పెదపూడి: క్రీడలతో ఉన్నత భవిష్యత్తు ఉంటుందని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అండర్ – 19 బాలురు, బాలికల బాస్కెట్‌బాల్ క్రీడా ఎంపికల కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ గంగాధర్‌రెడ్డి అన్నారు. జి.మామిడాడ జెడ్పీ ఉన్నత పాఠశాల్లో ఆ విభాగంలో బాలురు, బాలికల జట్లను ఎంపిక చేశారు. గంగాధర్‌రెడ్డి మాట్లాడుతూ ఎంపికలకు సుమారు 75 మంది క్రీడాకారులు హాజరయ్యారన్నారు. వారిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 12 మంది బాలురు, 12 మంది బాలికలను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జట్లకు ఎంపిక చేశారన్నారు. వీరందరూ ఈ నెల 6న హిందూపురం సమీపంలోని లేపాక్షి గ్రామంలో జరిగే రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో బాలుర ఉన్నత పాఠశాల పీడీ నల్లమిల్లి అప్పారెడ్డి, జి.మామిడాడ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌరీ శంకర్‌రెడ్డి, కోశాధికారి ద్వారంపూడి యువరాజారెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు గంగిరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, వాసు మోహన్ వర్మ, సత్యనారాయణ, సునీత పాల్గొన్నారు.


