
కడియం నర్సరీ అందాలు అద్భుతం
కడియం: నర్సరీ అందాలు అద్భుతంగా ఉన్నాయని రాష్ట్ర ఉద్యాన శాఖ డైరెక్టర్ కె. శ్రీనివాసులు తెలిపారు. గురువారం ఆయన కడియపులంక శ్రీ సత్యదేవ నర్సరీని సందర్శించారు. ఆ నర్సరీ రైతు పుల్లా పెద సత్యనారాయణ మొక్కనిచ్చి స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ నర్సరీ రైతులకు ప్రభుత్వ ద్వారా తగిన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ పాటిస్తూ నర్సరీలను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన సూచించారు. వైఎస్సార్ హెచ్ ఓ డైరెక్టర్ బి.గోవిందరాజు, కొవ్వూరు పరిశోధన క్షేత్రం ప్రిన్సిపాల్ డాక్టర్ పి.లలిత కుమారేశ్వరి, సీనియర్ సైంటిస్టులు డాక్టర్ రవీంద్ర కుమార్, డాక్టర్ వి శివకుమార్, ఏపీఎంఐపి పిడి ఎ. దుర్గేష్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ఎన్. మల్లికార్జునరావు, కడియం ఉద్యాన శాఖ అధికారి పి.లావణ్య పాల్గొన్నారు.
జర్మనీ భాషలో ఉచిత శిక్షణ
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో గల ఎస్సీ,ఎస్టీ కులాలకు చెందిన నర్సింగ్ పట్టభద్రులకు జర్మనీ భాషలో బి2 స్థాయి కోసం ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశం కల్పించటానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని జిల్లా ఎస్సీ సంక్షేమ, సాధికారత శాఖ అధికారి ఎమ్.డి. గవాజుద్దీన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి దరఖాస్తు చేసుకునే విద్యార్థి వయసు 35 సంవత్సరములు లోపు ఉండాలన్నారు. బీఎన్‌ఎం గాని, బీఎస్సీ నర్సింగ్ కోర్సు గాని చదివి ఉండాలన్నారు. ఆసక్తి గల విద్యార్థినీ విద్యార్థులు ఆగస్టు 6వ తేదీలోపు అన్ని ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపిక అయిన విద్యార్ధులకు 8 నుంచి 10 నెలల వరకు ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తామన్నారు. శిక్షణ విశాఖపట్నం, గుంటూరు, తిరుపతిలలో మాత్రమే ఇస్తారన్నారు. పూర్తి వివరాల కోసం మొబైల్ నంబర్లు: 99488 68862, 83400 94688 లలో సంప్రదించాలన్నారు.
రేపు అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ యోజన నిధుల జమ
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): అన్నదాత సుఖీ భవ – పీఎం కిసాన్ పథకాల కింద మంజూరైన నిధులను శనివారం రైతుల బ్యాంకు ఖాతాల్లో జ మ చేయనున్నట్లు కలెక్టర్ పి.ప్రశాంతి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన ప్రతి రైతు ఖాతాలో రూ.7,000 చొప్పున, జిల్లావ్యాప్తంగా మొత్తం రూ.79 కోట్లు జమ చేయనున్నట్టు తెలిపారు. ఇందులో రూ.2,000 పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం అందిస్తుండగా, రూ.5,000 అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.ఆరు వేలు , రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలు చొప్పున సంవత్సరానికి మొత్తం రూ.20,000 లను మూడు విడతల్లో నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తాయని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలో 1,434 ఖాతాల ఎన్‌పీసీఐతో అనుసంధానం కాలేదని, మరో 1,072 ఖాతాలు అనుసంధానమైనా ‘ఇన్ యాక్టివ్‘గా ఉన్నాయనీ కలెక్టర్ పేర్కొన్నారు. కాల్ సెంటర్: 155251, వాట్సాప్ గవర్నెన్స్ నంబర్: 95523 00003, స్థానిక రైతు సేవా కేంద్రాలలో సంప్రదించవచ్చు అని కలెక్టర్ తెలిపారు.
రెవెన్యూ సిబ్బందిపై
కలెక్టర్ ఆగ్రహం
రాజానగరం: విధులను నిర్వర్తించడంలో అలసత్వం చూపిస్తున్న నందరాడ, నరేంద్రపురం (ఇన్‌చార్జ్) వీఆర్వోలు ముని తిరుపతి, ఎం.సత్యనారాయణలపై జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిద్దరినీ తక్షణమే కలెక్టరేట్‌కి అటాచ్ చేయాలని తహాస్లీల్దారు జీఎఎస్‌ఎల్ దేవిని ఆదేశించారు. పీఎం కిసాన్ యోజన, అన్నదాత సుఖీభవ పథకాల అమలు తీరును పర్యవేక్షించడంలో భాగంగా మండలంలోని నందరాడ, నరేంద్రపురంలోని రైతు సేవా కేంద్రాలను గురువారం ఆమె ఆకస్మికంగా పరిశీలించారు. రికార్డుల నిర్వహణ, డేటా ఎంట్రీ, ఇతర అనుబంధ కార్యక్రమాలను పరిశీలించారు. విధులను నిర్వర్తించడంలో అలక్ష్యంగా వ్యవహరిస్తున్న పై ఇద్దరు వీఆర్వోలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది అలక్ష్యం చూపడం సరికాదన్నారు.

కడియం నర్సరీ అందాలు అద్భుతం