
గాయకుడి గొంతు మూగబోయింది
● గొంతు ఇన్ఫెక్షన్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రాము
● ఆపరేషన్ కోసం రూ.1.80 ఖర్చవుతుందని నిర్ధారించిన వైద్యులు
● ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు
నిడదవోలు : జూనియర్ గద్దర్‌గా పేరుగాంచిన దళిత సామాజిక జానపద కళాకారుడి గొంతు మూగబోయింది. వేలాది వేదికలపై తన గానంతో శ్రోతలను ఉత్తేజపరిచిన గాయకుడి గొంతు మూగపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారింది. నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామానికి చెందిన దళిత కళా మండలి వ్యవస్థాపకుడు, జానపద కళాకారుడు భావన రాము కొంతకాలంగా గొంతు ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. ఆయనకు భార్య కమలమ్మ, పుట్టుకతోనే మూగ అయిన కుమార్తె ఉన్నారు. రామును చాలామంది జూనియర్ గద్దర్ అని కూడా పిలుచుకుంటారు. గొంతు ఇన్ఫెక్షన్‌తో రాము రాజమహేంద్రవరంలోని అంజనా వైద్యాలయ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి వైద్యులు గొంతులో కణితిలు ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం రాము మాట కూడా పడిపోయింది. సకాలంలో గొంతు సర్జరీ చేయకపోతే అది గొంతు క్యాన్సర్‌కు దారితీస్తుందని వైద్యులు చెప్పడంతో ఆందోళన చెందుతున్నారు. గొంతు సర్జరీకి రూ.1.80 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో పూట గడవడం కష్టంగా ఉన్న రాము దాతల ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నాడు. గాయకుడు రాము ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకు అకౌంట్ నంబర్ 06420100 0043780కు సాయం అందించాలని కోరుతున్నారు.