రత్నగిరిపై భక్తులకు అన్ని వసతులు | - | Sakshi
Sakshi News home page

రత్నగిరిపై భక్తులకు అన్ని వసతులు

Nov 3 2026 12:09 AM | Updated on Nov 3 2026 12:09 AM

ఫ ఈవో సూర్యచక్రధరరావు

ఫ కార్తికంలో ఏర్పాట్లపై సిబ్బందితో సమీక్ష

అన్నవరం: కార్తికమాసం ఈ నెల పదో తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణస్వామి దేవస్థానానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు అన్నారు. అన్నవరంలో చేపట్టిన ఏర్పాట్ల పురోగతిపై సోమవారం ఆయన సమీక్షించారు. ఈ మేరకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా వాడపల్లి దేవస్థానంలో ఆయన అన్నవరం ఆలయ సిబ్బందితో సమావేశమయ్యారు. వాడపల్లి దేవస్థానం రెగ్యులర్‌ ఈఓగా, అన్నవరం ఇన్‌చార్జి ఈఓగా సూర్యచక్రధరరావు విధులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కార్తిక మాసం ఏర్పాట్లపై గతంలో పలుమార్లు సమావేశాలు ఏర్పాటు చేసి వివిధ విభాగాల వారీగా చేయాల్సిన పనులను సిబ్బందికి అప్పగించామని, వాటి అమలు తీరుపై ఈ సమీక్ష నిర్వహించామని ఈఓ తెలిపారు. ఒక వేళ సిబ్బంది ఎవరైనా ఆ పనులు చేయడంలో వెనుకబడితే రెండు, మూడు రోజుల్లో ఆ పనులు పూర్తి చేయాలని ఆదేశించామన్నారు.

పలు విమర్శలు!

ఈ సమీక్షా సమావేశం కోసం దేవస్థానంలోని వివిధ విభాగాలకు చెందిన 30 మంది సిబ్బంది అన్నవరం నుంచి దేవస్థానం బస్సులో వాడపల్లికి వెళ్లారు. సమీక్ష అనంతరం మరలా అదే బస్సులో తిరిగి వచ్చారు. కాగా.. అన్నవరం దేవస్థానం సిబ్బందితో వాడపల్లిలో సమీక్ష నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయాన్ని ఈఓ వద్ద ప్రస్తావించగా వాడపల్లి దేవస్థానంలో కల్యాణ మహోత్సవాలు జరుగుతున్నందున, వైదిక కార్యక్రమాలలో తాను పాల్గొనాల్సి ఉందన్నారు. అందువల్ల తనకు రావడానికి వీలులేక అన్న వరం సిబ్బందిని ఇక్కడకు రప్పించినట్టు తెలిపారు. వాడపల్లిలో చేసిన ఉత్సవ ఏర్పాట్లను అన్నవరం దేవస్థానం సిబ్బందికి చూపించేందుకు కూడా ఇక్కడకు రమ్మన్నానన్నారు. తొమ్మిదో తేదీ నుంచి తాను నెల రోజులు అన్నవరంలోనే ఉంటానని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement