దేవరపల్లి: విధి నిర్వహణలో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్‌పై గుర్తు తెలియని ముగ్గురు దుండగులు కత్తితో దాడి చేసిన సంఘటన దేవరపల్లి మండలం యర్నగూడెంలో 16వ జాతీయ రహదారిపై జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. హైవే పెట్రోలింగ్ వాహనంలో ఇద్దరు కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం తెల్లవారు జామున యర్నగూడెం గ్రామ శివారులోని కనకదుర్గమ్మ ఆలయం సమీపంలో ఫ్‌లైఓవర్‌పై రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ విషయం తెలుసుకున్న హైవే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడకు సమీపంలోని బస్ షెల్టర్‌లో నలుగురు అనుమానాస్పదంగా ఉన్నారు. విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ వేముల వెంకటేశ్వరరావు వారి వద్దకు వెళ్లి వివరాలు అడిగే ప్రయత్నం చేయగా, వారిలో ఇద్దరు పారిపోయారు. మరో ఇద్దరు చాకుతో కానిస్టేబుల్ వెంకటేశ్వరరావును పొట్ట భాగంలో పొడిచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వరరావును అక్కడి నుంచి తొలుత దేవరపల్లిలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కానిస్టేబుల్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. వెంకటేశ్వరరావు స్వగ్రామం దేవరపల్లి మండలం బందపురం. దుండగుల కోసం ఎనిమిది బృందాలను ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలిస్తున్నామని, త్వరలో పట్టుకుంటామని సీఐ బి.నాగేశ్వర్ నాయక్ తెలిపారు. రాజమహేంద్రవరంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకటేశ్వరరావును జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆయన సూచించారు.
ఫ కత్తితో పొడిచి పరారైన దుండగులు
ఫ వారి కోసం పోలీసుల గాలింపు


