కొవ్వాడల్లో ముంపు | - | Sakshi
Sakshi News home page

కొవ్వాడల్లో ముంపు

Nov 7 2026 12:18 AM | Updated on Nov 7 2026 12:18 AM

● కొవ్వూరు, చాగల్లు మండలాల్లో

జలదిగ్బంధం!

● నీట మునిగిన వేలాది ఎకరాల పంట పొలాలు..

● వరద నీటిలో కాలనీలు..

నిలిచిన రాకపోకలు

● చేతికొచ్చిన పంట నీటిపాలు..

● కన్నీరుమున్నీరవుతున్న అన్నదాతలు

చాగల్లు: వరుస తుపాన్లు, ఎడతెరిపి లేని వర్షాలకు తోడు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీటితో కొవ్వాడ కాలువ ఉగ్రరూపం దాల్చింది. దీంతో కొవ్వూరు, చాగల్లు మండలాల్లోని పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేలాది ఎకరాల పొలాలు నీట మునగగా, లోతట్టు కాలనీలు ముంపునకు గురయ్యాయి. రహదారులు, వంతెనలపై ప్రమాదకర స్థాయిలో నీరు ప్రవహించడంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

జలదిగ్బంధంలో రహదారులు

కొవ్వూరు, చాగల్లు మండలాల్లోని ప్రధాన రహదారులపై కొవ్వాడ వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. కాపవరం–ధర్మవరం రహదారి, చాగల్లు నుంచి నందమూరు మీదుగా కొవ్వూరు వెళ్లే మార్గం, చాగల్లు నుంచి పసివేదల మీదుగా కొవ్వూరు వెళ్లే మార్గం, చాగల్లు–కాపవరం రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే చాగల్లు–మార్కొండపాడు మార్గం, ఉనగట్ల–చాగల్లు రైల్వే స్టేషన్‌ రహదారి, దారవరం రైల్వే గేట్‌ నుంచి వెళ్లే మార్గాల్లోనూ వరద ఉధృతి అధికంగా ఉండడంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు.

పునరావాస కేంద్రాల ఏర్పాటు..

ముంపు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద నీరు ప్రవహిస్తున్న రహదారులు, వంతెనలపై నుంచి ప్రయాణించవద్దని సూచిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి వరద బాధితులకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని, పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు తగిన పరిహారం అందించాలని బాధితులు కోరుతున్నారు.

జగనన్న కాలనీ మునక

కొవ్వాడ నీటి ఉధృతికి కొవ్వూరు మండలం కాపవరంలోని జగనన్న కాలనీ నీట మునిగి, విద్యుత్‌ సరఫరా నిలచిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే చాగల్లు మండలం బ్రాహ్మణగూడెంలో శుక్రవారం వీధులు జలమయమయ్యాయి. 40 ఏళ్ల క్రితం వచ్చిన వరదను స్థానికులు గుర్తుచేసుకుంటున్నారు.

కనుచూపు మేరంతా నీరే..

వరుస తుపానులు, వర్షాలు, ఈదురుగాలులతో చేతికొచ్చిన పంపలు నేలకు ఒరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో ఎగువ ప్రాంతాల నుంచి కొవ్వాడ కాలువకు వస్తున్న వరద నీటితో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. కొవ్వూరు మండలంలోని కాపవరం, పసివేదల, వేములూరు, నందమూరు గ్రామాలతో పాటు చాగల్లు మండలంలోని చాగల్లు, నెలటూరు, గౌరిపల్లి మార్కొండపాడు, చంద్రవరం, మల్లవరం, దారవరం, నందిగంపాడు తదితర గ్రామాల్లో పంటలు మునిగిపోగా, అరటి, ఉద్యాన పంటలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement