● 19 జెడ్పీటీసీ, 372 ఎంపీటీసీ
స్థానాలకు నేడు ఎన్నికలు
● ఉదయం 7 నుంచి సాయంత్రం
5 గంటల వరకూ నిర్వహణ
● 1,294 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
అమలాపురం రూరల్: జిల్లాలో పరిషత్ ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. గురువారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. సిబ్బంది బుధవారమే బ్యాలెట్ బాక్సులు, పత్రాలు, ఇతర సామగ్రితో తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుని, ఎన్నికల నిర్వహణకు సిద్ధమయ్యారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకోకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ముంపులో పోలింగ్ కేంద్రాలు
జిల్లాలోని కొన్ని పోలింగ్ కేంద్రాలు బుధవారం కురిసిన భారీ వర్షానికి ముంపు బారిన పడ్డాయి. అమలాపురం మండలం ఎ.వేమవరప్పాడు యూపీ స్కూల్‌లోని పోలింగ్ కేంద్రం ముంపు బారిన పడింది. దీంతో, దీనిని పంచాయతీ కార్యాలయానికి మార్చారు. మలికిపురం, కాట్రేనికోన, ఐ.పోలవరం, రాజోలు తదితర మండలాల్లోని పోలింగ్ కేంద్రాల్లో తుపాను కారణంగా వారం రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో, ఎన్నికల సిబ్బంది ఇబ్బందులు పడుతుతున్నారు.
నిష్పక్షపాతంగా ఎన్నికలు
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో సజావుగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్, జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకురాలు పి.ప్రశాంతి, జెడ్పీ సీఈఓ వసంత మాధవి ఆదేశించారు. మలికిపురం మండలంలో బుధవారం వారు పర్యటించి, ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు, విద్యుత్ పునరుద్ధరణ చర్యలు, పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను పరిశీలించారు. లక్కవరం దొడ్డా ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. గుడిమెళ్లంక జెడ్పీ హైస్కూలులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించి, అక్కడి మౌలిక సదుపాయాలు, విద్యుత్ సరఫరా పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
జిల్లాలో ‘పరిషత్’ ఎన్నికల వివరాలు
జెడ్పీటీసీలు
మొత్తం స్థానాలు 19
పోటీ చేస్తున్న అభ్యర్థులు 75
ఎంపీటీసీలు
మొత్తం స్థానాలు 379
ఏకగ్రీవం 7
ఎన్నికలు జరుగుతున్నవి 372
పోటీ చేస్తున్న అభ్యర్థులు 835
పోలింగ్ కేంద్రాలు
పోలింగ్ కేంద్రాలు 1,294
సున్నితమైనవి 258
అత్యంత సమస్యాత్మకం 389
వెబ్ కాస్టింగ్ ఉన్నవి 647
రిటర్నింగ్ అధికారులు 22
అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు 40
ప్రిసైడింగ్ అధికారులు 1,554
ఇతర పోలింగ్ సిబ్బంది 7,726
జోనల్ అధికారులు 64
మైక్రో అబ్జర్వర్లు 290
ఓటర్లు
పురుషులు 5,43,470
మహిళలు 5,47,489
ఇతరులు 16
మొత్తం 10,90,975


