సీతానగరం: కేరళలో ఇటీవల జరిగిన సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ఇనుగంటివారిపేటకు చెందిన యల్లామెల్లి రాజు కాంస్య పతకం గెలుచుకున్నాడు. 59 కిలోల విభాగంలో మొత్తం 485 కిలోల బరువు ఎత్తి ఈ ఘటన సాధించాడు. అతడిని రాజమహేంద్రవరానికి చెందిన కోచ్ డి.నారాయణ, జిమ్ నిర్వాహకులు వై.రవికుమార్, వై.శ్రీనివాస్ అభినందించారు.
సారా స్థావరాలపై దాడి
వీఆర్‌పురం: చొక్కనపల్లి గ్రామంలోని అటవీ ప్రాంతంలో ఉన్న సారా స్థావరాలపై సోమవారం దాడి చేసినట్టు ఎస్సై సాధిక్ తెలిపారు. ఈ సందర్భంగా 400 లీటర్ల బెల్లం ఊట, 20 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నామన్నారు.
వయసు చిన్న.. ప్రతిభ మిన్న..
బాలాజీచెరువు: కూచిపూడి నృత్యంలో ప్రతిభ చూపిన అవంతిక ఎలుమలై అనే 8 ఏళ్ల బాలిక ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. తలకిందులుగా ఉంచిన మట్టికుండపై నిలబడి రెండు చేతుల్లో వెలిగే దీపాలు పట్టుకుని వివిధ భంగిమల్లో 6.25 నిమిషాల పాటు కూచిపూడి నృత్య ప్రదర్శన చేసి అబ్బుర పరచింది. ఈ సందర్భంగా లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ డైరక్టర్ నల్లమిల్లి సుగుణరెడ్డి మాట్లాడుతూ తమ విద్యార్థి ఇంతటి ప్రతిభ చూపడం అభినందనీయమన్నారు. ఆ బాలికను పాఠశాల ప్రిన్సిపాల్ వందన బోహ్రా, సిబ్బంది అభినందించారు.
చిన వెంకన్న సాయంకాలార్చన సమయంలో మార్పు
ద్వారకాతిరుమల: వృశ్చిక సంక్రమణం (శీతాకాలం) నేపథ్యంలో చిన వెంకన్న సాయంకాలార్చన సమయాన్ని ఈ నెల 5వ తేదీ నుంచి మార్పు చేస్తున్నట్లు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు సోమవారం ప్రకటనలో తెలిపారు. సాధారణంగా ప్రతి రోజూ సాయంత్రం 5.30 నుంచి 7 గంటల వరకు శ్రీవారి సాయంకాలార్చనను నిర్వహిస్తామని, ఆ సమయాన్ని సాయంత్రం 5 నుంచి 6.30 గంటలకు మార్పు చేశామన్నారు. దీనికి అనుగుణంగా భక్తులకు స్వామివారి దర్శనం సాయంత్రం 6.30 గంటల నుంచి లభిస్తుందని, మేష సంక్రమణ వరకు ఈ సమయాలు కొనసాగుతాయని తెలిపారు.


