● వెంకన్న క్షేత్రం.. శోభాయమానం | - | Sakshi
Sakshi News home page

● వెంకన్న క్షేత్రం.. శోభాయమానం

Nov 3 2026 12:09 AM | Updated on Nov 3 2026 12:09 AM

● ఇంత నిర్లక్ష్యమా!

జాతీయ జెండాను చూడగానే దేశభక్తి ఉప్పొంగుతుంది. సాధారణ ప్రజలు కూడా ఎంతో గౌరవంగా దానికి వందనం చేస్తారు. కానీ గండేపల్లి మండల పరిషత్‌ కార్యాలయంపై ఏర్పాటు చేసిన జెండా పడిపోవడానికి సిద్ధంగా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఆ జెండాను అక్కడ ఎప్పుడు ఏర్పాటు చేశారో తెలియదు గానీ, ఇలా వంగిపోయి కనిపించడంతో కార్యాలయానికి వస్తున్న ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ జెండాపై అధికారులకు ఎందుకంత నిర్లక్ష్యమని ప్రశ్నిస్తున్నారు. – గండేపల్లి

● వలంటీర్‌ నుంచి

ఎంపీటీసీ అభ్యర్థి

నిడదవోలు మండలం కంసాలిపాలెం గ్రామానికి చెందిన ఉప్పాటి సురేంద్ర కుమార్‌ గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో వలంటీర్‌గా సేవలందించారు. ప్రతి గడపకూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించి, లబ్ధిదారులకు అందజేశారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. మన కష్ట సుఖాలు తెలిసిన సురేంద్ర..ఎంపీటీసీ అయితే మరింత బాగా పనిచేస్తాడని గ్రామస్తులు కితాబు ఇస్తున్నారు. గ్రామంలోని ప్రధాన సమస్యలను మండల పరిషత్‌ నిధులతో పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన చెబుతున్నారు.

– నిడదవోలు రూరల్‌

వాడపల్లి వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బ్రహ్మోత్సవాల పూజలు, స్వామివారి మహా సుదర్శన హోమం, తోమాల సేవ తదితర కార్యక్రమాల్లో దేవదాయశాఖ ఉప కమిషనర్‌ నల్లం సూర్య చక్రధరరావు దంపతులు పాల్గొని స్వామివారికి పువ్వులు, పట్టు వస్త్రాలు సమర్పించారు. టీటీడీ వేద పండితులు ఖండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు, ఆలయ కమిటీ సభ్యులు శిష్టా సూర్య కుటుంబరావు, అర్చకులు వాడపల్లి సుందర శేషావతారం పర్యవేక్షణలో అర్చకులు, వేద పండితులు పూజలు నిర్వహించారు. రాత్రి మలయప్ప అలంకరణలో స్వామివారి గరుడ వాహన సేవ, ఊరేగింపు వైభవంగా జరిగాయి. కార్యక్రమాల్లో ఆలయ కమిటీ సభ్యులు, సిబ్బంది, సేవా కార్యకర్తలు పాల్గొని భక్తులకు ఇబ్బందుల్లేకుండా పర్యవేక్షించారు. – ఆత్రేయపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement