జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా డాక్టర్ కెనడీ
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా జీఎంసీ న్యూరో సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ రాజశేఖర్ కెనడీని నియమించారు. ఇప్పటి వరకూ పనిచేసిన పీవీవీ సత్యనారాయణను ఆకస్మికంగా తొలగించారు. గత ఏడాది నవంబర్ 3న జీఎంసీ రాజమహేంద్రవరం జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ కం హెచ్‌వోడీగా పనిచేస్తున్న డాక్టర్ పీవీవీ సత్యనారాయణను సూపరింటెండెంట్‌గా నియమించారు. నాటి నుంచి రాజమహేంద్రవరం జీజీహెచ్ అనేక వివాదాలకు కేంద్రబిందువుగా నిలిచింది. నర్సింగ్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్, అక్రమ వసూళ్ల వ్యవహారంపై ప్రభుత్వం ఈ నెల 27న విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఈలోపే డాక్టర్ పీవీవీ సత్యనారాయణను తొలగిస్తూ ఉత్తర్వులు వెలువడడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
1న ‘అంబేడ్కర్
గురుకులం’ ప్రవేశ పరీక్ష
రాజమహేంద్రవరం రూరల్: ధవళేశ్వరం (బొమ్మూరు)లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులం (బాలికలు)లో ఐదో తరగతి, ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో చేరడానికి ప్రవేశ పరీక్షను మార్చి 1వ తేదీన నిర్వహించనున్నారు. ప్రిన్సిపాల్ అన్నం వాణీకుమారి బుధవారం ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఆ రోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు ఐదో తరగతి, మధ్యాహ్నం 12 నుంచి 1.30 వరకు జూనియర్ ఇంటర్ (జనరల్), మధ్యాహ్నం 3 నుంచి 4.30 వరకు జూనియర్ ఇంటర్ (ఐఐటీ, నీట్) ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు. 6, 7, 8, 9, 10 తరగతులలో బ్యాక్‌లాగ్ ఖాళీలకు మార్చి 2న జరగాల్సిన పరీక్షను మార్చి 8వ తేదీకి మార్పు చేసినట్టు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ సకాలంలో హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని, ఆధార్‌కార్డు జిరాక్స్, ఒక పాస్‌పోర్టు సైజ్ ఫొటో తీసుకుని పరీక్షకు హాజరు కావాలని కోరారు.
ఆలయానికి రూ.లక్ష విరాళం
దేవరపల్లి: మండలంలోని గౌరీపట్నంలో వేంచేసిన గౌరీ సమేత మహాలింగేశ్వరస్వామి దేవస్థానానికి చాగల్లు మండలం బ్రాహ్మణగూడెంకు చెందిన ఆత్కూరి వెంకటకృష్ణ దంపతులు రూ.లక్ష విరాళంగా అందజేశారు. వారిని ఆలయ కమిటీ సభ్యులు సత్కరించారు.
లండన్‌లో పెద్దాపురం
యువకుడి సజీవ దహనం
కాకినాడ క్రైం/సామర్లకోట: ఇంగ్లండ్ దేశ రాజధాని లండన్‌లో కాకినాడ జిల్లాకు చెందిన ఓ యువకుడు సజీవ దహనమై ప్రాణాలు కోల్పోయాడు. లండన్ ఫైర్ బ్రిగేడ్, మెట్రోపాలిటన్ పోలీసుల కథనం మేరకు, పెద్దాపురానికి చెందిన గొంతి అభిషేక్(26) ఏ232 క్రోయిడాన్ ఫ్లైఓవర్ పక్కనే ఉన్న ఓ రెండు అంతస్తుల భవనంలో వాటిల్లిన అగ్ని ప్రమాదంలో మరణించాడు. ఈ ప్రమాదం ఈ నెల 23 తెల్లవారుజామున 1.30 సమయంలో, భారత కాలమానం ప్రకారం ఉదయం 7 గంటలకు చోటు చేసుకుంది. ఘటనలో అభిషేక్ అక్కడికక్కడే చనిపోగా మరో భారతీయ యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అదే భవంతిలో కింది అంతస్తులో ఉన్న మరో విదేశీ యువకుడు అగ్నికీలల్ని గుర్తించి ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. సుమారు రెండు గంటల పాటు శ్రమించిన సౌత్ లండన్ అగ్నిమాపక సిబ్బంది తెల్లవారుజామున 2.47 గంటల సమయానికి మంటలను అదుపులోకి తెచ్చారు. యువకుల నివాసం అధిక భాగం చెక్కతో నిర్మితం కావడం ప్రమాద తీవ్రతను పెంచిందని తెలిపారు. అభిషేక్ మూడేళ్ల క్రితం హోం సైన్స్ పూర్తి చేసి ఎంఎస్ చేసేందుకు లండన్ వెళ్లాడు. అక్కడ ఎంఎస్ పూర్తి చేసి స్థానికంగా ఉద్యోగం చేస్తున్నాడు. అభిషేక్ తండ్రి ఆస్కార్‌రావు ఏలూరు జిల్లా అగిరిపల్లి ఆరోగ్య కేంద్రం పరిధిలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఈయన ఉద్యోగ వేదిక చైర్మన్‌గా, ఏపీజీఈఏ జనరల్ సెక్రటరీగా, ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడిగా ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కీలక హోదాల్లో పనిచేశారు. ఆస్కార్‌రావు, రాధిక దంపతుల ఏకై క కుమారుడు అభిషేక్, ఇతడికి ఇద్దరు అక్కలు ఉన్నారు. వీరిలో షమీమా కెనడాలో వైద్యురాలిగా స్థిరపడ్డారు. షకీనా వైద్యురాలిగా విజయవాడలో పనిచేస్తున్నారు. అభిషేక్ మృతదేహం దేశానికి చేరేందుకు కనీసం వారం రోజులు పట్టవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు. కాగా..ఆస్కార్‌రావుకు పలువురు సానుభూతి తెలిపారు.
జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా డాక్టర్ కెనడీ


