ఆత్రేయపురం: వాడపల్లిలోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా మూడో రోజు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను కోదండ రామ అలంకరణలో హనుమద్ వాహనంపై మాడవీధుల్లో ఊరేగించారు. దేవదాయశాఖ ఉప కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు, ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు తదితరులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించా రు. టీటీడీ వేద పండితులు ఖండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు, ఆలయ కమిటీ సభ్యు లు శిష్టా సూర్య కుటుంబరావు, అర్చకులు వాడపల్లి సుందర శేషావతారం పర్యవేక్షణలో ఆలయ అర్చకులు, వేద పండితులు పూజలు జరిపారు. ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలిచ్చారు. తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణంలో రద్దీ ఏర్పడింది.
7 వరకు నన్నయ
విద్యార్థులకు సెలవులు
రాజానగరం: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఆదికవి నన్నయ యూనివర్సిటీ క్యాంపస్ విద్యార్థులకు సోమవారం నుంచి నవంబర్ 7 వరకు సెలవులు ప్రకటించారు. ఎన్నికల నిర్వహణ సంబంధిత కార్యక్రమాలకు యూనివర్సిటీ క్యాంపస్‌ను వినియోగిస్తున్న నేపథ్యంలో ఈ సెలవులు అనివార్యమయ్యాయని ఇన్‌చార్జి రిజిస్ట్రార్ ఆచార్య కేఎస్ రమేష్ శనివారం తెలిపారు. ఈ సమయంలో విద్యార్థులకు బోధనా కార్యక్రమాలకు ఆటకం కలుగకుండా ఆన్‌లైన్ తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే ఎన్నికల కారణంగా నో మ్యాన్ జోన్‌గా యూనివర్సిటీ క్యాంపస్ ఉన్నందున నవంబర్ 7 వరకు సర్టిఫికెట్లు తదితర వాటి కోసం ఇతర ప్రాంతాల నుంచి విద్యార్థులు, వారి సహాయకులు రావొద్దని విజ్ఞప్తి చేశారు.
పంచాయతీ
రిజర్వేషన్లను సరిచేయాలి
తాళ్లపూడి: మండలంలో పంచాయతీ రిజర్వేషన్లను సరిచేయాలని అధికారులను హైకోర్టు ఆదేశించిందని తాళ్లపూడికి చెందిన నామన సత్యనారాయణ (బుజ్జి) అన్నారు. మండలంలో మొదటి విడతలో జరగనున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రొఫార్మా1లో పేర్కొన్న రిజర్వేషన్ల ప్రకటనలో బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ మేరకు శనివారం మాట్లాడుతూ తాళ్లపూడి మండలంలో 11 పంచాయతీలకు సిద్ధం చేసిన రిజర్వేషన్లు బీసీ ఓటర్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకోకుండా తయారు చేశారని న్యాయవాది కె.జ్యోతి ప్రసాద్ కోర్టులో తమ వాదనలు వినిపించారన్నారు. దీనిపై హైకోర్టు స్పందించి ఫిర్యాదును పరిష్కరించాలని ఆర్డీవోను ఆదేశిందని తెలిపారు. కాగా.. పంచాయతీ రిజర్వేషన్లపై తాళ్లపూడి నుంచి వైఎస్సార్ సీపీ నాయకులు గతంలో ఆర్‌వో, ఎంపీడీఓలకు ఫిర్యాదు చేశారు.


