● అభివృద్ధి పనులన్నీ జనసేన సభ్యుల వార్డులకే కేటాయిస్తారా?
● మున్సిపల్ సమావేశాన్ని బహిష్కరించిన 13 మంది వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు
నిడదవోలు : పురపాలక సంఘంలో జనసేన పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, మున్సిపల్ కమిషనర్ టి.కృష్ణవేణి తమ పట్ల తీవ్ర వివక్ష చూపిస్తున్నారని వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం జరిగిన నిడదవోలు మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశాన్ని వారు బహిష్కరించారు. 13 మంది వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ల వార్డుల్లో ఒక్క పనిని కూడా అజెండాలో చేర్చకపోవడంతో నల్లబ్యాడ్జీలు ధరించి మున్సిపల్ సమావేశానికి హాజరయ్యారు. సమావేశం ప్రారంభంలోనే నిరసన వ్యక్తం చేస్తూ సమావేశాన్ని బహిష్కరించి బయటికి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ కామిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ పురపాలక సంఘంలో జనసేనకు చెందిన 14 మంది కౌన్సిలర్ల వార్డుల్లో 16 పనులకు గాను మున్సిపల్ సాధారణ నిధులు రూ.78 లక్షలతో సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీ నిర్మాణానికి అంచనాలు తయారు చేసి అజెండాకు తీసుకువచ్చారన్నారు. పురపాలక సంఘంలో ఉన్న 13 మంది వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ల వార్డులో మాత్రం ఒక్క పని కూడా కేటాయించకుండా చైర్మన్ ఆదినారాయణ పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేము కూడా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులమని, మా వైఎస్సార్ సీపీ సభ్యుల వార్డుల్లో పనులు కేటాయించడంలో ఎందుకు వివక్ష చూపుతున్నారని ప్రశ్నించారు. ఇలాంటి వివక్ష మేమున్నడూ చూడలేదన్నారు. దీనిపై మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ సమాధానమిస్తూ అత్యవసర పనులు కొన్ని వార్డులకు కేటాయించామన్నారు. త్వరలో పట్టణానికి ఎల్‌ఆర్‌ఎస్ నిధులు రూ.2 కోట్లు మంజూరు కాగానే అన్ని వార్డులకు అభివృద్ధి పనులు కేటాయిస్తామన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎలగడ బాలరాజు, 13 మంది వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించారు.