సహకార పోరుకు సిద్ధం! | - | Sakshi
Sakshi News home page

సహకార పోరుకు సిద్ధం!

Nov 13 2026 12:34 AM | Updated on Nov 13 2026 12:34 AM

● పీఏసీఎస్‌లకు త్వరలో ఎన్నికలు?

● ఓటర్ల జాబితా తయారీలో సిబ్బంది

● ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో

298 సొసైటీలు

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌) ఎన్నికలకు త్వరలో నగరా మోగనుంది. ఈ మేరకు రాష్ట్ర సహకార శాఖ కమిషనర్‌, సహకార సంఘాల రిజిస్ట్రార్‌ ఈ నెల 7న సహకార అధికారులకు సర్క్యులర్‌ జారీ చేశారు. దీంతో పీఏసీఎస్‌ల పరిధిలో సిబ్బంది సర్క్యులర్‌లో పేర్కొన్న అంశాల ఆధారంగా అర్హులైన ఓటర్ల జాబితా రూపకల్పనపై దృష్టి సారించారు.

కొత్తపేట: రాష్ట్రంలో గ్రామ పంచాయతీల ఎన్నికలు ఈ నెల 26, 29, డిసెంబర్‌ 2వ తేదీల్లో జరగనున్నాయి. అవి పూర్తి కాగానే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌) ఎన్నికలు జరుగుతాయని సమాచారం. పీఏసీఎస్‌లకు చివరిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013లో ఎన్నికలు జరిగాయి. ఆ పాలక వర్గాల పదవీ కాలం 2018లో ముగిసినప్పటికీ ఆ తర్వాత వివిధ కారణాల వల్ల ఎన్నికలు జరగలేదు. అప్పటి నుంచీ ప్రభుత్వాలు పర్సన్‌ ఇన్‌చార్జులు, త్రిసభ్య కమిటీలను నియమిస్తూ వచ్చాయి. 13 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో మళ్లీ పీఏసీఎస్‌లకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా రాష్ట్ర సహకార శాఖ.. ఓటర్ల జాబితా తయారీ, సభ్యుల ఈ–కేవైసీ పూర్తి చేయడం, పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు వంటి చర్యలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించింది.

సిబ్బంది అప్రమత్తం

సహకార ఎన్నికలను ఓకే దశలో డిసెంబర్‌ చివరి వారంలో, లేదా వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. అయితే ఎన్నికల సంఘం నుంచి అధికారిక నోటిఫికేషన్‌, కచ్చితమైన తేదీలు ఇంకా విడుదల కాలేదు. ఈ లోపు ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పీఏసీఎస్‌ల సిబ్బందిని జిల్లా ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు.

వీరికే ఓటు హక్కు

సంఘంలో వాటా ధనంగా రూ.300 సభ్యత్వ రుసుము చెల్లించిన భూ యజమానులు, పంట సాగు హక్కు కార్డు (సీసీఆర్‌సీ)గానీ, వీఆర్‌ఓ ధ్రువీకరించి, పీఏసీఎస్‌కు చెందిన మరో ఇద్దరు సభ్యులు సాక్షులుగా సంతకం చేసిన కౌలు ఒప్పంద పత్రం సమర్పించిన కౌలు రైతులు, ఆర్థిక లావాదేవీలు నిర్వహించే వారికి ఓటు హక్కు ఉంటుంది. అన్ని పీఏసీఎస్‌లను డిజిటలైజ్‌ చేసినందున ప్రతి సభ్యుడు ఆధార్‌ కార్డుతో ఈ–కేవైసీ చేయించాలి. రుణాలు చెల్లించక డీఫాల్టర్‌ అయిన వారికి ఓటు హక్కు నిరాకరిస్తారు. మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌ సహకార సంఘాల చట్టం 1964 ప్రకారం సభ్యత్వ నమోదు, ఓటర్ల అర్హతలు, అనర్హతలను నిర్దేశిస్తారు. పీఏసీఎస్‌ల వారీగా సభ్యత్వ వివరాలు ధ్రువీకరించి అర్హులైన ఓటర్ల తుది జాబితా సిద్ధం చేయాల్సి ఉంది. సభ్యత్వం ఉన్నప్పటికీ పూర్తి వివరాలు లేకుంటే ఈ–కేవైసీ డ్రైవ్‌ నిర్వహించాలి. ప్రాథమిక ఏర్పాట్లు, జాబితాలపై పది రోజుల్లో నివేదికలు ఇవ్వాలని ఉన్నతాధికారులు సూచించారు.

ఒకే విడతలో నిర్వహణ

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా (కాకినాడ డీసీసీబీ పరిధి) పీఏసీఎస్‌లకు ఒకే విడతలో ఎన్నికల నిర్వహణకు వీలుగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం పోలింగ్‌ కేంద్రాల గుర్తింపుతో పాటు ఎన్నికల సామగ్రి, బ్యాలెట్‌ బాక్స్‌లు లభ్యత, స్ట్రాంగ్‌ రూమ్‌లను గుర్తించడంతో పాటు ఎన్నికల నిర్వహణలో అనుభవం ఉన్న సిబ్బందికి ముందుగానే శిక్షణ ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పటికీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి డీసీసీబీ, డీసీఎంస్‌ సంయుక్తంగానే ఉన్నాయి. జిల్లాల విభజన జరిగినప్పటికీ సహకార వ్యవస్థను కొత్త జిల్లాల పరిధిలో విభజించలేదు. ఈ క్రమంలో కొత్త జిల్లాల ప్రాతిపదికన డీసీసీబీ, డీసీఎంస్‌లను విభజించాల్సి ఉంది. అయితే ఆ ప్రక్రియచేపట్టాలంటే ఎన్నికల నిర్వహణ జాప్యం జరుగుతుంది. అందువల్ల ఉమ్మడి జిల్లా డీసీసీబీ పరిధి ప్రాతిపదికన ఎన్నికలు నిర్వహిస్తారని సమాచారం.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో..

జిల్లా సహకార కేంద్ర బ్యాంకు

(డీసీసీబీ) 1 (కాకినాడ)

జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ

(డీసీఎంఎస్‌) 1 (కాకినాడ)

డీసీసీబీ బ్రాంచ్‌లు 53

పీఏసీఎస్‌లు 298

పీఏసీఎస్‌లలో

సభ్యత్వం ఉన్న రైతులు 5,10,337

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement