దేవీపట్నం: గోదావరి నదిలో బోట్ ప్రయాణం చేస్తూ పాపికొండల అందాలను వీక్షించే విహార యాత్ర నేటి నుంచి పునఃప్రారంభం కానుంది. పది రోజుల క్రితం ఏర్పడిన ఆర్నబ్, మురసు తుపాన్ల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ పాపికొండల విహార యాత్ర నిలిపివేశారు. గోదావరిపై విహారానికి పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో అధికారులు మళ్లీ అనుమతులు ఇచ్చారు.
పెట్రోల్ పోసుకుని యువకుడి హల్చల్
చీపురుపల్లి రూరల్ (గరివిడి): ఒంటిపై పెట్రోల్ పోసుకుంటూ ఓ యువకుడు విజయనగరం జిల్లా గరివిడి పోలీస్స్టేషన్ ఎదురుగా శుక్రవారం ఉదయం హల్చల్ చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. కాకినాడలోని జగన్నాథపురానికి చెందిన ఎండీ గౌస్ అదే ప్రాంతానికి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే, ఈ యువకుడి ప్రవర్తనతో విసిగిపోయిన భార్య తన ఏడేళ్ల పాప, తల్లిదండ్రులతో కలిసి కొద్ది రోజుల కిందట గరివిడి సమీపంలోని శివరాం గ్రామానికి వచ్చేసింది. భార్య ఉంటున్న చిరునామా తెలుసుకున్న గౌస్ ఆ గ్రామానికి వచ్చి తన ఏడేళ్ల పాపను తనకు అప్పగించాలని కుటుంబ సభ్యులను బెదిరించాడు. వారు పట్టించుకోకపోవడంతో గరివిడి పోలీస్స్టేషన్ ఎదురుగా ఒంటిపై పెట్రోల్ పోసుకుంటూ హల్చల్ చేసి, కొద్ది సేపటి తర్వాత వెళ్లిపోయాడు.


