కల్యాణం.. కమనీయం
రాయవరం: వెదురుపాక విజయదుర్గా పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం (గాడ్) జన్మదిన వేడుకల్లో భాగంగా ఆదివారం పీఠం కల్యాణ శోభను సంతరించుకుంది. రెండో రోజు వేడుకల్లో భాగంగా పీఠంలోని విజయదుర్గమ్మ వారిని నయనానందకరంగా అలంకరించారు. వేద పండితులు దుర్గాఅష్టోత్తర, సహస్ర నామార్చలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. తమిళనాడు రాష్ట్రం శ్రీరంగంలో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీరంగనాథ స్వామివారి కల్యాణం ఇక్కడ వైభవంగా సాగింది. శ్రీరంగం రంగనాథస్వామి ఆలయ అర్చకులు నరసింహభట్టార్, ఆచార్య విశ్వక్షేన అమృతసేన మల్లాప్రగడ రామకృష్ణమాచార్యులు, నందకిషోర్‌లు స్వామివారి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. పీఠం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఉత్సవ విగ్రహాలకు పీఠాధిపతి గాడ్ సమక్షంలో తొలుత వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకించి తులసీ దళాలతో అర్చనలు చేశారు. పీఠాధిపతి గాడ్‌కు ఆలయ అర్చకులు వేదాశీర్వచనాలు అందజేశారు. హిందూ ధర్మ పరిరక్షణ సమితి రీజినల్ మాజీ కోఆర్డినేటర్ కందర్ప హనుమాన్ తదితరులు హాజరయ్యారు. పీఠం అడ్మినిస్ట్రేటర్ వీవీ బాపిరాజు, పీఆర్వో వాడ్రేవు వేణుగోపాల్ (బాబి), విజయదుర్గా సేవా సమితి ప్రతినిధులు గాదె భాస్కరనారాయణ, సత్యవెంకటకామేశ్వరి, పెదపాటి శ్రీనివాసమూర్తి, సత్యకనకదుర్గ, బలిజేపల్లి రమ, బుజ్జి తదితరుల ఆధ్వర్యంలో పీఠానికి హాజరైన భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు.
నేడు ‘గాడ్’ జన్మదిన వేడుకలు
విజయదుర్గా పీఠాధిపతి వాడ్రేవు వెంకటసుబ్రహ్మణ్యం (గాడ్) 90వ జన్మదిన వేడుకలు సోమవారం నిర్వహించనున్నారు. గాడ్ జన్మదిన వేడుకలను నిర్వహించేందుకు కమిటీ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ వేడుకలకు ప్రసార భారతి రిటైర్డ్ డీడీ డాక్టర్ ఆర్.అనంత పద్మనాభరావు అధ్యక్షత వహిస్తారని, ముఖ్య అతిథులుగా డాక్టర్ మేడసాని మోహన్, రిటైర్డ్ జడ్జి ఏవీ శేషసాయి, రిటైర్డ్ డీజీపీ ఆర్‌ఆర్ గిరీష్‌కుమార్, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ ఎల్‌వీ సుబ్రహ్మణ్యం, పలువురు ఆధ్యాత్మిక ప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నట్లు పీఠం అడ్మినిస్ట్రేటర్ బాపిరాజు తెలిపారు.
విజయదుర్గా పీఠంలో ఆధ్యాత్మిక సందడి
కల్యాణం.. కమనీయం


