చేలల్లో నీళ్లు.. చెమ్మగిల్లిన కళ్లు | - | Sakshi
Sakshi News home page

చేలల్లో నీళ్లు.. చెమ్మగిల్లిన కళ్లు

Nov 2 2026 12:17 AM | Updated on Nov 2 2026 12:17 AM

తుపానుతో రైతన్న కళ్ల ముందే పంట నేలనంటింది.. నీటిలో నానుతూ దెబ్బతింటోంది.. పుడమి పుత్రుల కంట నీరు వస్తోంది.. పంటను కాపాడుకొందామంటే కూలీల కొరత వేధిస్తోంది.. యంత్రాలతో కోతలు కోద్దామంటే, చేలల్లోకి దిగే పరిస్థితి లేకుంది.. ఇలా అర్నబ్‌ రైతన్నలను కోలుకోలేని దెబ్బతీసింది.

సాక్షి, అమలాపురం: అర్నాబ్‌ తుపాన్‌ కోనసీమ జిల్లా రైతులను కోలుకోలేకుండా చేసింది. చివరిలో పంట చేతికొచ్చే కీలక సమయంలో విరుచుకుపడిన పెనుగాలులు, భారీ వర్షాలు 1.18 లక్షల ఎకరాల్లో వరి పంటను నీట ముంచాయి. చాలా ప్రాంతాల్లో వరి చేలు నేలనంటగా.. మరికొన్ని చోట్ల నీటిలోనే నానుతున్నాయి. ఇప్పటికే దిగుబడిపై ఆశలు వదులుకున్న రైతులు, కనీసం మిగిలిన పంటనైనా కాపాడుకోవాలని తంటాలు పడుతున్నారు. అయితే ప్రకృతి ప్రకోపం నుంచి బయటపడక ముందే కూలీల కొరత, పెరిగిన కోత ఖర్చులు, వాతావరణ ప్రతికూలతలు వారిని మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అసలు పంటను ఎలా ఒబ్బిడి చేసుకోవాలో తెలియక డెల్టా అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో విలవిల్లాడుతున్నారు.

కీలక సమయం.. అగమ్యగోచరం

జిల్లాలో వరి కోతలకు సిద్ధమైన సమయంలో తుపాన్‌ రావడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ముఖ్యంగా ఆలమూరు, కొత్తపేట వ్యవసాయ సబ్‌ డివిజన్ల పరిధిలో కోతకు వచ్చిన పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. పెనుగాలుల ధాటికి వరి చేలు నేలకొరిగాయి. పొలాల్లోకి భారీగా నీరు చేరడంతో పంట ముంపునకు గురైంది. నీటిలో ఎక్కువకాలం ఉండటం వల్ల ధాన్యం మొలకెత్తడం, కంకులు కుళ్లిపోవడం వంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అడపాదడపా కురుస్తున్న వర్షాలు ఈ పరిస్థితిని మరింత జటిలం చేస్తున్నాయి.

కూలీల కోసం వెతుకులాట

పంటను కాపాడుకునేందుకు రైతులు సిద్ధమైనా వారికి అవసరమైన కూలీలు అందుబాటులో లేరు. తుపాను ప్రభావంతో అనేక గ్రామాల్లో కూలీల ఇళ్లు దెబ్బతిన్నాయి. విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ కాకపోవడం, నిత్యావసర వస్తువుల కొరత, ఇళ్ల వద్ద నెలకొన్న ఇబ్బందులతో చాలామంది కూలీలు వ్యవసాయ పనులకు వెళ్లలేని పరిస్థితి ఉంది. దీంతో కోతలు ప్రారంభించేందుకు రైతులు కూలీల కోసం వెతుకులాడుతున్నారు. ఒకవైపు నీటిలో నానుతున్న పంటను వీలైనంత త్వరగా ఒబ్బిడి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు కూలీలు దొరకని పరిస్థితి వారిని ఆందోళనకు గురిచేస్తోంది. ఒకేసారి వేలాది ఎకరాల్లో కోతలు ప్రారంభమైతే కూలీల కొరత మరింత తీవ్రం కానుంది.

ఈ ఏడాది ఖరీఫ్‌లో దిగుబడి కొంత తగ్గినా ధాన్యానికి మంచి ధర లభిస్తుందని రైతులు ఆశించారు. ఎల్‌నినో ప్రభావంతో గోదావరి డెల్టాలో తప్ప ఇతర ప్రాంతాల్లో వరి సాగు విస్తీర్ణం తగ్గడం, మార్కెట్‌లో ధాన్యానికి డిమాండ్‌ పెరుగుతుందన్న అంచనాలతో మద్దతు ధర కంటే బస్తాకు కనీసం రూ.500 అదనంగా లభిస్తుందని భావించారు. అయితే అర్నాబ్‌ తుపాను వారి ఆశలపై నీళ్లు చల్లింది. ప్రస్తుతం పడిపోయిన పంటను కూలీలతో కోయించి, నూర్పిడి చేసి ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకోవాలంటే ఎకరాకు సుమారు రూ.15 వేల వరకు ఖర్చవుతుందని రైతులు చెబుతున్నారు.

పడరాని పాట్లు..

సాధారణంగా నిలువుగా ఉన్న వరి పంటను యంత్రాలతో సులువుగా కోయవచ్చు. కానీ నేలనంటిన చేలల్లోకి హార్వెస్టర్లు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో కూలీలతోనే కోతలు కోయించాల్సి వస్తోంది. పడిపోయిన వరి చేలను ఒక్కొక్కటిగా పైకి లేపి పనలుగా కట్టి, అనంతరం నూర్పిడి చేయడం శ్రమతో కూడుకున్న పని. దీనికి సాధారణం కంటే ఎక్కువ సమయం, ఎక్కువ మంది కూలీలు అవసరమవుతున్నారు. పంట దెబ్బతిన్నదని తెలిసినా.. చేతికొచ్చిన దానిని వదులుకోలేక రైతులు పడరాని పాట్లు పడుతున్నారు.

అర్నబ్‌ తెచ్చిన తంటా!

రైతన్నలకు చి‘వరి’లో కష్టాలు

1.18 లక్షల ఎకరాల్లో నీట మునిగిన పంట

కాపాడుకొందామంటే

అందుబాటులో లేని కూలీలు

అడపాదడపా వర్షాలతో మరింత ముంపు

కోతలు, నూర్పిడికి ఎకరాకు

రూ.15 వేల ఖర్చు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement