
కొవ్వూరు: ఐదు శాతం పన్ను రాయితీ అందిపుచ్చుకున్నారు.. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని పన్నుదారులు సద్వినియోగం చేసుకుంటున్నారు.. మున్సిపాలిటీల్లో ఈ రాయితీకి విశేష స్పందన లభిస్తోంది. గడచిన ఇరవై నాలుగు రోజుల్లో కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల పరిధిలో ఏకంగా రూ.28.63 కోట్ల పన్నులు వసూలయ్యాయి.
గత ఏడాదితో పోల్చితే రూ.4.79 కోట్లు అదనంగా వసూలైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2023–24 ఆర్థిక సంవత్సరానికి చెల్లించాల్సిన ఆస్తి, ఖాళీ స్థలాల పన్నులు ఈ నెల 30వ తేదీలోపు చెల్లిస్తే ప్రభుత్వం ఐదు శాతం పన్ను రాయితీని ప్రకటించిన విషయం తెలిసిందే. కేవలం ఈ రాయితీ పొందడానికి మరో ఐదు రోజులే గడువే ఉంది.
దీనిపై పురపాలక సంఘాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఏడాదిలో చెల్లించాల్సిన పన్ను అంతా ఏకమొత్తంలో కడితే ఐదు శాతం రాయితీ లభిస్తుంది. మిగిలిన రోజుల్లో మరో రూ.నాలుగైదు కోట్లు వసూలయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఏ జిల్లాలో ఎంతెంత..
ప్రస్తుతం సాధారణ రోజుల్లో కంటే పన్నుల వసూళ్లు నాలుగైదు రెట్లు అదనంగా ఉంది. గత ఏడాది మే 24 నాటికి తూర్పుగోదావరి జిల్లాలో రూ.1,017.73 లక్షలు వసూలైతే ప్రస్తుతం రూ.1,307.76 లక్షలు వచ్చింది. అంటే రోజుకు గత సంవత్సరం రూ.42.40 లక్షలు సరాసరి కాగా ఇప్పుడు రూ.54.49 లక్షల చొప్పున పన్నులు చెల్లించారు.
రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్‌లో గరిష్టంగా రోజుకు సరాసరిన రూ.48 లక్షల నుంచి రూ.50 లక్షల చొప్పున పన్నులు వసూలవుతున్నాయి. కొవ్వూరులో రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల చొప్పున, నిడదవోలులో రూ.3 లక్షల చొప్పున వస్తుంది.
ఫ కాకినాడ జిల్లాలో గత ఏడాది రూ.1,080.37 లక్షలు వసూలైతే ఈ సంవత్సరం రూ.1,323.21 లక్షలు వసూలు చేశారు. అంటే గడచిన ఏడాది కంటే ఇప్పుడు రూ.242.84 లక్షలు అదనంగా వసూలైంది. రోజుకు పన్ను వసూలు సరాసరి రూ.45 లక్షల నుంచి రూ.55.13 లక్షలకు పెరిగింది.
ఫ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మాత్రం ఐదు శాతం పన్ను రాయితీ అంత ఆశాజనకంగా లేదు. గత ఏడాదితో పోల్చితే ఈ సారి రూ.53.9 లక్షలు తక్కువ వసూలైంది. జిల్లా వ్యాప్తంగా గడచిన ఆర్థిక సంవత్సరంలో రూ.286.13 లక్షలు వసూలైతే ఈ ఏడాది 24వ తేదీకి రూ.232.23 లక్షలు వచ్చింది. జిల్లాలో రోజువారీ సరాసరి పన్నుల వసూలు గత ఏడాది రూ.11.92 లక్షలుంటే, ఇప్పుడు రూ.9.67 లక్షలు ఉంది.