గోమాతను హింసించి చంపిన ఇద్దరికి రిమాండ్
ఆత్రేయపురం: వాడపల్లి గ్రామంలో గోమాతను హింసించి, చంపారనే ఆరోపణలపై అన్నవరపు వెంకన్న బాబు, చామకూర వెంకట రమణలకు కొత్తపేట జేఎఫ్‌సీఎం కోర్టు మంగళవారం 15 రోజుల రిమాండ్ విధించింది. దీంతో నిందితులిద్దరినీ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించినట్లు ఆత్రేయపురం ఎస్సై పి.రాము తెలిపారు. వాడపల్లి గ్రామానికి చెందిన ఆవు యజమాని గంధం కేశవరావు ఫిర్యాదు మేరకు ఆవు (గోమాత) మృతిపై సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వాడపల్లి గ్రామానికి చెందిన నిందితులిద్దరూ తన తన ఆవును హింసించి, చంపివేసినట్లు ఆయన ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, నిందితులను కొత్తపేట జేఎఫ్ సీఎం కోర్టుకు తరలించగా రిమాండ్ విధించారు.
చినవెంకన్నకు స్వర్ణ, రజత వస్తువుల సమర్పణ
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల చినవెంకన్నకు గుంటూరుకు చెందిన భక్తురాలు వెలగలేటి సత్యవతి మంగళవారం సుమారు రూ.11.63 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులను సమర్పించారు. వీటిని దివంగత వెలగలేటి దుర్గాదేవి జ్ఞాపకార్థం దాత కుటుంబ సభ్యులు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావుకు అందజేశారు. లక్ష్మీదేవి రూపులు, ముత్యాలు, ఎరుపు, తెలుపు, పచ్చ రాళ్లతో డిజైన్ చేసిన సుమారు రూ. 10.85 లక్షల విలువైన 72 గ్రాముల బరువు గల రెండు పేటల బంగారు లక్ష్మీదేవి మెట్ల హారంతో పాటు, అష్టలక్ష్ముల రూపాలతో సుమారు రూ. 78 వేలు వెచ్చించి తయారు చేయించిన 340 గ్రాముల బరువు గల నగిషీ వెండి చెంబును అందించారు. దాత కుటుంబ సభ్యులను ఈఓ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం వారికి ఆలయ మర్యాదలతో స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పించారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
కంకిపాడు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటనపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ తాతాచార్యులు తెలిపిన కథనం మేరకు... పి.గన్నవరానికి చెందిన సీహెచ్ రవికుమార్ (38) కొంతకాలంగా విజయవాడ కండ్రికలో ఉంటూ, ఆంధ్ర హాస్పిటల్‌లో పనిచేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం జోరు వర్షంలో కంకిపాడు నుంచి విజయవాడ వైపు వస్తుండగా కంకిపాడు బైపాస్‌పై జరిగిన ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తాతాచార్యులు తెలిపారు. ప్రమాదవశాత్తూ వాహనం అదుపు తప్పి కింద పడి మృతి చెందాడా, లేక ఏదైనా వాహనం ఢీకొనటంతో ప్రమాదం జరిగిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


