కల్తీ పాల ఘటనకు చంద్రబాబే బాధ్యత తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

కల్తీ పాల ఘటనకు చంద్రబాబే బాధ్యత తీసుకోవాలి

Feb 26 2026 7:38 AM | Updated on Feb 26 2026 7:38 AM

కల్తీ పాల ఘటనకు చంద్రబాబే బాధ్యత తీసుకోవాలి

కల్తీ పాల ఘటనకు చంద్రబాబే బాధ్యత తీసుకోవాలి

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): కల్తీ పాల వల్ల రాజమహేంద్రవరంలో జనం మృతి చెందిన ఘటనకు పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబే తీసుకోవాలని మాజీ ఎంపీ హర్షకుమార్‌ అన్నారు. ఆయన బుధవారం రాజమహేంద్రవరంలో విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం, అధికారుల అసమర్థత, నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందన్నారు. పాల కేంద్రాలను ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేయాలన్నారు. కానీ సంవత్సరాల తరబడి తనిఖీలు చేపట్టకపోవడం వల్ల ఈ మరణాలు సంభవించాయన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో వ్యవస్థలు సరిగ్గా పనిచేయడం లేదన్నారు. ఈ ఘటనకు సంబంధించిన అధికారులను ఈ పాటికే సస్పెండ్‌ చేయాలన్నారు. పుష్కరాల సమయంలో చంద్రబాబు అతి ప్రచారం వల్ల 29 మంది చనిపోయారన్నారు. ఇటీవల సింహాచలం, తిరుమల, శ్రీకాకులం వంటి పుణ్యక్షేత్రాలలో భక్తులు చనిపోయారన్నారు. ఇటువంటి వరస ఘటనలు చూస్తూ ఉంటే చంద్రబాబు సైకో మైండ్‌ సెట్‌ అర్థమవుతుందన్నారు.

ప్రవీణ్‌ పగడాలది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే

పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాలది ముమ్మాటికీ ప్రభుత్వాలు చేసిన హత్యేనని హర్షకుమార్‌ అన్నారు. ప్రవీణ్‌ను ఎవరు హత్యచేశారో, ఎందుకు చేశారో కూడా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు తెలుసునన్నారు. ఒక పాస్టర్‌ తాగుతూ వచ్చి ప్రమాదంలో మరణిస్తే, దానిపై మత విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయాలు చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు పలుమార్లు వ్యాఖ్యానించడం కోర్టును ప్రభావితం చేయడమేనన్నారు. ప్రవీణ్‌ కేసు కోర్టులో నడుస్తుండగా సీఎం ఎలా ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తారని ప్రశ్నించారు. ప్రవీణ్‌ పగడాల పోస్టుమార్టం రిపోర్టు చూస్తే ఆయన హత్యకు గురయ్యారని తెలిసిపోతుందన్నారు. ప్రవీణ్‌ పగడాల మరణించి 11 నెలలు గడచినా కోర్టులో ఎందుకు ప్రభుత్వం కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయలేదని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement