● తాడు బంధం ఉండడంతో
ప్రాణాలు కోల్పోయిన గేదె
● మేత మేస్తూ చెరువులో దిగబడి
ఊపిరాడక మృతి
కోరుకొండ: పల్లెల్లో పశువుల పెంపకంతో పాటు, వాటి పట్ల బంధం కూడా పెనవేసుకుని ఉంటుందనడానికి ఈ ఘటనే నిదర్శనం. మండలం కోటి గ్రామంలోని ముత్తయ్య చెరువులోకి దిగిన గేదెను కాపాడబోయి పాడిరైతు బందెల పోసేశ్వరరావు (53)మృతి చెందాడు. స్థానిక ఎస్సై ఆర్.శివాజీ తెలిపిన వివరాల మేరకు మెడకు, కాలికి తాడుతో బంధం వేసి ఉన్న గేదె మేతకు వెళ్లింది. మేత మేస్తూ స్థాని ముత్తయ్య చెరువులోకి దిగింది. అయితే తాడు ఉందన్న విషయాన్ని గుర్తించలేని పాడిగేదె చెరువులో దిగబడిపోయింది. దానికి ఉన్న తాడును తప్పించే క్రమంలో పోసేశ్వరరావు చెరువులో చిక్కుకుని ఊపిరాడక మృతి చెందాడు. అనంతరం పాడి గేదె సైతం మృతి చెందింది. ఈ పాడిగేదె ఖరీదు రూ.1 లక్ష ఉంటుందని యజమానులు తెలిపారు. పోసేశ్వరరావుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అతడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఎస్సై ఆర్.శివాజీ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


