అర్నాబ్ తుపాను జిల్లా ప్రజలను వణికించింది. భారీ ఈదురు గాలులకు తోడు తెరిపివ్వని వర్షంతో జనం అవస్థల పాలయ్యారు. మంగళవారం రాత్రి నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బలమైన ఈదురుగాలులు, ఎడతెరిపి లేని వర్షంతో జనజీవనం అస్తవ్యస్తమైంది.
సాక్షి, రాజమహేంద్రవరం: రెండు రోజులుగా కురు స్తున్న భారీ వర్షం, వీస్తున్న ఈదురుగాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు, మొక్కలు నేలకూలగా, విద్యుత్ స్తంభాలు ఒరిగిపోయాయి. రోడ్లపై చెట్లు పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు త్వరగా స్పందించి కూలిన చెట్లను తొలగించి, ఒరిగిన స్తంభాలను సరిచేశారు. దీంతో రహదారులపై రాకపోకలు సజావుగా సాగాయి.
నిలిచిన విద్యుత్ సరఫరా
తుపాను ప్రభావంతో జిల్లాలోని అన్ని మండలాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో మంగళవారం రాత్రి నుంచే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొవ్వూరు, మండపేట, నిడదవోలు పట్టణాలతో పాటు రాజమహేంద్రవరం నగరంలోనూ విద్యుత్ సరఫరాను తరచూ నిలిపివేయడం, పునరుద్ధరించడం వంటి పరిస్థితులు నెలకొన్నాయి. రాత్రంతా కురిసిన వర్షం, బలమైన గాలులతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. బుధవారం కూడా వర్షాలు కొనసాగడంతో ఇబ్బందులు మరింత పెరిగాయి. బుధవారం సాయంత్రం వరకూ పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేక ప్రజలు అవస్థలు పడ్డారు. విద్యుత్ తీగలు, స్తంభాలపై ఎక్కడికక్కడ భారీ చెట్లు పడిపోవడంతో సరఫరా నిలిచిపోయింది. మరోవైపు తాగునీరు, నిత్యావసరాల వినియోగం నుంచి ఇంటి పనుల వరకు విద్యుత్‌పై ఆధారపడడంతో ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.
సీతానగరం: నాగంపల్లిలో నేలకొరిగిన వరి పంట
అనపర్తి: ఈదురుగాలికి రోడ్డుపై కూలిన కొబ్బరి చెట్టు
రాజానగరం: రోడ్డుపై పడిన విద్యుత్ స్తంభం
దేవరపల్లి: మిరప చేనులో చేరిన నీరు
సోమేశ్వరం – రాజానగరం రోడ్డుపై కూలిన వృక్షం
పేదల ఉపాధిపై తుపాను దెబ్బ
తుపాను ప్రభావంతో చిరు వ్యాపారులు, రోజువారీ కూలీల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడింది. వర్షం, గాలుల కారణంగా రోడ్లపై జనసంచారం తగ్గడంతో పువ్వులు, పండ్లు విక్రయించే చిన్న వ్యాపారులు అమ్మకాలు లేక ఇబ్బందులు పడ్డారు. రోజు వారీ పనులపై ఆధారపడే కూలీలకు పనులు దొరకని పరిస్థితి ఏర్పడింది. రోజంతా కష్ట పడితేనే కుటుంబాన్ని పోషించుకునే తమకు తుపాను రూపంలో మరో కష్టం ఎదురైందని వారు వాపోతున్నారు. ఒకవైపు పంట నష్టం.. మరోవైపు విద్యుత్ అంతరాయాలు.. ఇంకోవైపు ఉపాధి కోల్పోయిన చిరు వ్యాపారులు, కూలీల కష్టాలతో అర్నాబ్ తుపాను జిల్లా వాసులను అతలాకుతలం చేసింది. దెబ్బతిన్న పంటలకు తక్షణ నష్టం అంచనా, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ, బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందించడంపై అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.


