
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇంటర్మీడియెట్ జనరల్ ప్రాక్టికల్స్ పరీక్షలు ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆ వివరాలను ఇంటర్ బోర్డు ఆర్‌ఐవో ఎన్‌ఎస్‌వీఎల్ నరసింహం శుక్రవారం తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 142 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. ప్రాక్టికల్స్ నాన్ జంబ్లింగ్ విధానంలో పూర్తి సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరగనున్నాయి. ఈ పరీక్షలకు బోటనీ, జువాలజీ విభాగాల్లో 9 వేల 794 మంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో 32,289 మంది పరీక్షలు రాయనున్నారు. వోకేషనల్ విభాగంలో రెండో దశ ప్రాక్టికల్ పరీక్షలు 41 కేంద్రాల్లో జరగనున్నాయి. పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించేందుకు వివిధ స్థాయిల్లో స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటలు, మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రెండు సెషన్స్‌లో ఈ పరీక్షలు జరగనున్నాయి.