్తోంది. ఓ వ్యాపార లావాదేవీల వివాదంతో కత్తిపోట్లు.. మరోచోట పాత కక్షలతో ఆటోడ్రైవర్‌పై ఇనుప రాడ్లతో దాడి.. ఇంకోచోట ఒంటరి మహిళ తలపై సుత్తితో కొట్టి క్వారీ గోతుల్లో పడేసిన ఘటనలు పాలనలో లోపాలను ఎత్తిచూపుతున్నాయి. నగరంలో మద్యం, గంజాయి విక్రయాలు, మత్తులో గొడవలు, యువకుల మధ్య ఘర్షణలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో కొన్ని ప్రాంతాల్లో మద్యం మత్తులో ఆకతాయిలు ప్రవర్తిస్తున్న తీరు అత్యంత దారుణం. బ్లేడ్, గంజాయి బ్యాచ్‌ల పేరుతో తిరుగుతున్న వారి ఆగడాలకు అదుపు లేకుండా పోతోంది. వైద్య విద్యార్థిని ప్రియాంక ఘటనలో మద్యం మత్తు అంశం పోలీసుల దర్యాప్తులో ప్రస్తావనకు వచ్చింది. ఆటోడ్రైవర్ బుజ్జిబాబు హత్యకు దారితీసిన పాత వివాదం కూడా మద్యం తాగుతున్న సమయంలో ప్రారంభమైంది. నగరంలో జరిగిన ప్రతి హింసాత్మక ఘటనకూ మద్యం లేదా గంజాయే కారణమని స్పష్టంగా తెలుస్తోంది. అయినప్పటికీ మత్తు పదార్థాల వినియోగం, అక్రమ విక్రయాలపై కఠిన నిఘా లేదు. నగరంలో తాడితోట, క్వారీ మార్కెట్, ఇంద్రానగర్, సంజీవయ్యనగర్, ఆదెమ్మతోట, సీతంపేట, ఆల్కాట్ గార్డెన్స్, జేఎన్ రోడ్డు, ఏవీఏ రోడ్డు, రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్ పరిసరాలు, తదితర ప్రాంతాల్లో రాత్రి వేళల్లోనూ మద్యం లభ్యమవుతోంది. కొన్ని ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లోనే మద్యం తాగుతూ మందుబాబులు హల్‌చల్ చేస్తున్నారు. గతంతో పోల్చితే నగరంలో హత్యలు, హత్యాయత్నాలు, మత్తు పదార్థాల కేసులు కూటమి ప్రభుత్వంలో భారీగా పెరగడం శోచనీయం. ఆ ఘటనలు ఇలా..
రాజమహేంద్రవరంలో రు‘బాబులు’
హత్యలు, దాడులు,
‘మత్తో’న్మాదులతో ఆందోళనలు
వరుసగా హింసాత్మక ఘటనలు
గంజాయి లావాదేవీల్లో ఓ యువకుడి హత్య
వైద్య విద్యార్థిని ప్రియాంక మృతిపై ప్రశ్నలెన్నో!
మద్యం, గంజాయి విక్రయాలు..
బ్లేడ్ బ్యాచ్‌లతో అరాచకాలు
కక్ష పెంచుకుని.. కాటేసి
ఆగస్టు 5: స్థానిక గోకర్ణపేటకు చెందిన చెవేటి బుజ్జిబాబు (28) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన విజయ్, నవీన్‌తో మే నెలలో మద్యం తాగుతుండగా ఘర్షణ జరిగింది. దీనిపై బుజ్జిబాబు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అప్పటి నుంచి కక్ష పెంచుకున్న విజయ్, నవీన్, వారి స్నేహితుడు సుభాష్ కలసి గోరక్షణపేట వద్ద ఆగస్టు 5న రాత్రి బుజ్జిబాబుపై ఇనుపరాడ్డుతో దాడి చేసి పరారయ్యారు. దీంతో తీవ్ర గాయాలైన అతను ఆసుపత్రిలో మరణించాడు. ఈ ఘటనతో ఎనిమిది నెలల పసిబిడ్డకు తండ్రి ప్రేమ దూరమైంది. భర్తను కోల్పోయిన యువతి జీవితంలో విషాదం మిగిలింది.
సుత్తితో మోది.. గోతుల్లో పడేసి
ఆగస్టు 25: బొమ్మూరు ప్రాంతానికి చెందిన గడ్డం ధనలక్ష్మి భర్త నిరాదరణకు గురై ఒంటరిగా జీవిస్తుంది. ఆమెకు గాడాలకు చెందిన మట్టాడి ప్రసాద్, మట్టాడి అయ్యప్ప ఫోన్ చేసి తమ ఇంట్లో పుట్టినరోజు వేడుక ఉందని చెప్పడంతో ఆమె వెళ్లినట్లు సమాచారం. దీంతో గాడాలలోని నిర్జన ప్రాంతానికి ఆమెను తీసుకెళ్లి తలపై సుత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి.. చనిపోయిందని భావించి ఆటోలో తీసుకెళ్లి మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్వారీ గోతుల్లో పడేసి వెళ్లిపోయారు. అదృష్టవశాత్తూ ఆమె పడిన ప్రాంతంలో మట్టి ఉంది. దీంతో తీవ్ర గాయాలతో రాత్రంతా మృత్యువుతో పోరాడగా.. మరుసటి రోజు ఉదయం క్వారీ ప్రాంతంలో ప్రమాదాల నివారణకు ఫెన్సింగ్ వేస్తున్న సిబ్బంది ఆమెను గుర్తించి 108 అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో కేసు నమోదు, దర్యాప్తు ప్రారంభంలో జాప్యం జరిగిందన్న ఆరోపణలూ వచ్చాయి. ‘సాక్షి’ దినపత్రికలో వార్త ప్రచురితమైన తర్వాత పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితురాలి వాంగ్మూలం సేకరించారు.
కత్తులతో విరుచుకుపడి..
జూలై 28: రాజమహేంద్రవంలోని ఇన్నీసుపేట దుగ్గళ్లదొడ్డి సమీపంలో యువకుడు ఎర్ర గణేష్ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. గుట్కా వ్యాపార లావాదేవీల్లో తలెత్తిన మనస్పర్థల నేపథ్యంలో గణేష్ స్నేహితుడు పాలా చంద్రశేఖర్ మరో ముగ్గురితో కలిసి కత్తులతో హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం ప్రాణాలు తీసే స్థాయికి చేరడం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. నిషేధిత గుట్కా వ్యాపారం, దాని వెనుక ఉన్న ఆర్థిక లావాదేవీలు, వివాదాలపై పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరాన్ని ఈ ఘటన గుర్తు చేస్తోంది.


