హరిహరుల నామస్మరణతో రాజమహేంద్రవరంలోని గోదావరి పులకించింది.. పవిత్ర కార్తిక పౌర్ణమి శుభవేళ ఆ నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తజనం పునీతమైంది.. కార్తిక దీపాలతో ఆ ప్రాంతం శోభాయమానంగా వెలుగొందింది. మంగళవారం నగరంతో పాటు జిల్లాలోని ఆలయాల ప్రాంగణాలు కార్తిక కాంతులతో నిండిపోయాయి. శైవక్షేత్రాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. మహిళలు తమ సౌభాగ్యం కోసం దానాలు ఇచ్చారు. స్థానిక ఉమామార్కండేయ స్వామివారి దేవాలయంలో రుద్రాభిషేకం నిర్వహించారు. రాత్రి జ్వాలాతోరణం జరిగింది. ఉమా కోటిలింగేశ్వరస్వామి ఆలయంలో రుద్రాభిషేకాలు, భవనేశ్వరీదేవికి కుంకుమార్చనలు చేశారు. శృంగేరీ శారదా శంకర మఠంలో చంద్రమౌళీశ్వరునికి పంచామృతాభిషేకాలు చేశారు.
– సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం)
రాజమహేంద్రవరం పుష్కరాల రేవులో పుణ్య స్నానాలు ఆచరిస్తున్న భక్తులు
రాజమహేంద్రవరంలోశివలింగానికి పూజలు చేస్తున్న మహిళలు


