చింతూరు: ఏలూరు జిల్లా నుంచి గోదావరి దాటిన పులి తిరిగి పోలవరం జిల్లాలోకి అడుగుపెట్టి చింతూరు డివిజన్‌లో సంచరిస్తోంది. మంగళవారం అర్థరాత్రి స్థానిక అటవీ రేంజ్ పరిధిలో గల చింతూరు, వీఆర్ పురం మండలాల సరిహద్దుల్లోని గుల్లేటివాడలో రెండు ఎద్దులపై దాడిచేసింది. ఈ దాడిలో ఒక ఎద్దు మృతి చెందగా మరో ఎద్దు తీవ్రంగా గాయపడింది. విషయం తెలుసుకున్న అటవీ సిబ్బంది గ్రామానికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతి చెందిన ఎద్దుతో పాటు పులి జాడలను వారు కనుగొన్నారు. రెండు రోజులుగా ఈ ప్రాంతంలో పులి సంచరిస్తోందని, వర్షం కురవడంతో పులి అడుగులు స్పష్టంగా కానరాలేదని చింతూరు ఇన్‌చార్జి రేంజర్ నానాజీ తెలిపారు. పులికి అమర్చిన ట్రాకర్ కూడా అప్పుడప్పుడు పనిచేస్తుండడంతో పులి ఎక్కడ ఉందనేది స్పష్టమైన ఆధారాలు దొరకడం లేదని తెలిపారు. కాగా గుల్లేటివాడలో పశువులపై దాడిచేసిన అనంతరం పులి చింతూరు మండలం చదలవాడ, ఏరువాడ ప్రాంతాల వైపు వెళ్లినట్లు రేంజర్ తెలిపారు. పులి సంచరిస్తున్న ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా వుండాలని రాత్రి సమయంలో ఎవరూ బయట సంచరించవద్దని, పశువులకు రక్షణ ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన సూచించారు.
రెండు ఎద్దులపై దాడి, ఒకటి మృతి


