దోచుకున్నారు.. దొరికిపోయారు | - | Sakshi
Sakshi News home page

దోచుకున్నారు.. దొరికిపోయారు

Oct 31 2026 12:07 AM | Updated on Oct 31 2026 12:07 AM

● మహిళ ఇంట్లో లూటీ కేసులో

నలుగురి అరెస్ట్‌

● రూ.40 విలువైన

బంగారు ఆభరణాల స్వాధీనం

నిడదవోలు: ఒంటరిగా నివసిస్తున్న ఓ మహిళపై అగంతకులు దాడి చేశారు.. ఆ ఇంట్లో ఉన్న బంగారు, వెండి ఆభరణాలు దోచుకున్నారు.. చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. దీనిపై శుక్రవారం నిడదవోలు సీఐ కార్యాలయంలో కొవ్వూరు డీఎస్పీ జి.దేవకుమార్‌ విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఆయన వివరాల ప్రకారం.. పెరవలి గ్రామానికి చెందిన గుడివాడ సత్యశ్రీ భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటోంది. ఈమెకు ఇద్దరు కుమార్తెలు ఉద్యోగ రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారు. ఇదిలా ఉంటే పెనుమంట్ర మండలం పెనుమంట్ర గ్రామానికి చెందిన స్నేహితులు జక్కంశెట్టి నాగరాజు, కడలి వెంకటరమణలు వ్యసనాలకు బానిసలై దొంగతనాలకు అలవాటు పడ్డారు. వీరికి పెరవలి గ్రామానికి చెందిన కుక్కల సాయిబాబు పేకాటలో పరిచమయ్యాడు. ఆ ముగ్గురూ పేకాటలో డబ్బులు పొగొట్టుకున్నారు. దీంతో దొంగతనం చేయాలని జక్కంశెట్టి నాగరాజు, కుక్కల సాయిబాబు అనుకున్నారు. పెరవలి గ్రామంలో గుడివాడ సత్యశ్రీ ఒంటరిగా ఉంటూ తాకట్టు వ్యాపారం చేస్తుందని తెలుసుకున్నారు. ఆమె ఇంట్లో చోరీకి ప్రణాళిక రచించారు. ఈ నెల 6న జక్కంశెట్టి నాగరాజు, కడలి వెంకటరమణ కలసి అరటి తోట వెనుక నుంచి సత్యశ్రీ ఇంట్లోకి ప్రవేశించారు. బాధితురాలు గుడివాడ సత్యశ్రీని బలంగా తలపై కొట్టారు. ఆమె మెడలో ఉన్న బంగారు ఆభరణాలు, బీరువాలోని బంగారు వస్తువులు, తాకట్టుకు వచ్చిన బంగారం, వెండి వస్తువులను అపహరించారు. ఈ మేరకు శుక్రవారం నిందితులు జక్కంశెట్టి నాగరాజుతో పాటు అతని భార్య జక్కంశెట్టి మల్లేశ్వరి, కడలి వెంకటరమణ, కుక్కల సాయిబాబులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి రూ.40 లక్షల విలువైన 357 గ్రాముల బంగారం, 2029 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నామని కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్‌ వెల్లడించారు. ఈ కేసును చాకచక్యంగా చేధించిన నిడదవోలు సీఐ పీవీజీ తిలక్‌, పెరవలి ఎప్‌సై యామన సుధాకర్‌, సీసీఎస్‌ ఎస్సై రవీంద్రలను జిల్లా ఎస్పీ డి.నరసింహకిషోర్‌ అభినందిస్తూ రివార్డులు ప్రకటించినట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement