వెలుగుల పండగ దీపావళిని ఆదివారం రాత్రి జిల్లా ప్రజలు భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకొన్నారు. ఆకాశంలో తారలు నేలకు దిగివచ్చినట్టుగా ప్రతి ఇంటా దీపాల తోరణాలు కనువిందు చేశాయి. ప్రత్యేక పూజలనంతరం కుటుంబ సభ్యులతో కలిసి బాణసంచా కాల్చి సందడి చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమలలో శ్రీవారు క్షేత్ర పురవీధుల్లో విహరించి భక్తులకు కనువిందు చేశారు. ప్రధాన మెట్ల మార్గంలో దేవస్థానం సిబ్బంది బాణసంచా కాల్చి వేడుకకు మరింత శోభను చేకూర్చారు. అనంతరం పాదుకా మండపం వద్ద దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాథరావు దంపతులు స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే రాజమహేంద్రవరంలోని దేవీచౌక్‌లో దీపావళి సంబరాలు అంబరాన్ని అంటాయి.
– సాక్షి, నెట్‌వర్క్


