మృతదేహం లభ్యం | - | Sakshi
Sakshi News home page

మృతదేహం లభ్యం

Nov 7 2026 12:18 AM | Updated on Nov 7 2026 12:18 AM

సఖినేటిపల్లి: స్థానిక బోను సెంటర్‌కు సమీపంలో గోదావరి నది ఒడ్డుకు గుర్తు తెలియని పురుషుడి మృతదేహం కొట్టుకువచ్చినట్టు ఎస్సై హరికోటి శాస్త్రి శుక్రవారం తెలిపారు. మృతుడి వయసు సుమారు 40 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండవచ్చునని, ఒంటిపై దుస్తులు లేవని, మృతదేహం పొడవు 5.8 అడుగులు ఉంటుందని తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.

గుర్తుతెలియని వ్యక్తి మృతి

కంబాలచెరువు: స్థానిక జాంపేట సిరి డైరీ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని శుక్రవారం స్థానికులు గుర్తించారు. వారి సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న మూడో పట్టణ పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా ఎటువంటి ఆధారం లభించలేదు. మృతుని చేయిపై శంకర్‌ అని పచ్చబొట్టు ఉంది. ఆచూకీ తెలిసిన వారు మూడో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో సంప్రదించాలని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి మార్చురీలో భద్రపరిచారు.

వ్యాన్‌ ఢీ కొని..

రాజానగరం: స్థానిక పాత ఎన్‌హెచ్‌పై టెలిఫోన్‌ ఎక్ఛేంజ్‌ సమీపంలో శుక్రవారం జరిగిన ప్రమాదంలో చక్రద్వారబంధానికి చెందిన పితాని రామకృష్ణ (52) మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు చక్రద్వారబంధం నుంచి బైకుపై రాజానగరం వచ్చి తిరిగి వెళ్తుండగా రోడ్డు పై పడిన గుంతను తప్పించే క్రమంలో ప్రమాదవశాత్తు పక్క నుంచి వెళ్తున్న వ్యాన్‌ కింద పడడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమారుడికి ఇటీవలే వివాహం చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అనారోగ్యంతో ఎంపీటీసీ అభ్యర్థి ..

దేవరపల్లి: మండలంలోని జనసేన పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి గారపాటి దివ్య (23) అనారోగ్యంతో రాజమహేంద్రవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం గారపాటి దివ్య జనసేన పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసింది. గురువారం పోలింగ్‌ అనంతరం మధ్యాహ్నం ఆమె అస్వస్థతకు గురికావడంతో చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స అంనంతరం రాత్రి ఇంటికి తీసుకువచ్చారు. శుక్రవారం ఉదయం ఆమె అనారోగ్యానికి గురికాగా, చికిత్స కోసం మళ్లీ రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. దివ్యకు నాలుగు నెలల క్రితం బాబు పుట్టగా, అంతకు ముందు ఒక కుమారుడు ఉన్నాడు. ఆమె మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

అపార్ట్‌మెంట్‌లో చోరీ

● తాళాలు పగలగొట్టి ఆభరణాల

అపహరణ

● సొత్తు విలువ రూ.15 లక్షలు

కపిలేశ్వరపురం (మండపేట): పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తి అపార్ట్‌మెంట్‌ గది తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డాడు. ఊరి నుంచి తిరిగి వచ్చిన ఫ్లాట్‌ యజమాని ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం... పట్టణ పరిధిలోని విజయలక్ష్మి నగర్‌లో బిస్మిల్లా అపార్ట్‌మెంట్‌లోని పుట్టా ప్రసాద్‌ చౌదరి ఈ నెల రెండో తేదీన తిరుపతి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఉండగా అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్‌ ఫోన్‌ చేసి ప్లాట్‌ తలుపులు తీసి ఉన్నాయని సమాచారం ఇచ్చాడు. శుక్రవారం వచ్చి చూడగా ఫ్లాట్‌ తాళాలు, దేవుని గది, బెడ్‌ రూమ్‌ తాళాలు పగలగొట్టి ఉన్నాయి. 120 గ్రాముల బంగారం, 750 గ్రాముల వెండి ఆభరణాలు, 2.5 లక్షల నగదు, హెచ్‌డీఎఫ్‌సీ లాకర్‌ కీ, స్మార్ట్‌ వాచ్‌ చోరీకి గురయ్యాయి. మొత్తం చోరీ సొత్తు రూ.15 లక్షలు ఉంటుందని బాధితుడు పుట్టా ప్రసాద్‌ తెలిపారు. క్రైమ్‌ బ్రాంచి డీఎస్పీ పట్నాయక్‌ పర్యవేక్షణలో, పట్టణ సీఐ వాసంశెట్టి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో క్లూస్‌ టీం ఆధారాలు సేకరించే ప్రయత్నం చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ శ్రీనివాస్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement