మరమ్మతుల మాయ | - | Sakshi
Sakshi News home page

మరమ్మతుల మాయ

Nov 1 2026 12:09 AM | Updated on Nov 1 2026 12:09 AM

● బీచ్‌ రోడ్డు నిర్మాణంలో నాణ్యతా లోపం

● అర్నబ్‌ తుపానుకు కొట్టుకుపోయిన సిమెంట్‌ రోడ్డు

● మరమ్మతుల పేరుతో నిధుల స్వాహా?

ఉప్పాడ శివారు పల్లెపేట వద్ద రూ.80 లక్షల వ్యయంతో ఇటీవల 20 మీటర్ల పొడవైన సిమెంట్‌ రోడ్డు నిర్మించారు. ప్రారంభించి నెల రోజులు కూడా కాకముందే వచ్చిన అర్నబ్‌ తుపానుకు ఆ రోడ్డు ముక్కలుగా విరిగిపోయింది. దీన్ని బట్టి నిర్మాణంలో నాణ్యత ఎంత బాగుందో అర్థమవుతుంది. ఉప్పాడ నుంచి కాకినాడ వరకు ఉన్న బీచ్‌ రోడ్డు అధికార పార్టీ నేతలకు కల్పతరువుగా మారిపోయింది. రోడ్డు పేరు చెప్పి నాలుగు రాళ్లు వెనుకేసుకుంటున్నారు.

పిఠాపురం: కాకినాడ – ఉప్పాడ బీచ్‌ రోడ్డు చూస్తుంటే మనసు తరుక్కుపోయింది. మనం చాలా కష్టపడి ఎఫర్ట్‌ పెట్టి రోడ్డు వేశాం. రూ.72 నుంచి రూ.80 కోట్ల ఖర్చుతో వేశాం’ అని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అధికారులతో నిర్వహించిన సమీక్షలో చెప్పిన మాటలు సోషల్‌ మీడియాలో ట్రోల్‌ అవుతున్నాయి. వాస్తవానికి ఉప్పాడ శివారు పల్లిపేట వద్ద రూ.80 లక్షల వరకు ఖర్చు చేసి సిమెంటు రోడ్డు నిర్మించారు తప్ప.. గత మూడేళ్లలో ఎక్కడా రూ.80 కోట్లు ఖర్చుతో రోడ్డు వేయలేదని స్థానికులు చెబుతున్నారు. బీచ్‌ రోడ్డు గతంలో వేసిందే కేవలం మరమ్మతులు చేయిస్తుంటారు. ఉప్పాడ శివారు పల్లిపేట వద్ద రూ.80 లక్షల వరకు ఖర్చు చేసి సిమెంటు రోడ్డు నిర్మించారు తప్ప గత మూడేళ్లలో ఎక్కడా రూ.80 కోట్లు ఖర్చు చేసి ఉప్పాడ బీచ్‌ రోడ్డు నిర్మించలేదు.

ప్రతి తుపానుకూ ఇంతే..

తుపానంటే తీరప్రాంతం గజగజ వణికిపోతుంది. మత్స్యకారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కాలం గడుపుతారు. కానీ ఆర్‌అండ్‌బీ అధికారులకు, ప్రజాప్రతినిధులకు మాత్రం పండుగ వచ్చినట్టే. తుపాను వచ్చి రోడ్డు కొట్టుకుపోవడం, మరమ్మతుల పేరుతో కోట్లు కుమ్మరించడం, అందినంతా దోచుకోవడం పరిపాటిగా మారింది. ఎన్నిసార్లు కోతకు గురైనా మళ్లీమళ్లీ అక్కడే రక్షణ పేరుతో రాళ్లు వేస్తూ నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నారు. ప్రతి తుపానుకు రోడ్డు ధ్వంసమైతే కొత్తగా మరమ్మతులు మాత్రం చేయిస్తుంటారు.

కోత బారిన..

1980లో నిర్మించిన ఈ బీచ్‌ రోడ్డు అనేక పర్యాయాలు తుపానుల వల్ల కోతకు గురవుతూ వచ్చింది. తుని నుంచి కాకినాడ వరకు ఉన్న బీచ్‌ రోడ్డులో ఉప్పాడ నుంచి కాకినాడ వైపు సుమారు 5 కిలోమీటర్ల మేర సముద్రానికి అతి దగ్గరగా ఉండి తుపాను వచ్చినప్పుడల్లా కోతకు గురవుతూ ఉంటుంది. కాకినాడ నుంచి తుని వరకు ఉన్న తీర ప్రాంతంలో సుమారు 25 గ్రామాల ప్రజలకు ప్రధానమైన రహదారిగా ఉండడం వల్ల ఈ రోడ్డుపై వాహనాల రాకపోకలు పెరిగాయి. తుపాను వచ్చినప్పుడు రోడ్డు కోతకు గురవ్వడం, రాకపోకలు నిలిపివేయడం, వెంటనే కోట్ల నిధులు మంజూరు చేయడం, రాళ్లు తెచ్చి కోతకు గురైన ప్రాంతాల్లో వేయడం పరిపాటిగా మరిపోయిందే తప్ప శాశ్వత పరిష్కారం వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. కేవలం రాళ్లు వేసి ఒకదానిపై ఒకటి గోడగా పేర్చడం తప్ప పటిష్టమైన పని ఇప్పటికీ చేయలేకపోయారు. అందువల్ల బలమైన కెరటం వస్తేచాలు గోడ పేకమేడలా కూలిపోతోంది. రక్షణగా వేసిన రాళ్లే రోడ్డును ముక్కలు చేస్తున్నాయి. సముద్రపు కోతకు గురయ్యే ప్రాంతంలో పటిష్టంగా వేయాల్సిన తారురోడ్డు సైతం వేసిన నెలలకే ముక్కలైపోయింది. ఇటీవల తుపాను ప్రభావంతో మళ్లీ రోడ్డు పూర్తిగా ముక్కలవ్వడంతో మరోసారి నిధుల విడుదలకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement