
ఆ సీటు యమ హాటు..!
సాక్షి, రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ సీటు హాట్‌కేక్‌గా మారింది. గోదావరి పుష్కరాలు 2027లో జరగనున్నాయి. రూ.2 వేల కోట్ల నిధులు పుష్కరాలకు కేటాయించనున్నారు. అభివృద్ధి పనుల్లో సింహభాగం కార్పొరేషన్ కార్యాలయం కేంద్రంగా జరగనున్నాయి. పనులకు సంబంధించి బిల్లుల మంజూరు, వసతుల కల్పన, భక్తులకు సౌకర్యాలు, నిధులు ఖర్చుచేయడం తదితర ప్రక్రియంతా కమిషనర్ కనుసన్నల్లోనే జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాజమండ్రి కమిషనర్ సీటుకు ప్రాధాన్యం ఏర్పడింది. ఎలాగైనా కుర్చీ దక్కించుకునేందుకు కొందర అధికారులు ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పైరవీలు ప్రారంభించారు.. తీరా రంగంలోకి దిగాక.. ‘ఆ సీటు యమ టఫ్’ అని గ్రహించి ప్రయత్నాలు విరమించుంటున్నారు. వెరసి కమిషనర్ నియామకం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. ఇదిలా ఉంటే మరో వైపు తమ అడుగులకు మడుగులొత్తే కమిషనర్‌ను తెచ్చుకుంటే రూ.కోట్ల విలువైన పనులు దక్కించుకోచ్చన్న ఉద్దేశంతో తమకు అనుకూలమైన అధికారిని తెచ్చుకునేందుకు రాజకీయ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది.
ఇప్పటికే ఓ కమిషనర్ బలి!
రాజమహేంద్రవరం రూరల్, రాజమహేంద్రవరం సిటీ టీడీపీ నేతల మితిమీరిన రాజకీయ జోక్యానికి ఇప్పటికే ఓ కమిషనర్ బలయ్యారు. తాను కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాది గడవకముందే ఇక్కడ పనిచేయలేనంటూ విశాఖకు బదిలీ చేయించుకుని వెళ్లిపోయారంటే ఏ స్థాయిలో రాజకీయ ఒత్తిళ్లు ప్రభావం చూపాయన్న విషయం అర్ధమవుతోంది. ఏడాది పాలనలో తనదైన ముద్ర వేసుకున్న బదిలీ అయిన కమిషనర్ కేతన్‌గార్గ్... నగరాన్ని సుందరంగా, అక్రమణలు లేకుండా తీర్చిదిద్దాలని భావించారు. అక్రమ నిర్మాణాల్ని తొలగించడంలో భేదాల్లేకుండా వ్యవహరించారు. దీనికి ఓ ప్రజాప్రతినిధి అడుగడుగునా అడ్డంకులు సృష్టించినట్లు విమర్శలున్నాయి. ఏదైనా అక్రమ నిర్మాణం తొలగించేందుకు మున్సిపల్ అధికారులు వెళ్లిన సందర్భంలో వెంటనే ఆ అధికారులకు ఓ ప్రజాప్రతినిధి నుంచి వెంటనే ఫోన్ వచ్చేది. అది తమ వారిదేనని, దాని జోలికి వెళ్లొద్దంటూ హుకుం జారీ చేసేవారు. చేసేది లేక వెనుదిరిగి వచ్చేవారు. ప్రధాన రహదార్ల ఆక్రమణలు తొలగించడంతో రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లను ఎదుర్కొన్నారు. కాంట్రాక్టర్లు చేపట్టిన ప్రతి పనినీ స్వయంగా పరిశీలించి నాణ్యత విషయమై కఠినంగా వ్యవహరించే వారు. తను సంతృప్తి చెందితేనే బిల్లులు మంజూరు చేసేవారు. దీంతో ఎలాగైనా కమిషనర్‌ను బదిలీ చేయించాలని కూటమి నేతలు భావిస్తూ వచ్చారు. ప్రజా ప్రతినిధుల వద్ద పైరవీలకు తెర తీశారు. దీంతో విసుగెత్తిపోయిన కమిషనర్ తాను ఇక్కడ ప్రశాంతంగా పనిచేయలేనని భావించి స్వయంగా బదిలీ కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. ప్రభుత్వం ఇటీవల విశాఖపట్నం కార్పొరేషన్‌కు బదిలీ చేసింది. జిల్లా కలెక్టర్ ప్రశాంతికి కమిషనర్ బాధ్యతలు అప్పగించింది. బదిలీ అయి నెల కావస్తున్నా.. నేటీకీ పూర్తి స్థాయి కమిషనర్ నియామకం జరగలేదు.
మితిమీరుతున్న రాజకీయ జోక్యం?
రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్‌లో రాజకీయ జోక్యం మితిమీరుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో మున్సిపల్ పాలన సాగుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన అనుమతి లేనిదే చీమకూడా కదలకూడదన్న ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేకంగా తన వ్యక్తిగత సహాయకుణ్ణి ఉంచి మరీ పాలన సాగిస్తున్నట్లు సమాచారం. నగరంలో ఎన్ని అపార్ట్‌మెంట్లు, భవన నిర్మాణాలకు టౌన్‌ప్లానింగ్ అధికారులు అనుమతులు ఇచ్చారు? అందులో ఎన్ని కమర్షియల్.. ఎన్ని నాన్ కమర్షియల్..? అన్న లెక్కలు తీస్తున్నారు. కమర్షియల్ భవన యజమానుల జాబితా తీసుకుని వారిని సంప్రదించి తమకేంటంటూ..? టార్గెట్లు పెట్టి మరీ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ పరిణామం మున్సిపల్ అధికారులకు తలనొప్పిగా పరిణమించింది. మున్సిపల్ అధికారులకు ప్రధాన ఆదాయ వనరు భవన నిర్మాణాల అనుమతులు. వాటిలో సైతం రాజకీయ జోక్యంతో అధికారులు ఆదాయాన్ని కోల్పోతున్నారు. తమకు అందే ఆదాయాన్ని అడ్డుకుంటే తమ ప్రొటోకాల్ ఖర్చులు ఎలాగన్న ఆందోళన వ్యక్తమవుతున్నట్లు సమాచారం. ఈ పరిస్థితులన్నీ బేరీజు వేసుకుంటున్న అధికారులు కమిషనర్‌గా వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదన్న ఆరోపణలున్నాయి. పుష్కరాలు వస్తున్నాయి.. రూ.కోట్ల అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉన్నా.. రాజకీయ నేతల జోక్యం తలనొప్పిగా పరిణమించే అవకాశం ఉండటంతో వెనకడుగు వేస్తున్నారు.
రాజమహేంద్రవరం
కార్పొరేషన్ కార్యాలయం
ఇద్దరి మధ్యా భిన్నాభిప్రాయాలు
రాజమహేంద్రవరం కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణలో ఇప్పటికే రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్ వర్గాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజమహేంద్రవరం రూరల్‌కు చెందిన విలీన గ్రామాలతో కలిపి ఎన్నికలు నిర్వహించాలని గోరంట్ల పట్టుబడుతుండగా.. విలీనం లేకుండానే ఎన్నికలకు వెళ్లాలని ఆదిరెడ్డి వర్గం వాదిస్తోంది. ఈ వ్యవహారం ఇప్పటికే సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లింది. ఇరు వర్గాలపై సీఎం చంద్రబాబు సైతం అసహనం వ్యక్తం చేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2027లో జరిగే పుష్కర పనుల్లో సైతం వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వ్యక్తం అయ్యే అవకాశాలు ఉన్నాయి. తమ కార్యకర్తలకు పనులు ఇవ్వాలంటూ ఇద్దరూ పట్టుబట్టే అవకాశం ఉంది. ఇద్దరి మధ్య తాము నలిగిపోవడం ఎందుకులే..? అన్న అభిప్రాయంతో కమిషనర్‌గా వచ్చేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
హాట్‌కేక్‌గా రాజమండ్రి మున్సిపల్
కమిషనర్ స్థానం
స్థానిక రాజకీయ పరిస్థితులు,
పైరవీకారులతో వచ్చేందుకు
హడలెత్తిపోతున్న అధికారులు
తొలుత బాధ్యతలు
చేపట్టేందుకు సుముఖం
ఆపై ఎలా ఉంటుందో
ఆరా తీశాక వెనకడుగు
స్వేచ్ఛగా విధులు నిర్వర్తించలేమన్న
అసహనం
ఇప్పటికే కమిషనర్‌గా పనిచేసిన
కేతన్‌గార్గ్ విశాఖకు బదిలీ
చేయించుకొని వెళ్లిన వైనం
ఆయన స్థానంలోకి నలుగురు పోటీ..
ఆపై ఆగిన ప్రయత్నాలు
ఇన్‌చార్జ్ కమిషనర్‌గా
కలెక్టర్‌కు బాధ్యతలు
పోటీ తీవ్రం..
రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ కుర్చీ కోసం నలుగురు అధికారులు పోటీ పడినట్టు సమాచారం. తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేసి బదిలీపై వెళ్లిన ఓ అధికారి నియామకానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. సదరు అధికారి మంత్రి లోకేష్‌కు అత్యంత ఆప్తుడని ఇక నియామక ఉత్తర్వులు రావడమే తరువాయి అన్న విధంగా ప్రచారం సాగింది. ఇక్కడి అధికార పార్టీ నేతలు ఆయన తమకు వద్దని చెప్పడంతో ఆ ప్రక్రియ మధ్యలోనే ఆగింది. అనంతరం రాజమండ్రిలో సబ్‌కల్టెర్‌గా విధులు నిర్వర్తించిన మరో అధికారిణి పేరు ప్రముఖంగా వినిపించింది. తాజాగా నెల్లూరులో విధులు నిర్వహిస్తున్న ఓ అధికారి పేరు విపరీతంగా చర్చకు వచ్చింది. ఇక రేపో మాపో నియామక ఉత్తర్వులు సైతం వెలువడే అవకాశం ఉందనే సమాచారం అందింది. ఆ అధికారి వస్తే తమ పంట పండినట్లేనని అధికార పార్టీ నేతలు అనుకున్నారు. ఆ అధికారి సైతం రాజమహేంద్రవరం అనగానే ఓకే అనేశారు. ఇంతలోనే ఏమైందో ఏమో.. సదరు అధికారి ఇక్కడకు వచ్చేందుకు ప్రస్తుతం వెనకడుగు వేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.