
కాకినాడ జీజీహెచ్‌లో వివాదం
విచారణకు త్రి సభ్య కమిటీ నియామకం
కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్‌లో ట్యూబెక్టమీ (కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్స) చేయించుకున్న ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబసభ్యులు ఆరోపించారు. వివరాల్లోకి వెళితే, కాకినాడ జగన్నాథపురానికి చెందిన పలపాల సుధారాణి(21)ని సోమవారం కుటుంబ సభ్యులు కాకినాడ జీజీహెచ్‌లో చేర్చారు. మంగళవారం ఆమెకు ట్యూబెక్టమీ నిర్వహించారు. అనంతరం ఆమెను జీఐసీయూకి తరలించారు.
ఆ సమయంలో పల్మనరీ ఎడీమా సంభవించి ఉదరం నుంచి పదార్థాలు ఊపిరితిత్తుల్లోకి చేరాయి. పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై అనుసంధానం చేశారు. రెండు రోజుల పాటు వైద్యులు ఆమెను రక్షించేందుకు శ్రమించగా శుక్రవారం ఉదయం 6.53 సమయానికి కార్డియాక్ అరెస్ట్ సంభవించి ప్రాణాలు కోల్పోయింది. కాకినాడ జీజీహెచ్ వైద్యుల నిర్లక్ష్యం వల్లే సుధారాణి ప్రాణాలు కోల్పోయిందని మృతురాలి కుటుంబీకులు ఆరోపించారు.
కూతురికి పేరు పెట్టకుండానే...
సుధారాణికి దుర్గాప్రసాద్‌తో 2017లో వివాహం అయింది. దుర్గాప్రసాద్ కార్పెంటర్ కాగా అతడికి చేదోడు వాదోడుగా సుధారాణి పలుచోట్ల పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకురావడంతో తోడుగా నిలుస్తోంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. ఐదేళ్ల బాబు వీర లోకేష్ కాగా, నెలన్నర క్రితం పుట్టిన కుమార్తెకు కనీసం పేరు కూడా పెట్టలేదు. తన కుమార్తెకు మంచి పేరు పెట్టాలని సుధారాణి అందరినీ అడిగిందని, మంచి పేరు సూచించాలని కోరిందని, పండంటి బిడ్డకి పేరు పెట్టకుండానే ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
మరణం వివాదాస్పదమైన తరుణంలో వాస్తవాలను వెలికి తీసేందుకు త్రి సభ్య కమిటీని నియమించారు. సర్జరీ హెచ్‌వోడీ డాక్టర్ పి.నరేష్‌కుమార్, పాథాలజీ ప్రొఫెసర్ డాక్టర్ సుజీవ స్వప్న, ఫోరెన్సిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పి.రాజేష్‌కుమార్ కమిటీ సభ్యులుగా ఉన్నారు. సుధారాణి మృతదేహానికి శుక్రవారం పోస్ట్‌మార్టం నిర్వహించారు. అంతకుముందు జీఐసీయూలో సుధారాణి మృతదేహాన్ని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి, డీసీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్ మెహర్ పరిశీలించారు.