
కమ్యూనిటీ హాల్ అమ్మేశారంటూ జనసేన నేతపై ఫిర్యాదు
సఖినేటిపల్లి: జనసేన నాయకుడు ఒకరు కుటుంబ సభ్యులతో కలసి క్రైస్తవ కమ్యూనిటీ హాల్ అండ్ చర్చిని అమ్మేశారంటూ సంఘ సభ్యులు సఖినేటిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ నిధులతో నిర్మించి, కామన్ కమ్యూనల్ ప్రోపర్టీగా ఉన్న శాంతినగర్ క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ అండ్ చర్చిని ఆక్రమించుకోవడానికి కుట్రలు పన్నుతున్న వారిపైన, ఇందుకు సహకరించిన వారిపైన చర్యలు తీసుకోవాలని శుక్రవారం పోలీసులకు ఇచ్చిన పై ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. సంఘ అధ్యక్షుడు గొల్లమందల వసంతరావు, కార్యదర్శి గంటా రాజ్ కుమార్, కోశాధికారి పల్లికొండ వెంకటరమణ, క్రైస్తవ సమాజ సభ్యులైన గొలమందల వినయ్‌బాషా, సంఘ సభ్యులు కలిసి పై ఫిర్యాదు చేశారు.
సఖినేటిపల్లి శాంతినగర్‌లో ఎనిమిది సెంట్ల భూమిలో కామన్ కమ్యూనిటీ హాల్ అండ్ చర్చి ఉంది. చర్చికి సంబంధించి 500 మంది సభ్యులు ఉన్నారు. తొలుత 2017లో ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక గ్రాంటుతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం జరిగింది. సభ్యులు దీనినే చర్చిగానూ ఉపయోగిస్తున్నారు. పలువురు దాతలు చర్చి అభివృద్ధికి విరాళాలు ఇచ్చారు. అప్పట్లో చర్చి అభివృద్ధి చేస్తున్న సమయంలో తాత్కాలిక అధ్యక్షుడిగా తాడి నారాయణమూర్తి పేరును చర్చి మీద రాసి హక్కుదారుడిగా పేర్కొన్నారు. కాగా కమ్యూనిటీ హాల్, చర్చికి సంబంధించిన విషయంలో రెండు నెలలుగా సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. వివాదం ముదిరి పాకాన పడడంతో పంచాయతీ పోలీసుల వరకూ వెళ్లింది. సంఘ పాలక వర్గ సభ్యులు తమపై దాడులు చేశారంటూ జనసేనకు చెందిన సీనియర్ నాయకుడు, తన వ్యతిరేక వర్గంపై స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించారు. అధికారం అడ్డుపెట్టుకుని తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆ జనసేన లీడర్‌పై ఇటీవల రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌కు సంఘ సభ్యులు ఫిర్యాదు చేశారు. వివాదం ఇలా ఉండగా జూలై 26న కమ్యూనిటీ హాల్ అండ్ చర్చి భవనాన్ని జనసేన లీడర్, కుటుంబ సభ్యులు కలిసి, తమ తాతయ్య నారాయణమూర్తి, చర్చి స్థలదాత గెడ్డం సుందరమ్మ ద్వారా స్వీకరించిన దాన పట్టాపై తమ కుటుంబానికి హక్కులు ఉన్నాయని నారాయణమూర్తి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. నారాయణమూర్తి కుటుంబ సభ్యులు మా గ్రామంలోని కొంత మందితో కలిసి, కమ్యూనిటీ హాల్ అండ్ చర్చి ఆస్తులను ఆక్రమించుకోవడానికి కుట్రలు పన్నుతున్నారని ఫిర్యాదులో సంఘ సభ్యులు పేర్కొన్నారు. క్రీస్తు లూథరన్ చర్చి ప్రతినిధి బర్రే అబ్రహంకు అనుకూలంగా కుట్రపూరిత రిజిస్టర్ సెటిల్మెంట్ డీడ్‌ను అమలు చేశారని, రాజోలు సబ్ రిజిస్ట్రార్‌తో కుమ్మకై అక్రమ రిజిస్ట్రేషన్ చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. ఈ సెటిల్మెంట్ డీడ్‌ను అమలు చేయడంలోను, కమ్యూనిటీ హాల్ అండ్ చర్చి ఆస్తులను ఆక్రమణలో భాగస్వాములైన, సహకరించిన మొత్తం 12 మందిపై చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదులో కోరారు.