సహకార సమరానికి కసరత్తు | - | Sakshi
Sakshi News home page

సహకార సమరానికి కసరత్తు

Nov 10 2026 12:13 AM | Updated on Nov 10 2026 12:13 AM

సాక్షి, రాజమహేంద్రవరం : జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌) ఎన్నికల నిర్వహణకు కసరత్తు ప్రారంభమైంది. ఇప్పటికే మున్సిపల్‌, పరిషత్‌ పోరు ముగియగా త్వరలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. అవి పూర్తికాగానే పీఏసీఎస్‌ల ఎన్నిక నిర్వహణకు సహకార శాఖ కసరత్తు ప్రారంభించింది. గతంలో 2013లో పీఏసీఎస్‌లకు చివరిసారిగా ఎన్నికలు నిర్వహించారు. అనంతరం రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటి వరకూ ఎన్నికలు నిర్వహించలేదు. ఈ క్రమంలో తొలిసారి నిర్వహించనున్న ఈ ఎన్నికల కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలంటూ సహకార సంఘాల రిజిస్ట్రార్‌ (ఆర్‌సీఎస్‌) అహ్మద్‌బాబు జిల్లా సహకార శాఖ అధికారులను ఆదేశిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లాలోని 128 పీఏఎస్‌ల సిబ్బందిని జిల్లా ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు.

ఓటర్ల జాబితాలకు తుది రూపు

వాస్తవానికి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లోని సభ్యులందరికీ ఓట్లు ఉండవు. రూ.300 సభ్యత్వ రుసుము చెల్లించి, లావాదేవీలు నిర్వహించే వారికే ఓట్లు హక్కు ఉంటుంది. అన్ని పీఏసీఎస్‌లను డిజిటలైజ్‌ చేసినందున ప్రతి సభ్యుడు ఆధార్‌ కార్డుతో ఈకేవైసీ చేయించాల్సి ఉంటుంది. రుణాలు చెల్లించక డీఫాల్టర్‌ అయిన వారికి ఓటు హక్కు నిరాకరిస్తారు. మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌ సహకార సంఘాల చట్టం 1964 ప్రకారం సభ్యత్వ నమోదు, ఓటర్ల అర్హతలు, అనర్హతలను నిర్దేశిస్తారు. పీఏసీఎస్‌ల వారీగా సభ్యత్వ వివరాలు ధ్రువీకరించి అర్హులైన ఓటర్ల తుది జాబితా సిద్ధం చేయాల్సి ఉంది. సభ్యత్వం ఉన్నప్పటికీ పూర్తి వివరాలు లేకుంటే ఈ కేవైసీ డ్రైవ్‌ నిర్వహించాల్సి ఉంటుంది. ప్రాథమిక ఏర్పాట్లు, జాబితాలపై పది రోజుల్లో నివేదికలు ఇవ్వాలని ఉన్నతాధికారులు కోరారు.

ఒకే విడతలో ఎన్నికల నిర్వహణ

జిల్లాలోని 128 పీఏసీఎస్‌లకు ఒకే విడతలో ఎన్నికల నిర్వహణకు వీలుగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. అందుకోసం పోలింగ్‌ కేంద్రాల గుర్తింపుతోపాటు ఎన్నికల సామగ్రి, బ్యాలెట్‌ పెట్టెలు లభ్యతను అంచనా వేయాలని, స్ట్రాంగ్‌ రూమ్‌లను గుర్తించడంతోపాటు ఎన్నికల నిర్వహణలో అనుభవం ఉన్న సిబ్బందికి ముందుగానే శిక్షణ ఇవ్వాలని ఆర్‌సీఎస్‌ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పటికీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి డీసీసీబీ, డీసీఎంస్‌ సంయుక్తంగానే ఉన్నాయి. జిల్లాల విభజన జరిగినప్పటికీ వాటిని నేటికీ విభజించలేదు. ఈ క్రమంలో కొత్త జిల్లాల ప్రాతిపదికన డీసీసీబీ, డీసీఎంస్‌లను విభజించాల్సి ఉంది. అదే జరిగితే అవసరమైనచోట కొత్త సొసైటీలను కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం పాత జిల్లాల ప్రాతిపదికనే ఎన్నికలు నిర్వహిస్తుందా, జిల్లా పరిషత్‌ల విభజన మాది రిగానే ఆయా జిల్లాలకు ఎన్నికలు నిర్వహిస్తుందా అన్నది తేలాల్సి ఉంది. మొత్తంగా డిసెంబర్‌ చివరిలో లేదా జనవరి ప్రారంభంలో సహకార సంఘాల ఎన్నికలు పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది.

ఫ పంచాయతీ ఎన్నికల తర్వాత

నిర్వహణకు సన్నాహాలు?

ఫ ఏర్పాట్లు చేయాలని సహకార

సంఘాల రిజిస్ట్రార్‌ ఆదేశాలు

ఫ జిల్లాలో 128 ప్రాథమిక

సహకార సంఘాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement