
కాకినాడ జిల్లా(సామర్లకోట): స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న యార్లగడ్డ అక్కిరాజు మున్సిపల్ హైస్కూల్‌లో క్షుద్రపూజలు జరిగినట్లు జోరుగా ప్రచారం జరిగింది. శుక్రవారం విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చే సమయానికి పాఠశాల ఆవరణలో ముగ్గులు వేసి నిమ్మకాయలు, పసుపు, కుంకుమతో పూజలు చేసిన విషయాన్ని గుర్తించారు. దాంతో అప్పటికే పాఠశాలకు వచ్చిన కొంతమంది విద్యార్థులు ఈ రోజు పాఠశాల లేదు అంటూ ఇళ్లకు వెళ్లి పోవడం ప్రారంభించారు. దాంతో విషయాన్ని గమనించిన సైన్సు ఉపాధ్యాయురాలు ఏఎల్‌వీ కుమారి ఆవరణలో ఉన్న నిమ్మకాయలను తీసి వేసి ముగ్గులను చెరిపించారు.
విద్యార్థులను క్లాసు రూములకు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చారు. హెచ్‌ఎం కె.శ్రీదేవి వచ్చిన తరువాత విషయం తెలుసుకొని ఎదురుగా షాపులో ఉన్న సీసీ కెమెరాలో గురువారం సాయంత్రం ఏడు గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు దృశ్యాలను పరిశీలించారు. ఆ దృశ్యాలలో పాఠశాల ఆవరణలోకి ఎవరూ వచ్చినట్లు కనిపించలేదు. దాంతో ఉపాధ్యాయులు ఉపిరి పీల్చుకున్నారు.
ఈ మేరకు పాఠశాల హెచ్‌ఎం శ్రీదేవి మాట్లాడుతూ పాఠశాలలోని ఆకతాయి విద్యార్థులు చేసిన పనిగా అనుమానం వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం సమయంలో విద్యార్థులు ఈ పని చేసి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు విద్యార్థులకు సీఐ ఎ కృష్ణ భగవాన్‌తో కౌన్సెలింగ్ ఇప్పిస్తామని తెలిపారు. విద్యార్థులు పాఠశాలకు రాకుండా ఉండటానికి ఇటువంటి పని చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులతో కూడా సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. పాఠశాలలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని హెచ్‌ఎం తెలిపారు.