
బ్యాంకులు, ఏటీఎంల వద్ద భద్రత
– ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశం
రాజమహేంద్రవరం రూరల్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడెన్స్ ప్రకారం బ్యాంకులు, ఏటీఎంల వద్ద నిర్దేశిత భద్రతా ప్రమాణాలు తప్పక పాటించాలని ఎస్పీ డి.నరసింహకిషోర్ ఆదేశించారు. గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని వివిధ బ్యాంకు అధికారులు, సెక్యూరిటీఅధికారులతో బ్యాంకులు, ఏటీఎంల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన సమావేశం నిర్వహించారు. బ్యాంకులు, ఏటీఎంల వద్ద నేర నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు, భద్రత పరంగా తీసుకోవలసిన చర్యల గురించి పి.పి.టి. ద్వారా జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ వివరించి సూచనలు చేశారు. బ్యాంకు విధుల్లో నియమించుకునే తాత్కాలిక సిబ్బంది, అవుట్ సోర్సింగ్ భద్రతా సిబ్బందికి ముందుగా పోలీసు వెరిఫికేషన్ తప్పనిసరిగా చేయించాలన్నారు. ప్రతి బ్యాంకు, ఏటీఎం వద్ద 24 గంటలూ పనిచేసే నైట్ విజన్ ఏఈ సీసీటీవీలను అమర్చుకోవాలన్నారు. ఏదైనా అనుకోని ఘటన జరిగినప్పుడు బ్యాంకు అధికారులకు కాల్ చేసే సౌకర్యంతో కూడిన భద్రతా అలారం వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. సెక్యూరిటీ, ఫైర్ సెక్యూరిటీ పరికరాల పనితీరును క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలని తెలిపారు. విడిగా ఉన్న ఏటీఎంలు, బ్యాంకుల వద్ద తప్పనిసరిగా సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాలన్నారు. బ్యాంకు సిబ్బంది పోలీసు సిబ్బందితో సంబంధాలు ఏర్పరుచుకోవాలని, అత్యవసర సమయాలలో సంప్రదించడానికి వీలుగా పోలీసు అధికారుల కాంటాక్ట్ డీటెయిల్స్ కలిగి ఉండాలని తెలిపారు. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన సర్వెలెన్స్ రిపోర్టును సంబంధిత స్టేషన్‌కు విధిగా పంపాలన్నారు. బీట్ పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తూ, సెక్యూరిటీ గార్డులను, వాచ్‌మన్లను అలర్ట్ చేయాలని ఆదేశించారు. డిస్ట్రిక్ట్ లీడ్ బ్యాంక్ మేనేజర్ ప్రసాద్, అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) ఎన్.బి.ఎం మురళీకృష్ణ, అడిషనల్ (ఎస్పీ లా అండ్ ఆర్డర్) ఏవీ సుబ్బరాజు, అడిషనల్ ఎస్పీ ( క్రైమ్స్) ఎల్. అర్జున్, డి.ఎస్.పి.(ఎస్‌బీ) బి.రామకృష్ణ,, జోనల్ డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.