కాకినాడ క్రైం: కాకినాడలోని ఏటిమొగ ప్రాంతంలో వేటకు బయలు దేరేందుకు సిద్ధమైన ఓ మెకానికల్ ఫైబర్ బోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం సంభవించింది. గురువారం సాయంత్రం పెమ్మాడి నాగేశ్వరరావుకు చెందిన ఈ బోటు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదానికి గురైందని అధికారులు అంచనా వేస్తున్నారు. సమాచారం అందుకోవడంతో డీఎఫ్ఓ కృపావరం ఆదేశాలతో ఏడీఎఫ్ఓ ఉద్దండురావు సుబ్బారావు, బృందం ఘటనా స్థలికి చేరుకుని ఫైర్ ఇంజిన్లు, ఇతర అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలు అదుపు చేశారు. సుమారు రూ.20 లక్షల ఆస్తి నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా వేసినట్లు సుబ్బారావు తెలిపారు.


