ప్రయాణికుల పడిగాపులు | - | Sakshi
Sakshi News home page

ప్రయాణికుల పడిగాపులు

Sep 1 2026 12:19 AM | Updated on Sep 1 2026 12:19 AM

రాజమహేంద్రవరం సిటీ: జిల్లా కేంద్రం రాజమహేంద్రవరంలో రైళ్ల రాకపోకల్లో తీవ్ర జాప్యం నెలకొనడంలో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. కూర్చునేందుకు సైతం బెంచీలు లేక వృద్ధులు, చిన్నారులు, మహిళలు అవస్థలు ఎదుర్కొన్నారు. సోమవారం సింహాచలం నుంచి కొండపల్లి బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్స్‌ రైలు కొవ్వూరు రైల్వే స్టేషన్‌ సమీపంలో పట్టాలు తప్పింది. దీంతో జిల్లా మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. గంటలకొద్దీ ఆలస్యం కావడంతో ప్రయాణికులు రైళ్ల రాక కోసం ఎదురుతెన్నులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. రైల్వే స్టేషన్‌లో కూర్చునేందుకు సైతం బెంచీలు లేక ప్లాట్‌ఫామ్‌ నేలపై, ఫుట్‌వే బ్రిడ్జి మెట్లపై కూర్చోవాల్సిన దుస్థితి నెలకొంది. ప్రధానంగా విజయవాడ నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌, బొకారో ఎక్స్‌ప్రెస్‌, స్వర్ణ జయంతి, తిరుపతి– కాకినాడ సికింద్రాబాద్‌ – అనకాపల్లి, కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లు మూడు గంటల నుంచి నాలుగు గంటలు ఆలస్యంగా నడిచాయి. విజయవాడ వైపు వెళ్లే సంత్రాగచ్చి– తిరుపతి, కోరమండల్‌, ఈస్ట్‌ కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు 3 గంటల నుంచి 6 గంటల ఆలస్యమైంది. విజయవాడ వైపు వెళ్లాల్సిన ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ (12703) పదిన్నర గంటలు ఆలస్యంగా నడిచింది. గూడ్స్‌ వ్యాగన్‌ పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకల్లో ఆలస్యం ఏర్పడడంతో రైల్వే శాఖ అధికారులు తక్షణమే స్పందించి ప్రయాణికులకు సమాచారం అందించేందుకు ప్రధాన రైల్వే స్టేషన్‌లో డెస్క్‌ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు రైల్వే సీటీ సుంకర చంద్రమౌళి తెలిపారు.

బెంచీలు కూడా లేక..

రైళ్లు తీవ్ర ఆలస్యం కావడంతో ఇబ్బంది పడ్డాం. స్టేషన్‌ లో కూర్చునేందుకు సైతం బెంచీలు లేవు. సరైన సమ యానికి రైళ్లు రాకపోవడంతో సమయానికి గమ్యం చేరలేకపోతున్నాం. షెడ్యూల్‌ టైం ప్రకారం స్టేషన్‌కు వచ్చినా రైలు కోసం ఎదురు తెన్నులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

–ప్రసన్న, ప్రయాణికురాలు, రాజమహేంద్రవరం

సరైన సమాచారం ఇవ్వలేదు

రైలు గంటలకొద్దీ ఆలస్యమైనప్పటికీ రైల్వే శాఖ హెచ్చరికలు చేయడం సక్రమంగా లేదు. రైలు ఆలస్యాన్ని సరిగా ప్రకటించకపోవడం దారుణం. రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ నాలుగు గంటలు ఆలస్యమైనప్పటికీ 15 నిమిషాల్లో వచ్చేస్తుందంటూ సమాచారం ఇవ్వడం సరికాదు. దీనివల్ల ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు.

–లక్ష్మి, ప్రయాణికురాలు

ఫ కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్‌

ఫ ఆలస్యంగా నడిచిన పలు రైళ్లు

ఫ రాజమహేంద్రవరంలో

ప్రయాణికులకు కష్టాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement