వైఎస్సార్‌ సీపీతోనే సంక్షేమ పాలన | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీతోనే సంక్షేమ పాలన

Nov 2 2026 12:17 AM | Updated on Nov 2 2026 12:17 AM

రంపచోడవరం: రంపచోడవరం నియోజకవర్గంలోని వైఎస్సార్‌ సీపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే, పార్టీ రంపచోడవరం నియోజకవర్గం కోఆర్డినేటర్‌ నాగులపల్లి ధనలక్ష్మి, పార్టీ రాష్ట్ర నాయకురాలు శ్యామల కోరారు. రంపచోడవరం మండలం ఐ పోలవరంలో ఎన్నికల ప్రచారం ఆదివారం నిర్వహించారు. రంపచోడవరం జెడ్పీటీసీ అభ్యర్థి పండా రామకృష్ణదొర, రంప ఎంపీటీసీ అభ్యర్థి కొమరం బీమన్నదొరను గెలిపించాలని కోరారు. సంక్షేమ పాలన వైఎస్సార్‌ సీపీతోనే సాధ్యమన్నారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దక్కుతుందన్నారు. ప్రచారంలో పార్టీ మండల కన్వీనర్‌ జల్లేపల్లి రామన్నదొర, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అక్రమంగా తరలిస్తున్న ఆవుల పట్టివేత

మోతుగూడెం: చింతూరు మండలం లక్కవరం జంక్షన్‌ వద్ద మోతుగూడెం ఎస్సై అబ్దుల్‌ నాసిర్‌ హుస్సేన్‌ తన సిబ్బందితో ఆదివారం వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో, ఒడిశా రాష్ట్రం నుంచి హైదరాబాద్‌కు కంటైనర్‌లో అక్రమంగా తరలిస్తున్న 26 ఆవులను గుర్తించి పట్టుకున్నారు. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించిన ఇద్దరిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆవులను ఒడిశాలో కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు వెల్లడైంది. ఈ అక్రమ రవాణాలో మరో ఇద్దరి ప్రమేయం ఉన్నట్లు గుర్తించగా, వారు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. కంటైనర్‌తో పాటు 26 ఆవులను స్వాధీనం చేసుకుని, సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ ఆవులను సురక్షితంగా గోశాలకు తరలించి, వాటి సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకున్నారు.

దహన సంస్కారానికి వెళ్లి.. కాలువలో పడి వ్యక్తి మృతి

కొత్తపేట: దహన సంస్కారాలకు వెళ్లి స్నానం చేస్తూ ప్రమాదవశాత్తూ కాలువలో పడిన వ్యక్తి మృతి చెందాడు. కొత్తపేట ఎస్సై జి.సురేంద్ర కథనం ప్రకారం.. మండలంలోని మోడేకుర్రు శివారు గొలకోటివారి పాలెం గ్రామానికి చెందిన గోలకోటి సీతారామ్‌ (57) శనివారం గ్రామంలో ఒకరు చనిపోతే దహన సంస్కారానికి వెళ్లి వచ్చి, గొలకోటివారిపాలెం వద్ద పాంచాలరేవులో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తూ కాలుజారి గల్లంతయ్యాడు. ఆదివారం ఉదయం అతని కోసం గాలిస్తుండగా, పడిపోయిన చోటుకు సమీపంలోనే శవమై తేలినట్లు ఎస్సై సురేంద్ర తెలిపారు. దీనిపై మృతుడి సోదరుడు గోలకోటి వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

చర్చికి వెళ్లి తిరిగి రాని యువతి

రంగంపేట: ఓ యువతి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఆ యువతి తల్లి ఆదివారం రంగంపేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ వివరాల ప్రకారం.. ముకుందవరం గ్రామానికి చెందిన యువతి (25) అక్టోబర్‌ 30న రాత్రి చర్చికి వెళ్లింది. అప్పటి నుంచి ఆమె కనిపించకుండా పోయింది. ఆ యువతి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గ్రామాలతో పాటు బంధువుల ఇళ్లలోనూ వెతికారు. అయినప్పటికీ ఫలితం లేక పోలీసులను ఆశ్రయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement