
బదిలీ భారం
అమలాపురం టౌన్: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మినిమమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్) విధానంలో పనిచేస్తున్న 220 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ప్రస్తుతం బదిలీల బాధలు, దూరాభారాలతో సతమతమవుతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మూడేళ్ల కిందట వీరికి ఎంటీఎస్ విధానంలో ఉపాధ్యాయ ఉద్యోగాలు వచ్చాయి. తర్వాత ఏడాదికి జరిగిన బదిలీల ప్రక్రియలో ఉమ్మడి జిల్లాలోని దగ్గర మండలాల్లో ఉన్న పాఠశాలల్లోనే పోస్టులు ఇచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక గత జూన్ నెలలో జరిగిన ఎంటీఎస్ ఉపాధ్యాయుల బదిలీల్లో అనేక లోపాలతో వీరిని 100 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న పాఠశాలలకు పంపించారు. 220 మంది ఎంటీఎస్ ఉపాధ్యాయుల్లో దాదాపు 75 మందిని ఏకోపాధ్యాయ పాఠశాలలకు బదిలీలు చేయడమే కాకుండా వారికి ప్రధానోపాధ్యాయ బాధ్యతలు అప్పగించారు.
యాప్‌ల భారం
కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే ఎంటీఎస్ ఉపాధ్యాయులకు ఏడాదిలో 11 నెలల పాటు, అదీ నెలకు రూ.32,470 మాత్రమే జీతం వస్తుంది. మే నెలలో వీరికి జీతం ఉండదు. కూటమి ప్రభుత్వం ఈ ఎంటీఎస్ ఉపాధ్యాయులను 100 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న పాఠశాలకు బదిలీ చేసి, వారిలో కొందరికి ప్రధానోపాధ్యాయ బాధ్యతలు అప్పగించింది. వారిపై యాప్‌ల భారాన్ని బలవంతంగా మోపింది. గత ప్రభుత్వంలో ఈ తరహ ఉపాధ్యాయులను కేవలం సపోర్టింగ్ టీచర్లగానే భావించి, వారిని సమీప మండలాలకు బదిలీ చేసింది. గత జూన్ 23న కాకినాడలో ఎంటీఎస్ ఉపాధ్యాయులు డీఈవో కార్యాలయం వద్ద ఒక రోజు నిరసన దీక్ష చేపట్టారు. కేవలం బదిలీల్లో లోపాలతో తమను బలవంతంగా దూరంగా నియమిస్తున్నారని, కొందరికి ఏకోపాధ్యాయ పాఠశాలలకు హెచ్‌ఎంలను చేసి యాప్‌ల బాధ్యతలు అప్పగించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు.
నిర్బంధ బదిలీలు!
ఉన్నతాధికారులు తమను నిర్బంధంగా బదిలీలు చేశారన్న ఆవేదన, ఆందోళన ఎంటీఎస్ ఉపాధ్యాయుల నుంచి వ్యక్తమవుతోంది. ఉదాహరణకు తుని నుంచి ముమ్మిడివరానికి, సామర్లకోట నుంచి ఐ.పోలవరం మండలానికి, రాజమహేంద్రవరం నుంచి అడ్డతీగలకు ఎంటీఎస్ ఉపాధ్యాయులను బదిలీలు చేశారు. అసలే కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు, బదిలీల భారం ఒక ఎత్తు అయితే హెచ్‌ఎంగా బాధ్యతలు అప్పగించి యాప్‌ల భారాన్ని మోపడం మరో ఎత్తు. దీని ప్రభావం విద్యాబోధనపై తీవ్రంగా పడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దూరాభార బదిలీల వల్ల అనారోగ్య ఉపాధ్యాయులు, దివ్యాంగులు, మహిళలు చాలా అవస్థలకు గురవుతున్నారు. కాంట్రాక్టు పద్ధతిలో నెలకు ఇచ్చే జీతం రూ.32,470తో అంత దూరం వెళ్లి ఎలా పనిచేయగలరని ప్రశ్నిస్తున్నారు. ఒక వేళ వెళ్లినా సగం జీతం రవాణా ఖర్చులకే సరిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎంటీఎస్ ఉపాధ్యాయుల ఆవేదన
ఏకోపాధ్యాయ పాఠశాలలకు
హెచ్‌ఎంలుగా నియామకం
దూర ప్రాంతాలకు బదిలీ
యాప్‌లతో ఇబ్బంది
కాంట్రాక్టు ఉపాధ్యాయులుగా చాలీ చాలనీ జీతాలతో బతుకుతున్న మమ్మల్ని వంద కిలోమీటర్లకు పైబడి దూరంలో ఉన్న పాఠశాలలకు బదిలీలు చేయడం అన్యాయం. మాలో కొందరిని ఏకోపాధ్యాయ పాఠశాలలకు బదిలీలు చేసి ప్రధానోపాధ్యాయుడి బాధ్యతలు అప్పగించారు. యాప్‌ల భారం పెట్టడం ఎంత మాత్రం సమంజసం కాదు. మాలో కొందరు ఉద్యోగ విరమణకు దగ్గరగా ఉన్నారు. ఈ సమయంలో అంత దూరం బదిలీలు, ప్రధానోపాధ్యాయుడి బాధ్యతులు, యాప్‌ల భారం సరైన విధానాలు కాదు. మేము చేసిన అభ్యర్థనలు, నిరసనలను విద్యాశాఖ ఉన్నతాధికారులు పట్టించుకోలేదు.
– ఎ.బాల గోపాలరావు, ఎంటీఎస్ ఉపాధ్యాయుడు

బదిలీ భారం